China’s Rare Earth Game:అమెరికా విధించిన టారిఫ్‌ల గందరగోళం మధ్య, చైనా తన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గేమ్ షురూ చేసింది. ఇప్పటికే ఉన్న ప్రపంచ అనిశ్చిత పరిస్థితికి ఈ రెండు దేశాల చర్యలు మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి. చైనా కేవలం ప్రపంచ కర్మాగారం (Factory of the World) మాత్రమే కాదు.. అనేక ముడి పదార్థాలకు (Raw Materials) ప్రధాన సరఫరాదారు కూడా. దీని కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఏదో ఒక విధంగా చైనాపై ఆధారపడి ఉన్నాయి. దశాబ్దాలుగా చేపట్టిన వివిధ ప్రయోగాలు, సాంకేతిక అభివృద్ధి, పరిశోధనల ఫలితంగా చైనా నేడు ప్రపంచంలోని పెద్దన్నగా ఉంది.
రేర్ ఎర్త్ మాగ్నెట్ల కొరత
చైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్ల సరఫరాపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మాగ్నెట్‌లు చైనా నుంచి భారతదేశానికి రావడం లేదు. దీని ప్రభావంతో భారతదేశంలోని వాహన తయారీదారులు చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనాల తయారీకి ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్‌లు అత్యవసరం. రేర్ ఎర్త్ ఎలెమెంట్లు (Rare Earth Elements) అధిక డిమాండ్‌లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫైటర్ జెట్‌ల వరకు వివిధ ఉత్పత్తుల తయారీకి ఈ పదార్థాలు చాలా అవసరం. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి, రక్షణ పరిశ్రమలకు ఈ పదార్థాలు అత్యంత కీలకం. వీటి అయస్కాంతాలు సాధారణ మాగ్నెట్‌ల కంటే చాలా శక్తివంతమైనవి. మాగ్నెట్‌లు అవసరమయ్యే అనేక పరికరాలకు ఇవి తప్పనిసరి.
Also Read : ఎస్–400 భారత్‌లో విజయం.. తయారు చేసిన రష్యాలో వైఫల్యం.. ఎందుకు?
అసలు ఏమిటీ రేర్ ఎర్త్ పదార్థాలు?
రసాయన శాస్త్రంలో పీరియాడిక్ టేబుల్ (Periodic Table) ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. అక్కడ 57 నుంచి 71 వరకు వచ్చే మూలకాలను అరుదైన ఖనిజాలుగా పరిగణిస్తారు. ఇవి భూమిలో చాలా తక్కువ పరిమాణంలో లభ్యమవుతాయి. అయితే, ఇవి ఒకే చోట పెద్ద మొత్తంలో లభించవు. అన్నీ అక్కడక్కడా విస్తరించి ఉంటాయి. వాటిని కనుగొని, శుద్ధి చేసి తుది రూపానికి తీసుకురావడానికి చాలా సమయం, డబ్బు ఖర్చవుతుంది. అందుకే వీటిని విరళ ఖనిజాలు అని అంటారు.
విరళ ఖనిజాల శుద్ధి చేసేటప్పుడు ఉత్పన్నమయ్యే వ్యర్థాలు పర్యావరణానికి హానికరం. అందుకే చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఈ పనిలోకి దిగలేదు. ఈ ఖాళీని చైనా చాలా త్వరగా భర్తీ చేసింది. పరిశోధన, నిధులు అన్నింటినీ వెచ్చించి, ప్రస్తుతం ప్రపంచానికి అవసరమైన ఖనిజాలలో 70శాతం వరకు చైనా సరఫరా చేస్తుంది.
భారతదేశం నుంచి మూడు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
ప్రపంచంలోని మొత్తం విరళ భూ ఖనిజాలలో 6శాతం వరకు భారతదేశ ప్రాంతాలలో ఉన్నాయి. అయితే, ఉత్పత్తి విషయానికి వస్తే అది కేవలం 0.25శాతం మాత్రమే. దీని కారణంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్ల కోసం భారతదేశం చైనాపై ఎక్కువగా ఆధారపడింది. ఇప్పుడు ఈ ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశం మూడు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది.
రీసైక్లింగ్ (Recycling): ఈ ఖనిజాలను ఉపయోగించి తయారు చేసిన వస్తువుల కాలపరిమితి ముగిసిన తర్వాత వ్యర్థాలుగా పారవేయకుండా, వాటిని రీసైక్లింగ్ చేయడం మొదటి మార్గం. భారతదేశం ఈ దిశగా ప్రయత్నాలను ప్రారంభించింది.
ఇతర దేశాల నుంచి దిగుమతి: చైనాను మినహాయించి ఇతర దేశాల నుంచి ఈ పదార్థాలను దిగుమతి చేసుకోవడం రెండో మార్గం. థాయ్‌లాండ్, కజకిస్తాన్ వంటి దేశాలు ప్రత్యామ్నాయంగా నిలవగలవు. కజకిస్తాన్‌తో భారతదేశానికి మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. 17 విరళ ఖనిజాలలో 15 ఖనిజాలు కజకిస్తాన్‌లో సమృద్ధిగా ఉన్నాయని సమాచారం.
స్వయంగా ఉత్పత్తి: చివరి మార్గం ఈ పదార్థాలను స్వయంగా ఉత్పత్తి చేయడం. దీని కోసం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) సౌకర్యాలు సృష్టించాలి. టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. భారతదేశంలో ఆరు-ఏడు దశాబ్దాల క్రితమే ఈ ఖనిజాల ఉత్పత్తికి ఒక సంస్థను స్థాపించారు. కానీ వివిధ కారణాల వల్ల అది సరిగా పనిచేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి మళ్ళీ ఈ వైపు మళ్ళుతోంది.