Govt employees salary twice a month: శీర్షిక చదివి ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతులు వేస్తారు కావచ్చు. వారెవా ఏం అవకాశం.. అనుకుంటూ సంబరాలు చేసుకుంటారు కావచ్చు. ప్రభుత్వ సంస్థ అయినా.. ప్రైవేట్ కంపెనీ అయినా.. ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తారు. కొన్ని సంస్థలు వాళ్లకు నచ్చిన తేదీలలో జీతాలు చెల్లిస్తాయి. ఉద్యోగుల సేవలను గుర్తించిన కొన్ని సంస్థలు దీపావళి సందర్భంగా అడ్వాన్స్ ఇస్తాయి. దసరా సందర్భంగా బోనస్ ఇస్తుంటాయి. కొన్ని కంపెనీలు అయితే ఉద్యోగులకు ఖరీదైన కానుకలు ఇస్తాయి. ఏ కంపెనీ కూడా ఉద్యోగులకు నెలకు రెండుసార్లు వేతనం ఇవ్వడం కుదరదు. ప్రపంచం మొత్తం దాదాపు ఇదే విధానం ఉంటుంది. కానీ ఒక దేశం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు రెండుసార్లు వేతనం ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఇటీవల నేపాల్ దేశంలో చోటుచేసుకున్న సంఘటనలు అక్కడి ప్రభుత్వాన్ని మొత్తం మార్చేశాయి. ప్రభుత్వ అధినేతలు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొందరు జైలు పాలయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ జన్ జెడ్ తరం కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. తమ దేశానికి ఎవరు నాయకుడైతే బాగుంటుందో ఊహించింది. బలేంద్ర షా కు పట్టం కట్టింది.
నేపాల్ దేశానికి ప్రధానమంత్రిగా బలేంద్ర వ్యవహరిస్తున్నారు. ఉన్నత విద్యావంతుడైన ఈయన తన దేశాన్ని బాగు చేయడానికి అనేక రకాల ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలలో రెండుసార్లు వేతనం ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 15 రోజులకు ఒకసారి వేతనాన్ని ఇస్తామని బలేంద్ర ప్రకటించారు. దీనివల్ల నగదు ప్రవాహం పెరుగుతుందని.. ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని ఆయన చెబుతున్నారు..”నేపాల్ దేశం బాగుపడాలి. పర్యాటకం నుంచి మొదలు పెడితే మౌలిక వసతులకు వరకు అన్నిట్లో మెరుగుపడాలి. ఇదంతా జరగాలంటే నగదు ప్రవాహం ఉండాలి. అందువల్లే ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు రెండుసార్లు వేతనం ఇస్తామని ప్రకటించాం. దీనిని త్వరలోనే అమలులోకి తీసుకొస్తామని” బలేంద్ర ప్రకటించారు.
జనరేషన్ జెడ్ ఉద్యమం వల్ల నేపాల్ లో చాలా వరకు నష్టం చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు తగలబడిపోయాయి. ప్రైవేట్ ఆస్తులు కూడా లూటీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు తాము నడుచుకుంటామని బలేంద్ర ప్రకటించారు. అంతేకాదు దీర్ఘకాల అభివృద్ధిపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. నగదు ప్రవాహాన్ని పెంచి.. ప్రజలలో కొనుగోలు శక్తిని పెంచుతామని.. తద్వారా ఆర్థిక వ్యవస్థకు సరికొత్త బలాన్ని అందిస్తామని బలేంద్ర వెల్లడించారు. అయితే 15 రోజులకు ఒకసారి వేతనం ఇవ్వడం పట్ల మెజారిటీ ఉద్యోగులు అంతగా సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఖర్చులు పెరిగిన నేపథ్యంలో.. వేతనం రెండుసార్లు వస్తే సర్దుబాటు చేయడం కష్టమవుతుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.