US Presidential Elections : కమలా హారీస్ ది భారతదేశమే. అయితే చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు అమెరికా వెళ్లి స్థిరపడిపోవడంతో.. ఆమె భారత మూలాలు ఉన్న అమెరికన్ అయిపోయింది. నాలుగు సంవత్సరాలపాటు సమర్థవంతంగా ఉపాధ్యక్షురాలి బాధ్యతను నిర్వర్తించింది. బైడన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె తన వంతు పాత్ర పోషించింది. అయితే ఇటీవల కాలంలో పెరిగిపోతున్న నిరుద్యోగం.. ప్రపంచంపై చైనా పెత్తనం సాగించడం.. ఇతర పరిణామాలు డెమొక్రటిక్ పార్టీకి ఇబ్బందులుగా పరిణమించాయి. ఇవి అంతిమంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ట్రంప్ జోరు కొనసాగించడానికి కారణమయ్యాయి. అయితే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో దూకుడు కొనసాగిస్తున్నప్పటికీ.. కమల గట్టి పోటీ ఇచ్చారు. ట్రంప్ విజయం కేక్ వాక్ లాగా కాకుండా తీవ్రంగా ప్రతిఘటించారు. మెజారిటీ స్థానాలను దక్కించుకున్నారు. అయితే స్వింగ్ స్టేట్స్ లో కమల వెనుకబడిపోవడం ట్రంప్ కు కలిసి వచ్చింది. లేకుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం మరో విధంగా ఉండేది. స్వింగ్ స్టేట్స్ లో గతంలో డెమొక్రటిక్ అభ్యర్థులు సత్తా చూపించగా.. ఈసారి రిపబ్లికన్ అభ్యర్థులు దూకుడు ప్రదర్శించారు.
బాలయ్య మానియా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగువారు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా కాలం క్రితం వారు అమెరికా వెళ్లిపోవడంతో..ఆ దేశ పౌరసత్వం లభించింది. ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కూడా దక్కింది. అయితే మన దేశంలో లాగా అక్కడ ఎన్నికల వ్యవస్థ ఉండదు. అక్కడ పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. అమెరికాలో ఎన్నికలు నిర్వహించేందుకు కమిషన్ ఉండదు. ఆయా రాష్ట్రాలే ఎన్నికల నిర్వహణ చేపడతాయి . అదే అమెరికాలోని ఓ ప్రాంతంలో తెలుగు మూలాలు ఉన్న ఓ వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తనకు సమీపంలోని కేంద్రంలోకి వెళ్లారు. ఓటు వేసే క్రమంలో ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి చేశారు. చివరికి అక్కడ బాలయ్య అని పేరు రాశారు. దానిని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సంచలనంగా మారింది. ” తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలోనూ బాలయ్య హవా నడుస్తోంది. దానికి నిదర్శనమే ఈ చిత్రం. ఒకరకంగా బాలయ్య కూడా అమెరికా ఎన్నికల్లో కీలకపాత్ర పోషించారు. తెలుగువారు ఎక్కువగా రిపబ్లికన్ పార్టీకి ఓట్లు వేశారు. ఇదంతా బాలయ్య ఘనత కాబట్టి ట్రంప్ కచ్చితంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు. కాగా, అమెరికా వ్యాప్తంగా బాలకృష్ణకు లెక్కకు మిక్కిలి అభిమాన సంఘాలు ఉన్నాయి. ఆయా సినిమాలు అమెరికాలో భారీ స్థాయిలో విడుదలవుతుంటాయి. ఆ సినిమాలను చూసేందుకు అభిమానులు పోటీ పడుతుంటారు. గతంలో అఖండ సినిమా విడుదలైన సమయంలో బాలకృష్ణ అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.