Pakistani Military Vs Government: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ అమెరికాకు బాగా దగ్గర అయింది. ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తరచూ అమెరికాకు వెళ్తున్నారు. కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆసిమ్ మునీర్‌కు ఇచ్చిన ప్రాధాన్యం ప్రధాని షెహబాజ్‌కు ఇవ్వడంలేదు. ఇదే సమయంలో ఆసిమ్ మునీర్ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వాన్ని పక్కనపెట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆఫ్ఘాన్ సరిహద్దు వివాదంలో సైన్యం నేరుగా చర్యలు చేపట్టడం, టర్కీలో జరిగిన శాంతి చర్చల ఫలితాలను దెబ్బతీసింది. ఆ చర్చల సమయంలో ఆఫ్ఘాన్ ప్రతినిధులు డ్రోన్ దాడుల్ని నిలిపివేయమని కోరగా, పాక్ సైన్యం ‘‘మూడో దేశంతో ఒప్పందం ఉందని’’ వివరణ ఇవ్వడం రాజకీయంగా అస్పష్ట పరిస్థితిని సృష్టించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఆఫ్ఘాన్‌పై దాడులకు పాక్ భూభాగాన్ని వినియోగిస్తోందన్న విషయం అంతర్జాతీయ వేదికలపై తేలింది.
ఆసిమ్ వర్సెస్ షెహబాజ్..
ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి. షెహబాజ్ షరీఫ్ స్నేహపూర్వక దౌత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తుండగా, సైన్యం అప్రత్యక్ష దాడులు చేయడం ఆ ప్రయత్నాలను విఫలమ చేస్తోంది. ప్రతి సారి శాంతి చర్చలు మొదలయ్యే సమయానికే సైన్యపు చర్యలు ఉద్రిక్తతలను మళ్లీ రగిలించడం పాక్‌లో ద్వంద్వ పాలన ఉన్నదనే వాస్తవం బహిర్గతం చేస్తోంది.
అమెరికా సంబంధాల వెనుక వ్యూహం
ట్రంప్ ప్రభుత్వం పాక్–ఆఫ్ఘాన్ ప్రాధాన్యతను మళ్లీ గుర్తించడమే కాకుండా, ఆసిమ్ మునీర్, షరీఫ్ ఇద్దరినీ కలవడం ఆసక్తికర పరిణామం. ట్రంప్ కోరుకుంటున్న బగ్రామ్ ఎయిర్ బేస్ మళ్లీ యాక్టివ్ అవ్వడం వెనుక పాక్ సైన్యం సహకారం స్పష్టమవుతోంది. దీనివల్ల పాక్ ఆర్మీ అమెరికా వ్యూహాల్లో భాగస్వామ్యం కావడం, ప్రభుత్వాన్ని పక్కన పెట్టి విదేశీ ఒత్తిడికి తలొగ్గుతున్నట్లు కనిపిస్తోంది.
తాలిబాన్ల ఆగ్రహం..
తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టంగా పాక్‌లోని కొందరు సైనిక వర్గాలు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలను పెంచుతున్నాయని ఆరోపించారు. కొన్ని ప్రపంచ శక్తుల మద్దతుతో పాక్ సైన్యంలో నిర్దిష్ట వర్గం ఆఫ్ఘాన్–పాక్ వివాదాన్ని సజీవంగా ఉంచుతోందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పాక్ అంతర్గత అధికార రాజకీయాల తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ కాలంలో ఆఫ్ఘాన్‌తో సంబంధాలు కొత్త మార్గంలో కొనసాగినప్పటికీ, ఆయనను తప్పించిన తర్వాత సైన్యం రాజకీయ నియంత్రణను మరింత బిగించింది. ప్రభుత్వం ప్రజాస్వామ్య రూపంలో కనిపించినా, దేశంలోని కీలక నిర్ణయాలు రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయంలోనే తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి అంతర్జాతీయ నమ్మకాన్ని దెబ్బతీస్తూ, దేశ భవిష్యత్తును అస్థిరతలోకి నెడుతోంది.
పాకిస్తాన్‌లో సైనిక అధికారం పెరుగుతున్న కొద్దీ, ప్రభుత్వ దౌత్యప్రయత్నాలు ఆటంకం ఎదుర్కొంటున్నాయి. ప్రాంతీయ స్థిరత్వానికి ఇది పెద్ద సవాలు. రాబోయే నెలల్లో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగితే, దాని ప్రభావం కేవలం ఇస్లామాబాద్‌కే కాకుండా మొత్తం దక్షిణాసియాపై పడే అవకాశం ఉంది.