North Korea: ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్.. తన నియంత పాలనతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. అయినా తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. తాను మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఇక తమ దేశానికి పొరుగున ఉన్న అగ్రరాజ్యం అమెరికాకు పక్కలో బల్లెంలా మారాడు. తరచూ కవ్వింపు చర్యలతో అమెరికాను బెదిరిస్తున్నాడు. అణు పరీక్షలతో అమెరికా ఉత్తర కొరియాపై సైనిక చర్యకు వెనుకాడుతోంది. ఇక కిమ్ తన మరో పొరుగు దేశం దక్షిణ కొరియానూ ఇబ్బంది పడుతున్నాడు. అమెరికాతో స్నేహంగా ఉంటుందన్న కారణంగా దక్షిణ కొరియాతో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నాడు. తాజాగా కిమ్ చేసిన ‘చెత్త’పని దక్షిణ కొరియా విమానాలకు ప్రాణ సంకటంగా మారుతోంది.
గాల్లోకి బెలూన్లు..
ఉత్తర కొరియాలోని చెత్తను.. బెలూన్లలో నింపి గాల్లోకి పంపిస్తున్నారు. తొలుత ఇది చిన్న సమస్యే అనిపించింది. కానీ రానురాను దక్షిణ కొరియా విమానాల రాకపోకలపై ప్రభావం చూపుతోంది. ఉత్తర కొరియా చెత్త బెలూన్ల కారణంగా జూన్ నుంచి తమ రాజధాని సియెల్‌కు చెందిన రెండు విమానాశ్రయాల రన్‌వేలు మూసివేయాల్సి వచ్చిందని ఆ దేశ ప్రతినిధులు తెలిపారు. ఉత్తర కొరియా తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.
రెండే ఎయిర్ పోర్టులపై ప్రభావం..
ఉత్తర కొరియా చెత్త బెలూన్లు దక్షిణ కొరియాలోని కీలకమైన రెండు ఎయిర్ పోర్టులపై ప్రభావం చూపుతున్నాయి. జూన్ 1 నుంచి ఇచియాన్, గింపో ఎయిర్ పోర్టుల్లోని కొన్ని రన్‌వేలను దాదాపు 20 రోజులు మూసి ఉంచారు. ఈ సమయంలో విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మొత్తం 413 నిమిషాలు(ఆరు గంటలకుపైగా) విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిందని దక్షిన కొరియా విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఇచియాన్ ప్రపంచంలో అత్యంత బిజీగా ఉండే విమానాశ్రయాల్లో ఐదో స్థానంలో ఉంది.
5,500 చెత్త బెలూన్లు..
ఉత్తర కొరియా ఈ ఏడాది మే నుంచి వేల సంఖ్యలో చెత్త నింపిన బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. ఇప్పటి వరకు సుమారు 5, 500 చెత్త బెలూన్లు దక్షిణ కొరియా గగన తలంలోకి వెళ్లాయి. ఈ బెలూన్లలో కరపత్రాలు కూడా ఉన్నాయి. ఈ బెలూన్లు దేశ అధ్యక్షుడి ఇంటి సమీపంలో కూడా పడినట్లు వర్తాలు వచ్చాయి. ఎయిర్‌పోర్టు రన్‌వేపై పడడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. జూన్ 26న ఇచియాన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టును మూడు గంటలు మూసివేశారు. తాజాగా సెప్టెంబర్ 23న కూడా 90 నిమిషాలు రన్‌వే మూసివేశారు.
2016లోనూ..
ఉత్తర కొరియా ఇలా చెత్త బెలూన్లు వదలడం ఇదే తొలిసారి కాదు.. 2016లోనూ ఇలాగే చెత్తను బెలూన్లలో నింపి దక్షిణ కొరియా గగనతలంలోకి పంపించారు. తాజాగా మళ్లీ అదే పని చేస్తున్నారు. ఇక ఈ బెలూన్లలో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైన షూలు, కాగితాలతోపాటు చెత్త, మురుగు మట్టి, జంతువుల విసర్జనాలు కూడా ఉన్నట్లు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. 2016లో పంపిన బెలూన్ల కారణంగా కొన్ని కార్లు, ఆస్తులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ కొరియా అప్రమత్తమైంది.