Donald Trump : అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. 2025, జనవరి 20న అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంది. బాధ్యతల స్వీకరణకు ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో ట్రంప్ తన కేబినెట్‌కూర్పు, వైట్‌హౌస్ కార్యవర్గం ఎంపికలో తలమునకలయ్యారు. ప్రణాళికాబద్ధంగా పదవులకు ఎంపిక చేస్తున్నారు. దాదాపుగా కసరత్తు పూర్తికావొచ్చింది. ఇక తాను అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధాలు ఆపుతానని ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. ఈ దిశగా కూడా చర్యలు చేపడుతున్నారు. ట్రంప్ ఇచ్చిన హామీల్లో కీలకమైనది వలసల నివారణ. ఇప్పుడు ఆయన దీనిపైనే ఫోకస్ పెట్టారు. వలసలపై తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు భద్రతపై జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించే యోచనలో ఉన్నట్లు ట్రంప్ ధ్రువీకరించారు.
రిపబ్లికన్ కార్యకర్త పోస్టు..
అమెరికాలో అక్రమ వలసదారులను తిప్పి పంపించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించుతామని రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ట్రంప్ సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో పోస్టు పెట్టాడు. దీనిపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ స్పందించాడు. ‘నిజమే’ అని కామెంట్ జోడించాడు. వలసలను ట్రంప్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాడు తనను గెలిపిస్తే దేశం నుంచి 10 లక్షల మంది వలసదారులను వెనక్కి పంపుతానని ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. మెక్సికోతో సరిహద్దులను దర్భేధ్యంగా మారుస్తానని హామీ ఇచ్చారు.
1.10 కోట్ల మంది వలసదారులు..
ఇదిలా ఉంటే.. అమెరికాలో 1.10 కోట్ల మంది అక్రమంగా నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. ట్రంప్ భారీ బహిష్కరణ ప్రణాళిక లక్షల మంది కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. జనవరి 20న బాధ్యతలు చేపట్టే ట్రంప్.. తన కేబినెట్‌ను అతివాదులు, వలసల వ్యతిరేకులతో నింపేశారు. వలసలను నియత్రించడంలో కీలకమైన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్‌గా ఎన్‌ఫోర్స్‌మెంట్ మాజీ చీఫ్ టామ్ హోమన్‌ను బోర్డర్ జార్‌ను ఎంపిక చేశారు.
సామాన్లు సర్దుకోండి..
అక్రమ వలసదారులు సామాన్లు సర్దుకుని దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని గతేడాది జూలైలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సదస్సులో హూమన్ హెచ్చరించారు. తమ విభాగం తొలుత 4.52 లక్షల మంది అక్రమ వలసదారులను బహిష్కరిస్తుందని ఇటీవల తెలిపారు. అధ్యక్షుడ జో బైడెన్ పాలనలో రికార్డు సంఖ్యలో అక్రమ వలసదారులు దేశంలోకి వచ్చారని ట్రంప్ పదే పదే ఆరోపించారు. వారంతా అమెరికాను విషపూరితం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని తిప్పి పంపేందుకు అవసరమైతే 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ చట్టాన్ని ప్రయోగిస్తామని కూడా హెచ్చరించారు.