Frank Caprio Passed Away: న్యాయస్థానం.. అంటే ఆన్యాయానికి గురైనవారికి అండగా ఉండే వయవస్థ. జడ్జి అంటే న్యాయస్థానంలో తీర్పులు చెప్పే పెద్ద. సాధారణంగా న్యాయస్థానాలకు, జడ్జిలకు దయాదాక్షిణ్యాలను పరిగణనలోకి తీసుకోరు. వ్యక్తిగత విచక్షణ, కోర్టుకు సమర్పించే సాక్ష్యాధారాలే ప్రధానం. వాటి ఆధారంగానే తీర్పు వెల్లడిస్తారు. వంద మంది నేరస్థులు తప్పించుకున్నా పరవాలేదు కానీ ఒక్క నిర్దోశికి శిక్ష పడకూడదు అన్న విధానం మన దేశంలో అమలులో ఉంది. అందుకే కోర్టుల సాక్ష్యాధారాల ఆధారంగా తీర్పు ఇస్తాయి. అయితే ఈ జడ్జి మాత్రం దయామయుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. రోడ్ ఐలాండ్‌కు చెందిన ప్రొవిడెన్స్ మున్సిపల్ కోర్టు చీఫ్ జడ్జి ఫ్రాంక్ కాప్రియో(88) క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఆయన తీర్పులు, న్యాయస్థానంలో ఆయన చూపిన సానుభూతి ఆయనను ‘‘ప్రపంచంలోనే అత్యంత దయగల జడ్జి’’గా నిలిపాయి.
Also Read: విశాఖకు కేంద్రం గుడ్ న్యూస్!
కాప్రియో తీర్పుల ప్రత్యేకత..
ఫ్రాంక్ కాప్రియో తన విచారణల్లో చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి బదులు, నిందితుల వ్యక్తిగత పరిస్థితులను లోతుగా అర్థం చేసుకునేవారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు, జీవన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తీర్పులు ఇచ్చారు. పార్కింగ్ టికెట్ జరిమానా చెల్లించలేని వ్యక్తులకు సమాజ సేవ లేదా కమ్యూనిటీ సర్వీస్‌ను ఆదేశించడం ద్వారా ఆయన న్యాయానికి మానవీయ రూపం ఇచ్చారు. ఈ విధానం ఆయన తీర్పులను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మార్చింది, లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది.
సోషల్ మీడియాలో జనాదరణ
కాప్రియో తీర్పులు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ఆదరణ పొందాయి. ఆయన కోర్టు విచారణల వీడియోలు, నిందితులతో సానుభూతితో మాట్లాడే విధానం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించాయి. ఒక వృద్ధ మహిళ ఆర్థిక ఇబ్బందుల కారణంగా జరిమానా చెల్లించలేకపోతే, ఆమె కథను విని జరిమానాను రద్దు చేసిన సంఘటనలు ఆయన దయాగుణానికి నిదర్శనం. ఈ వీడియోలు కేవలం వినోదం కోసం కాక, న్యాయవ్యవస్థలో సానుభూతి ప్రాముఖ్యతను తెలియజేశాయి. కాప్రియో యొక్క తీర్పులు న్యాయవ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని తెలియజేస్తాయి. చట్టం అనేది కేవలం శిక్షల కోసం కాదు, సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావడానికని ఆయన నమ్మారు. ఆయన విధానం ఇతర న్యాయమూర్తులకు, న్యాయవాదులకు స్ఫూర్తిగా నిలిచింది. నేరం వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక కారణాలను పరిగణించడం ద్వారా న్యాయం మరింత సమతుల్యంగా, మానవీయంగా ఉంటుందని ఆయన రుజువు చేశారు.