Chinese Bharatanayam Dancer: ప్రపంచంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మన ఆచార వ్యవహారాల వెనుక సైన్స్ ఉంటుంది. శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి చెందని రోజుల్లోనే మన పండితులు వైద్యం, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాలపై పట్టు సాధించారు. గతంలో మన çపూర్వీకులు చెప్పిన వాటినే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆధారాలతో నిరూపిస్తున్నారు ఇక మన యోగా, మన నాట్యం కూడా ప్రత్యేకమే మన యోగా అనేక రోగాలకు మందు.. మన నాట్యం పాశ్చాత్య సంస్కృతిలా కుప్పి గంతుల్లా ఉండదు. దేవతలు సైతం ఇష్టపడేది మన నృత్యం. అందుకే మన యోగాను, మన నృత్యాలను, మన పాటలను విదేశీయులు చాలా మంది ఇష్టపడుతున్నారు. కొంతమంది నేర్చుకుంటున్నారు. ఇతరులకు శిక్షణ ఇస్తున్నారు. ఇలాగే మన భరత నాట్యం కూడా ఇప్పుడు డ్రాగన్ దేశం చైనాలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా బీజింగ్‌లో 13 ఏళ్ల చైనా బాలిక భరత నాట్య ప్రదర్శనతో మన సంస్కృతి ఎంతో గొప్పదని మరోసారి రుజువైంది. చైనాలో మన సంప్రదాయ నృత్యం భరత నాట్యానికి ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడి చిన్నారులు భరత నాట్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
బీజింగ్‌లో చైనా బాలిక లీ ముజి 13 ఏళ్లకే అరంగేట్ర ప్రదర్శనతో సంచలనం సృష్టించింది. మన సాంస్కృతిక కళలు పొరుగు దేశంలో ఆదరణ పొందడం విశేషం. ప్రముఖ భరతనాట్య నృత్య కారిణి లీలా శాంసన్, భారతీయ దౌత్యవేత్తలు, చైనీస్ అభిమానులు సమక్షంలో లీ ముజి సోలోగా అరంగేట్రం ప్రదర్శన ఇచ్చింది. ఈమేరకు కార్యక్రమానికి హజరైన భారత రాయబారి కార్యలయం ఇన్‌చార్జి టీఎస్.వివేకానంద్ మాట్లాడుతూ చైనాలో పూర్తి శిక్షణ పొంది ఇక్కడే అరంగేట్రం ప్రదర్శించిన తొలి విద్యార్థి లీ అని చెప్పారు. సంప్రదాయ పద్దతిలో సరిగ్గా ప్రదర్శిన ఇచ్చిన అరంగేట్రం ఇది అని పేర్కొన్నారు.
చైనా ఉపాధ్యాయుల శిక్షణలోనే..
లీ చైనీస్ ఉపాధ్యాయుల నుంచే చైనాలోనే భరత నాట్యం నేర్చుకుంది. అరంగేంట్రం ప్రదర్శన ఇచ్చింది. ఇది భరతనాట్య వారసత్వ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని లీకి శిక్షణ ఇచ్చిన చైనా భరతనాట్య నర్తకి జిన్ షాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి ప్రదీప్ రావత్ సతీమణి ధ్రుతి రావత్ కూడా హాజరయ్యారు. అంతేకాదు లీ ప్రదర్శన కోసం చెన్నై నుంచి సంగీత విద్వాంసుల బృందం తరలి వెళ్లింది. లీ ఈ నెలాఖరున చెన్నైలో కూడా ప్రదర్శన ఇవ్వనుంది.
అరంగేట్రం అంటే…
ఇక అరంగేట్రం అంటే భరత నాట్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు తొలిసారి గురువు, ఇతరుల ముందు ప్రదర్శన ఇవ్వడం. మన సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్న భారతీయులు ఇలా అరంగేట్రం ప్రదర్శన ఇస్తారు. ఇప్పుడు చైనా బాలిక లీ కూడా మన సంస్కృతి ప్రకారమే అరంగేట్రం ప్రదర్శన ఇచ్చారు.