UK Financial Crisis 2022: రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం.. సగానికంటే ఎక్కువ ప్రపంచాన్ని పాలించిన చరిత్ర.. ఇవీ ఆంగ్లేయుల గురించి మనం చెప్పుకునే మాటలు. గతం ఎంతో ఘనం.. నేడు మాత్రం అధ్వానం అనేలా తయారైంది ప్రస్తుతం వారి పరిస్థితి. క్రికెట్ నుంచి తాగే టి వరకు ఎన్నో కనిపెట్టిన వారి నైపుణ్యం ప్రస్తుతం ఆకలితో నకనకలాడుతోంది. అసలే మొన్నటిదాకా ప్రధాన మంత్రుల మార్పుతో ఇబ్బందిపడిన బ్రిటన్.. ఇప్పుడు సరికొత్త ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా లక్షలాది మంది ఒక్క పూట భోజనం చేస్తున్నారు. మొన్నటిదాకా పిజ్జా, బర్గర్లు పీకల దాకా మెక్కిన ఆ దేశ ప్రజలు.. ఇప్పుడు ఒక పూట భోజనంతోనే సరిపెట్టుకోవడం మాంద్యం తాలూకు సంక్షోభానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎందుకు ఈ పరిస్థితి అంటే
గ్రేట్ బ్రిటన్ ఆర్థిక మాంద్యం తినేస్తోంది. రవి అస్తమించని ఒకప్పటి సామ్రాజ్యానికి ఇప్పుడు రోజు గడవడమే కష్టం అవుతున్నది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ట్రస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బ్రిటన్ ను మరింత ఊబిలోకి నెట్టేస్తున్నాయి. దీంతో లక్షలాదిమంది తెల్లదొరలు ఒక్కపూట తిని, ఒక పూట మాని అర్థాకలితో అలమటిస్తున్నారు. దీనికి తోడు ఏప్రిల్ నుంచి ఇంధన ధరలపై కట్టడి విధిస్తామని ఆర్థిక మంత్రి జెరెమీ ప్రకటించిన నేపథ్యంలో అది మరింత ఆజ్యానికి దారి తీసింది. ఒకవేళ ఈ నిర్ణయం కనుక అమల్లోకి వస్తే ఇంగ్లాండ్ లోని సగం ఇళ్లల్లో స్టబ్ వెలిగే పరిస్థితి కనిపించదు. బ్రిటన్ లో 3,000 మందిపై ఓ వినియోగదారుల సంస్థ సర్వే నిర్వహించింది.. ఈ సందర్భంగా పలు దిగ్బ్రాంతి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బడ్జెట్లో కోతలు, ఆర్థిక నిర్ణయాలను తిరగదోడడం వంటి అపరిపక్వత చర్యలు సెప్టెంబర్ లో బ్రిటన్ మాంద్యం ఒక్కసారిగా 10 శాతానికి ఎగబాకింది.
దీనివల్ల ఏం జరిగిందంటే
ఆర్థిక మాంద్యం పెరగడం వల్ల దేశంలో ఆహార ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగాయి. బ్రిటన్ లో ప్రజలు ఎక్కువగా మాంసాహారం స్వీకరిస్తారు. వారు వాడే బీఫ్, చికెన్, మైదా, బ్రెడ్, జామ్, ఇంధన ధరలు చుక్కలను అంటుతున్నాయి. దీంతో జీవన వ్యయాలను తట్టుకునేందుకు ప్రజలు తిండిపై స్వచ్ఛందంగా కోతలు పెట్టుకున్నారు. దొరికింది తింటూ నాణ్యత విషయంలో పూర్తిగా రాజీ పడిపోతున్నామని బ్రిటన్ ప్రజలు చెబుతున్నారు.

ఇక ఇంధన ధరలపై నిర్ణయం అమల్లోకి వస్తే తమ పరిస్థితి అద్వానంగా మారుతుందని భయపడుతున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల యూరప్ లో నింగిని తాకిన ఇంధన ధరలను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రధాని లీజ్ ట్రస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటన్ పౌరులకు అది మంచి చేసే అవకాశం కనిపించడం లేదు. పైగా మంటలు రేపే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. వచ్చే చలికాలానికి ఇంధనం దొరకని పరిస్థితి వస్తే గడ్డకట్టి పోవాల్సి వస్తుందేమోనని బ్రిటన్ ప్రజలు భయపడుతున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఇంగ్లాండ్ శవాల దిబ్బగా మారిపోవడం ఖాయం. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఇంగ్లాండ్ ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావటం పూర్తి స్వయంకృతాపరాధం. కాగా మాంద్యం మళ్లీ ప్రపంచాన్ని ముంచేస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుత బ్రిటన్ పరిస్థితిని చూసి మిగతా దేశాలన్నీ వణికి పోతున్నాయి.