Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఏడాది నవంబర్ 5న జరుగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గడువు సమీపిస్తుండడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అగ్రరాజ్యం అంతటా ప్రచారం తారాస్థాయిలో సాగుతోంది. హామీలతో అభ్యర్థులు అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరితో చెప్పలేక సర్వే సంస్థలు తంటాలు పడుతున్నాయి. ఓటరు నాడి పట్టేందుకు అవి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే.. తాజాగా అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి నున్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. అన్ని సర్వేలో ఇరువురి మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడా మాత్రమే కనిపిస్తోంది. మరోవైపు అమెరికాలో అధ్యక్ష అభ్యర్థులు లక్ష్యంగా కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు దుండగులు కాల్పులు జరిపారు. తాజాగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచార కార్యలయంపై దుండగులు కాల్పలు జరిపారు.
బాంబు పేల్చిన యూఎస్ ఇంటెలిజెన్స్..
ఇప్పటికే వరుస కాల్పుల ఘటనలు అమెరికాలో కలకలం రేపుతుండగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ముప్పు పొంచి ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ బాంబు పేల్చింది. ఈమేరకు ట్రంప్ ప్రచార బృందం ప్రకటన చేసింది. అమెరికాలో అస్థిరత, గందరగోళం సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తోందని, ట్రంప్‌కు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించిందని వెల్లడించింది. కొన్ని నెలలుగా ట్రంప్‌కు ఇరాన్ నుంచి బెదిరింపులు పెరిగాయని తెలిపింది. ట్రంప్‌ను రక్షించడంతోపాటు, అమెరికా ఎన్నికలపై ప్రభావం చూపకుండా ఇంటెలిజెన్స్ అధికారులు కృషి చేస్తున్నారని తెలిపింది.
స్పందించిన ట్రంప్..
ఇంటెలిజెన్స్ హెచ్చరికలపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నా హత్యకు ఇరాన్ చాలాసార్లు ప్రయత్నించింది. అవి ఫలించలేదు. మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎలాంటి వ్యతిరేకత లేకుండా సీక్రెట్ సర్వీస్‌కు ఎక్కువ నిధులు కేటాయించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు. ఈ విషయంలో డెమొక్రట్లు, రిపబ్లికన్లు కలిసి రావడం సంతోషంగా ఉంది. మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం అంటే.. నిందితుడికి మరణమే’ అని పేర్కొన్నారు.
ఖండించిన ఇరాన్..
అయితే తాజా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని తాము భావించడం లేదని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇరాన్ హ్యాకర్లు ట్రంప్ ప్రచారంలో బహిర్గతం కాని అంశాలను హ్యాక్ చేసి ఆ సారాంశాన్ని బైడెన్ ప్రచార సిబ్బందికి ఇస్తామని మెయిల్ పంపారని పలు ఏజెన్సీల అధికారులు పేర్కొన్నారు.