Donald Trump: అగ్రరాజ్యం అమెరికా.. ప్రస్తుతం ప్రపంచ పెద్దన్న.. ట్రంప్ 2.0 పాలనలో దేశాన్ని వివిధ రంగాల్లో మార్పు వస్తోంది. గత నాయకులు లింకన్ వంటి మహానుభావుల ఆదర్శాలను గౌరవించేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. సమాజం, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలపై ట్రంప్ విధానాలు భస్మాసుర హస్తంలా మారాయి.
ట్రంప్ నాయకత్వం కింద, అమెరికాలో మత, జాతి సంబంధిత వివాదాలు పెరిగాయి. టెక్సాస్ రిపబ్లికన్ అభ్యర్థి వాలంటీనా గోమెజ్ ఖురాన్‌ను బహిరంగంగా దహనం చేసి, ముస్లింలపై దాడి చేసేలా ప్రకటనలు చేసింది, ఇది సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. మరోవైపు, అలెగ్జాండర్ డంకన్ టెక్సాస్‌లోని 90 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ‘తప్పుడు దేవుడు‘ అని వ్యాఖ్యానించి, హిందువులను వ్యతిరేకించాడు, ఇది అంతర్జాతీయంగా ఆందోళనలు రేకెత్తించింది. ఇలాంటి సంఘటనలు దేశంలోని బహుళత్వాన్ని దెబ్బతీస్తున్నాయి, ఎందుకంటే అమెరికా ఎల్లప్పుడూ వివిధ సంస్కృతుల సమ్మేళనంగా ప్రసిద్ధి చెందింది. ఇటీవలి ఘటనల్లో, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్య 2025లో పొలిటికల్ వయలెన్స్‌ను మరింత పెంచింది, ఇది దేశంలోని ధ్రువీకరణను ప్రతిబింబిస్తుంది. ఈ ఉద్రిక్తతలు ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్‘ ఎజెండా భాగంగా భావిస్తున్నారు, కానీ వాస్తవానికి సమాజాన్ని విడదీస్తున్నాయి. నిపుణులు ఇలాంటి విద్వేషాలు దీర్ఘకాలికంగా దేశ స్థిరత్వాన్ని దెబ్బతీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక విధానాలతో ప్రజలపై భారం..
ట్రంప్ విధానాలు ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయాలని ఉద్దేశ్యం, కానీ వాస్తవ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. టారిఫ్‌లు 2025లో ఫెడరల్ ఆదాయాన్ని 350 బిలియన్ డాలర్లకు పెంచాయి. అయితే, ఈ ఆదాయం ప్రధానంగా అమెరికన్ వినియోగదారుల నుంచి వస్తోంది, ఎందుకంటే దిగుమతి ధరలు పెరిగి ప్రతీ కుటుంబానికి 1,300 నుంచి 1,700 డాలర్ల అదనపు ఖర్చు వస్తోంది. ఇది జీవన ప్రమాణాలను తగ్గిస్తోంది. మరోవైపు, ‘గోల్డ్ కార్డ్‘ ప్రోగ్రామ్ ధనిక వలసదారులకు 1 మిలియన్ నుంచి 5 మిలియన్ డాలర్లకు రెసిడెన్సీ, పౌరసత్వాన్ని అందిస్తోంది, ఇది ఆదాయాన్ని పెంచుతుందని చెబుతున్నారు. కానీ ఇది సామాన్య ప్రజలకు లాభం చేకూర్చకపోవచ్చు, ఎందుకంటే హెచ్–1బీ వీసాలపై ఆంక్షలు టెక్ రంగాన్ని దెబ్బతీస్తాయి. ఎలాన్ మస్క్ వంటి వారు హెచ్–1బీ ద్వారా అమెరికాలో వృద్ధి చెందారు, కానీ ప్రస్తుత విధానాలు ఇలాంటి ప్రతిభను ఇతర దేశాలకు తరలిస్తాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా టారిఫ్‌లు ఉద్యోగాలను తగ్గిస్తున్నాయని చర్చలు జరుగుతున్నాయి. ఫలితంగా, ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టి, ఉద్యోగాలు కోల్పోతున్నాయి. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ రంగంలో. ఇది దేశాన్ని బలహీనపరచడమే కాకుండా, ప్రపంచ వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేస్తోంది.
అంతర్జాతీయ సంబంధాల్లో ఒడిదుడుకులు..
ట్రంప్ విదేశీ విధానం మిత్ర దేశాలతో సంబంధాలను దెబ్బతీస్తోంది. కెనడా, మెక్సికో వంటి పొరుగు దేశాలతో టారిఫ్‌లు, ఆంక్షలు పెరిగాయి. ఇది వాణిజ్య సంబంధాలను క్షీణింపజేస్తోంది. యూరప్, ఆసియా మిత్రులు ట్రంప్ ప్రొటెక్షనిస్ట్ విధానాలతో ఆందోళన చెందుతున్నారు, ఇది నాటో వంటి ఒప్పందాలను బలహీనపరుస్తోంది. యుద్ధాల విషయంలో, ట్రంప్ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడంత్లో గాజా, మిడిల్ ఈస్ట్ సంఘర్షణలు తీవ్రమయ్యాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని చెప్పినా, అది కష్టమని ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఈ విధానాలు అమెరికాను ఒంటరిగా చేస్తున్నాయి, ప్రపంచ శాంతికి ముప్పు కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ నవ్వులపాలు చేశాయి, ఇది అమెరికా ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది.
ట్రంప్ పాలన దేశానికి దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుందని మాజీ నాయకులు. నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సమాజ విభేదాలు, ఆర్థిక భారం, అంతర్జాతీయ అస్థిరత్వం కలిసి అమెరికాను కల్లోలంగా మార్చవచ్చు. ఈ మార్పులు 50 ఏళ్లుపాటు ప్రభావితం చేయవచ్చు, ఎందుకంటే బంగారు గుడ్లు పెట్టే బాతును కాపాడుకోవడం కంటే, తాత్కాలిక లాభాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెరికా భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ప్రస్తుత విధానాలు దేశాన్ని మరింత సవాళ్లలోకి నెట్టేస్తున్నాయి.