Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన అనాలోచిత నిర్ణయాలతో అమెరికాలో విద్యార్థులు, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ఫెడరల్(Fedaral) ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎందుకు ఎన్నుకున్నాంరా బాబూ అని అమెరికన్లు నిరసన వ్యక్తం చేస్తున్నా.. ట్రంప్ మాత్రం తన తలతిక్క నిర్ణయాలు మానడం లేదు. తాజాగ యూనివర్సిటీలపై పడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి షాక్ ఇచ్చారు.
Also Read: బిల్ గేట్స్ తో ఎందుకు విడాకులు తీసుకున్నానో బయటపెట్టిన మెలిందా.
అమెరికా అధ్యక్షుడు మొదట అక్రమంగా ఉంటున్నవారిని తలరించారు. తర్వాత ఉద్యోగాల్లో కోత విధిస్తున్నారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంఖాలు విధించారు. విదేశీ విద్యార్థులను అమెరికా యూనివర్సిటీ(America Univesities)ల నుంచి వెళ్లగొడుతున్నారు. తాజాగా యూనివర్సిటీల మనుగడకే ముప్పు తెచ్చే నిర్ణయం తీసుకున్నారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ(Harward Univarsity)కి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలో భాగంగా, 60 మిలియన్ డాలర్ల విలువైన ఫెడరల్ కాంట్రాక్ట్‌లు కూడా స్తంభింపజేయబడ్డాయి. ఈ నిర్ణయం హార్వర్డ్‌తో పాటు ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాలపై ట్రంప్ పరిపాలన ఒత్తిడి వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిధుల కోత విశ్వవిద్యాలయ పరిశోధన కార్యక్రమాలు, విద్యార్థుల సౌకర్యాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నిధుల కోతకు కారణం..
వైట్‌హౌస్(White House) జారీ చేసిన నిబంధనల ప్రకారం, హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో యూదు వ్యతిరేక నిరసనలను కట్టడి చేయడంలో విఫలమైందని ఆరోపణలు వచ్చాయి. ఈ నిబంధనలను హార్వర్డ్ ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ వ్యతిరేకించడంతో, ఫెడరల్ నిధులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది హమాస్–ఇజ్రాయెల్ సంఘర్షణ నేపథ్యంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో జరిగిన నిరసనలు ఈ వివాదానికి మూలం. ఈ నిరసనలకు అనుమతి ఇవ్వడం ద్వారా యూదు విద్యార్థుల భద్రత, విద్యా సౌకర్యాలకు భంగం కలిగిందని ట్రంప్ పరిపాలన ఆరోపిస్తోంది. ఫెడరల్ చట్టం ప్రకారం, యూదు విద్యార్థులకు సమాన రక్షణ, అవకాశాలు కల్పించాలని నిబంధన ఉంది, దీనిని హార్వర్డ్ అమలు చేయలేదని అధికారులు పేర్కొన్నారు.
ఇతర విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు
హార్వర్డ్ మాత్రమే కాదు, కొలంబియా, పెన్సిల్వేనియా, కార్నెల్, నార్త్‌వెస్టర్న్ వంటి ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాలకు అందించే ఫెడరల్ నిధులను కూడా ట్రంప్ ప్రభుత్వం గతంలో స్తంభింపజేసింది. పౌర హక్కుల ఉల్లంఘన, నిరసనల నిర్వహణలో విఫలమైనట్లు ఆరోపణలు ఈ విశ్వవిద్యాలయాలపై ఉన్నాయి. గత నెలలో అమెరికా విద్యాశాఖ 60 విశ్వవిద్యాలయాలకు లేఖలు రాసి, యూదు విద్యార్థుల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఈ చర్యలు విశ్వవిద్యాలయాలపై రాజకీయ ఒత్తిడిని పెంచాయని, విద్యా స్వాతంత్య్రంపై దాడిగా విమర్శలు వస్తున్నాయి.
విశ్వవిద్యాలయాల స్పందన
హార్వర్డ్ యూనివర్సిటీ నిధుల కోతను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ ఈ చర్యలు విశ్వవిద్యాలయ స్వాతంత్య్రాన్ని హరిస్తాయని, విద్యా పరిశోధనలకు ఆటంకం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. హార్వర్డ్ యూదు విద్యార్థుల రక్షణకు కట్టుబడి ఉందని, అయితే ప్రభుత్వం విధించిన కొన్ని నిబంధనలు అతిగా ఉన్నాయని పేర్కొన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం వంటి కొన్ని సంస్థలు నిధుల కొనసాగింపు కోసం ప్రభుత్వ ఒత్తిడికి లొంగాయని, దీనిపై విమర్శలు వచ్చాయి. హార్వర్డ్ మాత్రం ఈ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి న్యాయపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
నిధుల కోత ప్రభావం..
ఫెడరల్ నిధులపై ఆధారపడే హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాలకు ఈ కోతలు పెద్ద ఎదురుదెబ్బ. ఈ నిధులు పరిశోధన కార్యక్రమాలు, వైద్య కేంద్రాల నిర్వహణ, విద్యార్థులకు ఆర్థిక సహాయం వంటి కీలక అంశాలకు ఉపయోగపడతాయి. నిధుల కోతతో విద్యార్థుల ఫీజులు పెరగవచ్చని, పరిశోధన ప్రాజెక్టులు ఆగిపోవచ్చని విశ్వవిద్యాలయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్యలు అమెరికా యూనివర్సిటీల వైభవం తగ్గుతుందని, విదేశీ విద్యార్థులు ఇతర దేశాలను ఎంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
విద్యా స్వాతంత్య్రంపై ప్రశ్నలు
ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలను యూదు విద్యార్థుల రక్షణ కోసం తీసుకున్నట్లు చెప్పినప్పటికీ, దీనిని రాజకీయ అజెండాగా విమర్శకులు చూస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యా స్వాతంత్య్రం, వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నంగా ఈ నిధుల కోతను అభివర్ణిస్తున్నారు. నిరసనల నిర్వహణ స్వతంత్ర సమాజంలో భాగమని, వీటిని అణచడం ద్వారా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.