Modi US Tour : అమెరికాపై మోదీ ‘వజ్రా’యుధం: ప్రధాని లౌక్యాన్ని మీడియా పసిగట్టలేకపోయింది

. తన భార్యకు నచ్చిన కానుక ఇవ్వడంతో బైడెన్‌ కూడా భారత్‌ అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో తాను వచ్చిన లక్ష్యం పూర్తయిందని మోదీ కూడా మనసులో అనుకున్నారు. మొత్తానికి అమెరికాను వజ్రాయుధంతో కొట్టి ఈజిప్ట్‌లో పర్యటిస్తున్నారు.

Written By: Bhaskar, Updated On : June 26, 2023 8:05 pm
Follow us on

Modi US Tour : ప్రధాని మోదీ మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. పలు ఒప్పందాల మీద సంతకాలు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యం మీద కీలక అడుగులు వేశారు. ఐటీ ఉద్యోగుల కోసం హెచ్‌1బీ1 వీసా, టెస్లా కంపెనీ పెట్టుబడులు.. ఇలా రకరకాల వ్యవహారాల మీద మోదీ ఊపిరి సలపకుండా గడిపారు. తర్వాత ఈజిప్ట్‌ వెళ్లిపోయారు. అక్కడ కూడా వ్యూహాత్మక వాణిజ్యం మీద కీలక అడుగులు వేస్తున్నారు. అంతే కాదు ఈజిప్ట్‌ దేశం మోదీని ఆ దేశపు అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. సరే ఇదంతా ఒకెత్తు. అంతటి అమెరికా భారత్‌ చెప్పినదానికల్లా ఎందుకు తలూపింది? అసలు భారత్‌తో అమెరికాకు అంతటి అవసరం ఏమొచ్చింది? ఇన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం వజ్రం.

వజ్రంతో కొట్టారు

మన భారతీయ పురాణాల ప్రకారం వజ్రాయుధం అనేది అత్యంత శక్తివంతమైనది. ఇప్పటి కాలంలో వజ్రంతో రూపొందే ఆయుధాలు లేవు. ఒకవేళ రూపొందినా వాడే సీన్‌ లేదు. సరే ఈ చర్చ అలా కాస్త పక్కన పడేస్తే ‘డైమండ్స్‌ ఆర్‌ విమెన్స్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌’ అంటారు కదా. మోదీ ఇదే పాలసీని అమెరికాలో ఆచరణలో పెట్టారు. యుఎస్‌ ఫస్ట్‌ లేడీ, జిల్‌ బైడెన్‌ కు వజ్రాన్ని ఇచ్చారు. ఫలితంగా ఆమె మురిసిపోయారు. నెచ్చెలి మనసుకు నచ్చిన కానుక ఇవ్వడంతో జో బైడెన్‌ కూడా ఆనంద డోలికల్లో మునిగిపోయారు. మోదీ జిల్‌ బైడెన్‌ కు ఇచ్చిన వజ్రం భూగర్భం నుంచి తవ్వి తీసింది కాదు. ఆ ఏడున్నర క్యారట్ల, ఇకో ఫ్రెండ్లీ వజ్రాన్ని ప్రయోగశాలతో సృష్టించారు. కశ్మీరుకు చెందిన అందమైన పపియర్‌ మాషె పెట్టెలో భద్రపరిచిన ఈ వజ్రాన్ని, మోదీ జిల్‌కు బహూకరించారు.

సుస్థిరమైన వనరుల సహాయంతో..
ఈ అపురూపమైన వజ్రం, భూమి నుంచి తవ్వి తీసిని సహజసిద్ధ వజ్రాల రసాయన, దృశ్య రూప గుణాలను ప్రతిఫలిస్తుంది. ఈ వజ్రాన్ని సౌర, పవన శక్తుల్లాంటి సుస్థిరమైన వనరుల సహాయంతో సృష్టించారు. ఈ అసాధారణమైన మేలు రాయి, ఫోర్‌ సి కట్‌ (కట్‌, కలర్‌, క్యారట్‌, క్లారిటీ) లాంటి నాలుగు హాల్‌ మార్కులను కూడా కలిగి ఉంది. ఈ ఆకుపచ్చని వజ్రాన్ని అత్యాధునిక సాంకేతికత సహాయంతో ఎంతో కచ్చితత్వంతో, జాగ్రత్తగా తయారుచేశారు. ఈ వజ్రంలోని ఒక్కొక్క క్యారట్‌ నిమిషానికి 0.028 గ్రాముల కార్బన్‌ను మాత్రమే విడుదల చేస్తుంది. పైగా ఈ వజ్రాన్ని జెమలాజికల్‌ ల్యాబ్‌, ఐజిఐ కూడా ధృవీకరించింది.

బాధ్యతాయుతమైన విలాసానికి ప్రాతినిధ్యం

‘బాధ్యతాయుతమైన విలాసానికి ప్రాతినిధ్యం వహించే చిరు దివ్వెగా, ఈ వజ్రం భారతదేశ 75 సంవత్సరాల స్వేచ్ఛ, స్థిరమైన అంతర్జాతీయ సంబంధాల పట్ల దేశం కలిగి ఉన్న నిబద్ధతను సూచిస్తుంది. ’ అని మోదీ వజ్రాన్ని బహూకరించేటప్పుడు జిల్‌ బైడెన్‌ తో పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణను ప్రతిబింబించే ఈ వజ్రం, అద్భుతమైన, నైతిక స్పృహతో కూడిన ప్రత్యామ్నాయంగా నిలవడం విశేషం. ఈ అసాధారణమైన వజ్రాన్ని, ‘కర్‌ ఇ కలాందానీ’ అనే కశ్మీరు కళా నైపుణ్యాన్ని కలిగిన పెట్టెలో భద్రపరిచి, బహూకరించారు. దీనితో పాటు ప్రధాని మోదీ, జైపూర్‌కు చెందిన కళాకారులు రూపొందించిన ప్రత్యేకమైన గంధపు పెట్టెను కూడా బైడెన్‌కు బహూకరించారు.

తన్మయత్వానికి లోనయ్యారు

మోదీ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చిన తర్వాత జిల్‌ బైడెన్‌ తన్మయత్వానికి లోనయ్యారు. ‘ఎలా తెలుసుకున్నారో తెలియదు కానీ, మోదీ నాకు ఇష్టమైన బహుమతి ఇచ్చారు. ఇది నన్ను ఎంతో ఆనందానికి గురి చేసింది. ఇది నాకు చాలా విలువైన కానుక’ అని జిల్‌ బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఇక ఎప్పడయితే మోదీ ఈ కానుక ఇచ్చారో అప్పుడే జో బైడెన్‌ ముఖ కవలికలు మారాయి. తన భార్యకు నచ్చిన కానుక ఇవ్వడంతో బైడెన్‌ కూడా భారత్‌ అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో తాను వచ్చిన లక్ష్యం పూర్తయిందని మోదీ కూడా మనసులో అనుకున్నారు. మొత్తానికి అమెరికాను వజ్రాయుధంతో కొట్టి ఈజిప్ట్‌లో పర్యటిస్తున్నారు.