Elon Musk And Trump: ఎలాన్ మస్క్.. ప్రంపంచ కుబేరుల్లో ఒకరు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. నిధులు సమకూర్చారు. దీంతో గెలిచిన తర్వాత ట్రంప్ కూడా మస్క్‌కు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్) ఏర్పాటు చేసి చైర్మన్ పదవి అప్పగించారు. అయితే బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలతో మస్క్ డోజ్ నుంచి వైదొలిగారు. ఇటీవలే ట్రంప్ దంపతులు మస్క్‌తో లంచ్ మీటింగ్ నిర్వహించారు. దీంతో విభేదాలు సమసిపోయినట్లు అని అంతా భావించారు. కానీ, తాజా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గాజా శాంతి మండలిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)లో తొలిసారి పాల్గొన్న ఎలాన్ మస్క్ ఈ మండలిని ’పీస్’ (ముక్క)గా మలిచి, గ్రీన్‌లాండ్, వెనెజువెలాల్లా చిన్న ముక్క అని ఎగతాళి చేశారు. దీంతో వేదికపై ఉన్నవారంతా పెద్దగా నవ్వారు.
శాంతి కావాలి, దాడులు కాదు
ప్రపంచవాసులకు ఎప్పుడూ శాంతి మాత్రమే అవసరమని మస్క్ స్పష్టం చేశారు. ఒకవైపు యుద్ధాలను ప్రోత్సహిస్తూ.. ఇంకోవైపు శాంతి కమిటీ అంటూ శాంతి మంత్రం వళ్లించడంపై విమర్శలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ట్రంప్ గాజా మండలి ప్రకటనకు ఈ స్పందన ఆసక్తికరంగా మారింది.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, భార్యను అమెరికన్ దళాలు అరెస్టు చేసిన సంఘటన తెలిసింది. ఆ తర్వాత ట్రంప్ ఆ దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ప్రకటించారు. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేసేందుకు కూడా అధికార దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.