Homeఅంతర్జాతీయంChina Space Breeding: వచ్చేస్తున్నాయ్‌ అంతరిక్ష విత్తనాలు.. చైనా పొలాల్లో ఇప్పటికే సాగు!!

China Space Breeding: వచ్చేస్తున్నాయ్‌ అంతరిక్ష విత్తనాలు.. చైనా పొలాల్లో ఇప్పటికే సాగు!!

China Space Breeding: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంటల ఉత్పత్తి పెరగడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు పంటల దిగుబడి పెంచేందుకు అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దిగుబడి పెంచే హైబ్రీడ్‌ విత్తనాలను సృష్టిస్తున్నారు. జనాభాకు తగిన ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసేలా కృషి చేస్తున్నారు. వాణిజ్య పంటల్లోనూ రైతులకు మేలు చేసే అనేక హైబ్రీడ్‌ విత్తనాలు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా చైనా కొత్త రకం వంగడాలతో పంటలు పండిస్తోంది. అవే అంతరిక్ష విత్తనాలు. చైనా ఇప్పటికే దశాబ్ద కాలంగా ఈ విత్తనాలతో దిగుబడి సాధిస్తోంది.

జన్యు దృఢత్వం కలిగిన విత్తనాలు..
భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూల పరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది.

మెరుగైన ఫలితాలు..
విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్‌ బ్రీడింగ్‌… జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్‌ బ్రీడింగ్‌ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) సంయుక్తంగా స్పేస్‌ బ్రీడింగ్‌ ప్రాజెక్టుకు 2022 నవంబర్‌ 7న శ్రీకారం చుట్టాయి.

అంతరిక్షంలోకి పంపించి..
‘నాసా’కు చెందిన వాల్లప్స్‌ ఫ్లైట్‌ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్‌ అనే ఆకుకూర విత్తనాలను పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్‌ రేడియేషన్‌కు గురిచేశాయి. ఆరు నెలల తర్వాత వాటిని 2022 ఏప్రిల్‌లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్‌ఏవో ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్‌లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డాక్టర్‌ శోభ శివశంకర్‌ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి.

చైనా పొలాల్లో ఇప్పటికే సాగు..
అంతరిక్షంలోని రేడియేషన్‌లో కొన్నాళ్లు ఉంచి భూ­మిపైకి తెచ్చిన విత్తనాల(స్పేస్‌ ఇండ్యూస్‌డ్‌ మ్యుటేషన్‌ బ్రీడింగ్‌ లేదా స్పేస్‌ బ్రీడింగ్‌)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్, చైనా అణు వ్యవసాయ శాస్త్రాల సంస్థ అధ్య­క్షుడు కూడా అయిన డాక్టర్‌ లూక్సియాంగ్‌ లియు చెబు­తు­న్న మాట ఇది.

260 రకాల వంగడాలు..
‘ప్లాంట్‌ బ్రీడింగ్‌ అండ్‌ జెనెటిక్స్‌’ న్యూస్‌లెటర్‌ 2023 జనవరి సంచికలో స్పేస్‌ బ్రీడింగ్‌ ప్రయోజనాలను వివరిస్తూ లూక్సియాంగ్‌ ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు వివరించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్‌ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డాక్టర్‌ లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు.

అభివృద్ధికి అవసరమే..
అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్‌ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డీఎన్‌ఏలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్‌ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్‌రేస్, గామారేస్‌తో మ్యుటేషన్‌ బ్రీడింగ్‌పై పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాథ్‌ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్‌ బ్రీడింగ్‌ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్‌ లైన్స్‌ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్‌ బ్రీడింగ్‌ ఉపయోగపడుతుందంటున్నారు భారతీయ శాస్త్రవేత్తలు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version