Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. అధికార మార్పిడికి సమయం ఆసన్నమవుతోంది.. రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా 2025, జనవరి 20న వైట్‌హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ తన మంత్రివర్గంలో ఉండే వారిని ఎంపిక చేశారు. ఇప్పటికే వారి పేర్లు ప్రకటించారు. విధేయులకు కీలక బాధ్యతలు అప్పగించారు. మరోవైపు వైట్‌హౌస్ కార్యవర్గంతోపాటు దేశ భవిష్యత్‌ను నిర్ణయించే కీలక శాఖలకు సమర్థులైన అధికారులను నియమించారు. డోజ్(డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్నీ)ని ఏర్పాటు చేసి దానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన అమెరికన్ వివేక్ రామస్వామిని కో చైర్మన్లుగా నియమించారు. ప్రభుత్వాన్ని నడిపించడంలో డోజ్ కీలకంగా పనిచేస్తుందని ప్రకటించారు. వీరంతా జనవరి 20 తర్వాత బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే వలసలపై ట్రంప్ దృష్టి పెడతారని తెలుస్తోంది. ఈమేరకు డోజ్ కో చైర్మన్లు మస్క్, వివేక్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.
ట్రంప్ విజయంలో కీలక పాత్ర..
ఇదిలా ఉంటే.. ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి కీలకపాత్ర పోషించారు. ట్రంప్ తరఫున స్వయంగా ప్రచారం చేశారు. మస్క్ అయితే సోషల్ మీడియా వేదికగా డిబేట్లు, ఇంటర్వ్యూలు నిర్వహించారు. యానిమేషన వీడియోలతో ప్రచారం చేశారు. ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెట్టారు. అందుకే ట్రంప్ కొత్త ప్రభుత్వంలో వారికి కీలక బాధ్యతలు అప్పించారు. అలాంటి వ్యక్తిపై ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అత్యంత సంపన్నుడు..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. కొత్తగా ఏర్పడే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ షాడో ప్రెసిడెంట్‌గా ఉంటాడని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా డెమొక్రటిక్ పార్టీ ఈ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ట్రంప్‌ను ఎన్నుకోబడని వ్యక్తి(మస్క్) ప్రభావింత చేయనున్నారని, అధికారం చెలాయించడానికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తోంది. రాబోయే రోజుల్లో అమెరికా ఆదాయ వ్యవహారాలన్నీ ట్రంప్.. ఎలాన్ మస్క్‌కే అప్పగిస్తాడని పేర్కొంటోంది. మస్క్ చేతుల మీదుగానే అన్నీ నడుస్తాయని ప్రచారం చేస్తోంది.
స్పందించిన ట్రంప్..
డెమొక్రటిక్ పార్టీ ప్రచారం నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆరిజోనా ఫీనిక్స్ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఎలాన్ మస్క్ ఏదో ఒకనాటికి అమెరికా అధ్యక్షుడు కాకపోతాడా అని ప్రశ్నించింది. దీనికి ఆయన నో అని చెప్పారు. కారణం కూడా వివరించారు. మస్క్ ఏనాటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడని తేల్చి చెప్పాడు. ఎందుకంటే మస్క్ ఈ దేశంలో పుట్టలేదని తెలిపారు. కాబట్టి అతడిని అధ్యక్షుడిగా అమెరికన్లు ఎన్నుకోబోరని తెలిపారు. అమెరికా గడ్డపై పుట్టిన వ్యక్తి మాత్రమే అమెరికా అధ్యక్షుడు అవుతాడని స్పష్టం చేశారు.
సౌత్ ఆఫ్రికాలో పుట్టిన మస్క్..
ఇదిలా ఉంటే ప్రపంచ కుబేరుడు సౌత్ ఆఫ్రికాలో పుట్టారు. అతని తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. మస్క్ ఇక్కడే పెరిగాడు. అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు. అనేక కంపెనీలు స్థాపించాడు. ఇదిలా ఉంటే.. రిపబికన్ పార్టీలో ట్రంప్ వ్యతిరేకవర్గం తయారవుతున్నట్లు మస్క్ ఇటీవలే ట్వీట్ చేశాడు. ప్రభుత్వ ఫండింగ్ సంస్థను విమర్శించారు.