Jubilee Hills By Election: మామూలుగా అయితే హైదరాబాద్ నగరంలో అది ఒక నియోజకవర్గం. కాకపోతే సంపన్నులు అధికంగా ఉంటారు కాబట్టి ఆ నియోజకవర్గం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ నియోజకవర్గం తెలంగాణ రాజకీయాలను శాసిస్తోంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి. వాస్తవానికి దీనికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ప్రాంతంలో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఆ ప్రాంతం గురించి పెద్దగా చర్చ జరగలేదు. కొందరికి అయితే ఆ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగినట్టు కూడా గుర్తులేదు. కానీ ఇప్పుడే ఎందుకు ఇదంతా అంటే.. తెలంగాణలో రాజకీయాలు అలా మారిపోయాయి కాబట్టి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 0 ఫలితాలను సాధించింది.. కొంతమంది ఎమ్మెల్యేలను కూడా కోల్పోయింది. ఇక పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ కుమార్తె కవిత బయటకు వెళ్లిపోయింది. బయటికి వెళ్లడమే కాదు విపరీతంగా విమర్శలు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే తన తండ్రి పరిపాలన తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఈ సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గులాబీ పార్టీ కంకణం కట్టుకుంది. దానికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాలికి బలపంకట్టుకుని తిరుగుతున్నారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవాలని.. తన పార్టీకి పోయిన గర్వాన్ని మళ్లీ తీసుకురావాలని ఆయన బలంగా ఫిక్స్ అయ్యారు. అందువల్లే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి మరొక సమస్య. అధికారంలో ఉన్నదన్నమాటే గాని.. ఎన్నో సమస్యలు ఆ పార్టీని వేధిస్తున్నాయి. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తీసుకుంటున్న నిర్ణయాలు కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. దీనికి తోడు మంత్రివర్గంలో కుమ్ములాటలు.. మంత్రి మీద మరొక మంత్రి ఆరోపణలు చేసుకోవడం.. తగువులు పెట్టుకోవడం.. విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది అని చెప్పాలంటే కచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలుపొందాలి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది.
భారతీయ జనతా పార్టీ పరిస్థితి మరో విధంగా ఉంది. ఎందుకంటే బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దుబ్బాక నియోజకవర్గం కి ఉప ఎన్నికలు జరిగినప్పుడు రఘునందన్ రావును గెలిపించుకున్నారు. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఈటెల రాజేందర్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు దక్కించుకునే విధంగా పావులు కదిపారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి పార్టీ అధినాయకత్వం పక్కనపెట్టింది. అది అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిపై తీవ్రమైన ప్రభావం చూపించింది.. ఇప్పుడు బిజెపికి అధ్యక్షుడిగా రామచందరరావు ఉన్నారు. ఆయన అధ్యక్షుడైన తర్వాత వచ్చిన తొలి ఉప ఎన్నిక ఇది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బిజెపి భావిస్తోంది. కాకపోతే క్షేత్రస్థాయిలో అంతగా ఆ పార్టీకి ప్రభావం కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
మూడు పార్టీలకు ఏ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి కావడంతో ఎవరూ తగ్గడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్, గులాబీ పార్టీలు క్షేత్రస్థాయిలో విపరీతంగా కష్టపడుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల పరిశీలన ప్రకారం గృహిణులకు గులాబి, కాంగ్రెస్ పార్టీల నుంచి కుక్కర్లును బహుమతులుగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మగవాళ్ళకైతే లిక్కర్ బాటిల్స్ ను సరఫరా చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ జాబితాలో బిజెపి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా అటు గులాబీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ తీసుకోవడంతో ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని సమాచారం. ఓ అంచనా ప్రకారం ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు 300 కోట్లకు మించిపోతుందని తెలుస్తోంది.