Silence : ఈ సందర్భాల్లో మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే ఉత్తమం.. ఎందుకంటే?

కొన్ని సందర్భాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మాట్లాడకపోవడమే మంచిదని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో మౌనంగా ఉండడం ఉత్తమం అంటారు. అటువంటి సందర్భాలు ఏవంటే?

Written By: Srinivas, Updated On : September 25, 2024 3:12 pm

Silence

Follow us on

Silence : నోరు మంచిదైతే… ఊరు మంచిదవుతుంది..’ అని అంటారు. మనుషుల మధ్య సంబంధాలు పెరగడానికి మాటలే ప్రధానం. మంచి మనసుతో మాట్లాడడం వల్ల సంబంధాలు బలపడుతాయి. కొందరు మాట్లడడం వల్ల వారితో ఎప్పుడూ కలిసి ఉండాలని అనిపిస్తుంది. మరికొందరు మాత్రం పరుష వ్యాఖ్యాలు చేస్తూ ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేస్తారు. అయితే ఎంత మంచిగా మాట్లాడినా ఒక్కోసారి వివాదాలు అవుతూ ఉంటాయి. ఇద్దరి మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు వారికి సర్దిజెప్పబోతే అది మరింత గొడవగా మారుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మాట్లాడకపోవడమే మంచిదని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో మౌనంగా ఉండడం ఉత్తమం అంటారు. అటువంటి సందర్భాలు ఏవంటే?

‘మౌనమేలనోయి’ అని కొందరు అంటుంటారు. ఏదో ఒకటి మాట్లాడాని ఎదుటివారి తాపత్రయం. కానీ ఇద్దరు వ్యక్తులు వాదనలు పెట్టుకున్నప్పుడు వారి మధ్యలోకి వెళ్లి మాట్లాడడం అంతమంచిది కాదు. ఎందుకటే ఈ సమయంలో ఎవరి వైపు మాట్లాడినా మరొకరు మీపై శత్రుత్వం పెంచుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇద్దరితో మిత్రుత్వం ఉండడానికి ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడం మంచిది.

కొందరు కొన్ని విషయాలపై ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారి మెప్పు కోసం ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నించవచ్చు. ఆ విషయం గురించి తెలియనప్పడు మౌనంగా ఉండడమే మంచిది. తాత్కాలికంగా తప్పు చెప్పి వారి మెప్పు పొందినా.. ఆ తరువాత సమయంలో అది నిజం కాదని తేలితే మీపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఇక నుంచి మీ మాట ఎవరూ వినరు.

ఎదుటి వారు ఏదైనా విషయం చెబుతున్నప్పుడు వారు చెప్పేది పూర్తిగా వినాలి. అంతేగానీ మధ్యలో వారి మాటలను కట్ చేసి మీరు మాట్లాడవద్దు. అలా చేయడం వల్ల ఇంకోసారి మీతో మాట్లాడడానికి వారు ఇష్టపడరు.దీంతో ఆ వ్యక్తితో సంబంధాలు చెరిగిపోతాయి. వారి విషయం పూర్తిగా విన్న తరువాతే మీరు మాట్లాడడం మొదలుపెట్టాలి.

కొన్ని విషయాలపై రూమర్లు వస్తుంటాయి. కొందరు అత్యుత్సాహంతో తమకు తెలిసినట్లుగా ప్రచారం చేస్తారు. అయితే ఇలాంటి వాటి విషయాల్లో కలగజేసుకోకూడదు. ఈ రూమర్స్ వివాదమైతే మొదలు పెట్టిన వారితో పాటు వారికి తోడుగా ఉన్న వారు చెడ్డవారుగా మారిపోతారు. అందువల్ల గాసిప్ ప్రచారానికి దూరంగా ఉండడమే మంచిది.

తప్పు చేయని వ్యక్తి అంటూ భూమ్మీద ఉండరు. కొందరు కావాలని తప్పు చేస్తే.. మరికొందరు అనుకోకుండా తప్పులో కాలేస్తారు.ఈ సమయంలో కొందరి నుంచి విమర్శలు వస్తాయి. ఇలాంటి సమయంలో రియాక్ట్ అవ్వడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. ఈ విమర్శలపై ప్రతిస్పందించడం వల్ల మరింత వివాదంగా మారుతూ మీకే నష్టం జరుగుతుంది.

ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఈ సమయంలో మాటల కంటే ఎక్కువగా ఆలోచనలే పనిచేయాలి. మౌనంగానే ఉంటూ దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ విషయంపై పట్టు సాధిస్తారు. అనుకున్న విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే సమయంలో మాటల కంటే మెదడు పనిచేసేలా చూడాలి.