India Russia China Meeting: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా కక్ష్య పూరిత చర్యలకు దిగుతున్నారు. మొదట దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. నోబెల్ బహుమతికి ట్రంప్‌ను భారత్ మద్దతు ఇవ్వలేదని మరో 25 శాతం సుకాలు విధించారు. దీనికి రష్యా నుంచి ఆయిల్ దిగుమతే కారణం అని సాకు చూపారు. ఇక ట్రంప్ దూకుడు చూసి ఆయన అనుచరులు కూడా భారత్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ట్రంప్ ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై చేస్తున్న విమర్శలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారాయి. భారత్‌తో రష్యా, చైనా సంబంధాలు, ముఖ్యంగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు, భారత్‌పై 50 శాతం సుంకాల విధానం వంటి అంశాలపై ట్రంప్ బృందం దాడులు తీవ్రతరం చేసింది. నవారో యొక్క ‘బ్రాహ్మణులు లాభాలు ఆర్జిస్తున్నారు‘ అనే వ్యాఖ్య భారత్‌లో కుల సమస్యను తాకడంతో ఈ వివాదం మరింత సంక్లిష్టమైంది.
డొనాల్డ్ ట్రంప్‌కు మండుతోంది..
ట్రంప్ ఇటీవల సోషల్ మీడియాలో భారత్ తన ఎగుమతులపై సుంకాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ అది ఆలస్యమైందని పేర్కొన్నారు. అయితే, భారత ప్రభుత్వం ఈ వాదనను ధృవీకరించలేదు, దీనివల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అదే సమయంలో, నవారో భారత్‌ను ‘క్రెమ్లిన్‌కు లాండ్రోమాట్‘గా అభివర్ణించి, రష్యా నుండి రాయితీ ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి, దానిని శుద్ధి చేసి ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు అధిక ధరకు విక్రయిస్తూ బ్రాహ్మణులు లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు భారత్‌లో కుల సమస్యను తాకడంతో తీవ్ర విమర్శలకు దారితీశాయి. నవారో ‘బ్రాహ్మణులు‘ అనే పదప్రయోగం భారత్‌లో కుల వ్యవస్థపై అవగాహన లేకపోవడాన్ని సూచిస్తుంది. భారత్‌లో కులం ఒక సున్నితమైన అంశం, ఈ వ్యాఖ్యలు కుల రాజకీయాలను రెచ్చగొట్టే ప్రయత్నంగా కొందరు భావించారు. అయితే, నవారో ఈ సందర్భంలో ‘బ్రాహ్మణులు‘ అనే పదాన్ని అమెరికన్ సందర్భంలో ‘బోస్టన్ బ్రాహ్మణ్స్‘ (సంపన్న ఉన్నత వర్గం) అనే అర్థంలో ఉపయోగించి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది రిలయన్స్ వంటి పెద్ద వ్యాపార సంస్థలు రష్యన్ క్రూడ్ ఆయిల్ వాణిజ్యం ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తున్నాయనే విమర్శలకు సంబంధించినదిగా కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ వాణిజ్యం ద్వారా దాదాపు 6 బిలియన్ డాలర్ల(రూ.50 వేల కోట్ల) లాభం ఆర్జించినట్లు అంచనా వేయబడింది.
వాస్తవం ఏమిటి?
భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు 2022లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత గణనీయంగా పెరిగాయి. యుద్ధానికి ముందు రష్యన్ ఆయిల్ భారత దిగుమతులలో 1 శాతం కంటే తక్కువగా ఉండగా, ప్రస్తుతం అది 30–42 శాతానికి పెరిగింది. ఈ దిగుమతులు రాయితీ ధరలకు లభించడం వల్ల భారత్ దాదాపు 2.5 బిలియన్ డాలర్లను ఆదా చేసిందని అంచనా. భారత్ ఈ క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేసి, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ వాణిజ్యం చట్టబద్ధమైనదని భారత్ వాదిస్తోంది. నవారో ఈ వాణిజ్యాన్ని ‘రష్యా యుద్ధ యంత్రానికి ఆర్థిక సహాయం‘గా చిత్రీకరిస్తున్నాడు.
నవారో వ్యాఖ్యలు, ట్రంప్ సుంకాల విధానం భారత్‌పై వ్యక్తిగత దాడిగా కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ చైనా, రష్యా పర్యటనలు, ముఖ్యంగా ఎస్‌సీవోసమ్మిట్‌లో షీ జిన్‌పింగ్, పుతిన్‌లతో సమావేశాలు, ట్రంప్ బృందాన్ని కలవరపెడుతున్నాయి. ఇంకా, నవారో మోదీ ధ్యానం చేస్తున్న ఫోటోను షేర్ చేసి, భారత సంస్కృతిని లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యలు భారత్–అమెరికా సంబంధాలలో ఒత్తిడిని పెంచుతున్నాయి.