Donald Trump : అగ్రరాజ్యం అమెరికా మాజీ అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు ప్రపంచ దేశాలధినేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అయితే రాజకీయ హింసకు సంబంధించిన ఇలాంటి ఘటనలు అమెరికాకు కొత్తేమీ కాదు. గతంలో పలువురు అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, పలు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులపై కూడా ఈ తరహా దాడులు జరిగాయి. 1776లో అమెరికా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న కొన్ని ఘటనలను పరిశీలిద్దాం.
అబ్రహం లింకన్ హత్య..
అమెరికాలో రాజకీయ హింసకు బలైనవారిలో మొదటివారు అబ్రహం లింకన్. 1865, ఏప్రిల్ 14న జాన్ విల్కెస్ బూత్ అనే దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో లింకన్ తల వెనుకభాగంలో తీవ్ర గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నల్ల జాతీయుల హక్కుల కోసం మద్దతుగా నిలవడమే ఆయన హత్యకు కారణం.
జేమ్స్ గార్ఫీల్డ్..
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే గార్ఫీల్డ్ హత్యకు గురయ్యాడు. 1881, జూలై 2న న్యూ ఇంగ్లాండ్ వెళ్లేందుకు వాసింగ్టన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో చార్లెస్ గిటౌ అనే దుండగుడు జరిపిన కాల్పుల్లో జేమ్స్ గాయపడ్డాడు. వైట్‌హౌస్‌లో అనేక వారాలు చికిత్స పొందారు, చివరకు సెప్టెంబర్‌లో మృతిచెందాడు.
విలియం మెక్‌కిన్లే..
అమెరికా 25వ అధ్యక్షుడు విలియం మెన్‌కిన్లే 1901 సెప్టెంబర్ 6న సామాన్యులతో కరచాలనం చేస్తుండగా కాల్పులు జరిగాయి. రెండ బుల్లెట్లు ఆయన ఛాతీలో నుంచి దూసుకుపోయాయి. దాదాపు వారంపాటు మృత్యువుతో పోరాడి సెప్టెంబర్ 14న తుది శ్వాస విడిచారు. రెండోసారి అద్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే హత్యకు గురయ్యాడు.
ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్..
అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ కారుపై 1932లో కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ ఘటనలో చికాగో మేయర్ ఆంటోన్ సెర్మాక్ మరణించారు.
హ్యారీ ఎస్ ట్రూమాన్..
అమెరికా 33వ అధ్యక్షుడు హ్యారీ ఎస్.ట్రూస్‌మన్‌పై 1952లో వైట్‌హౌస్ ఎదుట ఉన్న ప్లేయర్ హౌస్‌లో ఉన్న సమయంలో ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రూమన్‌కు ఏమీ కాలేదు. కానీ, ఒక దుండగుడు, ఒక పోలీస్ మరణించాడు.
జాన్ ఎఫ్ కెన్నడీ..
అమెరికా 35వ అధ్యక్షుడు జాజ్ ఎఫ్ కెన్నడీ కూడా హత్యకు గురయ్యాడు. 1963లో డల్లాస్‌ను సందర్శిస్తున్న సమయంలో జాన్ ఎఫ్ కెన్నడీపై కాల్పులు జరిగాయి. అధ్యక్షుడి కాన్వాయ్‌పై అత్యంత శక్తివంతమైన రైఫిల్‌తో దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే కెన్నడీని పార్క్‌లాండ్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. ఆయన అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
గెరాల్డ్ ఫోర్డ్‌పై
అమెరికా 38వ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్‌పై 1975లో వారాల వ్యవధిలో రెండుసార్లు దుండగులు కాల్పులు జరిపారు. రెండు సందర్భాల్లోనూ ఆయన తప్పించుకున్నారు.
రొనాల్డ్ రీడన్‌పై..
ఇక అమెరికా 40వ అధ్యక్షుడు రొనాల్డ్ రీడన్‌పై 1981, మార్చిలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. చికిత్స తర్వాత కోలుకున్నారు.
జార్జి డబ్ల్యూ బుష్‌పై..
ఇక అమెరికా 43వ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ 2005లో జార్జియన్ అద్యక్షుడుతో కలిసి ర్యాలీలో పాల్గొన్నసమయంలో ఒకరు గ్రెనేడ్ విసిరారు. అది వంద అడుగుల దూరంలో పడింది. పేలకపోవడంతో ప్రమాదం తప్పింది.