China : ప్రపంచానికే కాదు, భారత్ కు పక్కలో బల్లెం లాగా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. గాల్వాన్ లోయలో, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఎన్నో దారుణాలకు పాల్పడింది. పాల్పడుతూనే ఉంది. ఏకంగా భారత భూభాగంలో ఉన్న గ్రామాలను తన దేశ చిత్రపటంలో చూపించి.. చైనా పన్నాగానికి పాల్పడింది. చైనా సహజ వనరులను సర్వనాశనం చేయడంలో సిద్ధహస్తమైన దేశం. చికెన్ నెక్ రహదారిని తనకు అనుకూలంగా మలచుకోవడంలో చైనా ఎటువంటి దారుణాలకు పాల్పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి బ్రహ్మపుత్ర నది మార్గాన్ని కూడా మళ్లించడానికి చైనా వెనుకాడటం లేదు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాల దృష్టికి భారత్ తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే తన ప్రయోజనాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని చైనా.. బ్రహ్మపుత్ర నది విషయంలో మరింత దూకుడుగా వెళ్తోంది.
అతిపెద్ద డ్యాం
చైనా త్రీ గోర్జెస్ పేరుతో అతిపెద్ద డ్యాం ను నిర్మించింది. దీనివల్ల ప్రపంచ కాలమానంలో మార్పులు చోటు చేసుకున్నాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు త్రీ గోర్జెస్ కంటే అతిపెద్ద డ్యాం ను నిర్మించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఈశాన్య భారతదేశానికి వరప్రదాయని అయిన బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద హైడ్రోపవర్ డ్యాం నిర్మించడానికి చైనా అడుగులు వేస్తోంది. చైనాలో బ్రహ్మపుత్ర నదిని జాంగ్ బో అని పిలుస్తారు .. ఈ నది మనదేశంలో ఈశాన్య రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. వాన కాలంలో ఈ నదికి విపరీతంగా వరద ఉంటుంది. ఈ వరద వల్లే మనదేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో పంటలు పండుతాయి. మనదేశంలోని పశ్చిమబెంగాల్ మీదుగా బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్ లో ప్రవహిస్తుంది. అయితే ఈ నది ప్రవాహం చైనాలో అధికంగా ఉంటుంది. దీనిపై ఇప్పుడు టిబెట్ ప్రాంతంలో అతిపెద్ద హైడ్రోపవర్ డ్యాం నిర్మించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇది కనక పూర్తి అయితే ప్రతి ఏడాది 300 బిలియన్ కిలోవాట్ విద్యుత్ చైనా ఉత్పత్తి చేస్తుంది. దీనికోసం భారీగా నిధులను ఖర్చు చేయనుంది. ఈ నదిపై డ్యాం కనుక పూర్తి అయితే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు చైనా దయాదాక్షిణ్యల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నది ప్రవాహానికి అడ్డంగా ప్రాజెక్టు నిర్మించడం వల్ల.. మనదేశంలోకి బ్రహ్మపుత్ర నది ప్రవాహం ఉండదు. అప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి. ఒకవేళ నీరు ఎక్కువై.. ఆ నీటిని చైనా కనుక కిందికి వదిలితే ఈశాన్య రాష్ట్రాలు జలమయం అవుతాయి. ఎటు చూసుకున్నా చైనా వల్ల భారత్ తీవ్రంగా ఇబ్బంది పడక తప్పదు.. అయితే చైనా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుపడుతోంది. భారీ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఈశాన్య రాష్ట్రాలలో వ్యవసాయం తీవ్రంగా ప్రభావితమవుతుందని.. అది బంగ్లాదేశ్ కు కూడా ఇబ్బందికరంగా మారుతుందని భారత్ వాదిస్తోంది. ప్రపంచ వేదికలపై ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయినప్పటికీ చైనా మారడం లేదు. తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. వేలాదికోట్లతో భారీ ప్రాజెక్టు నిర్మించి.. భారతదేశాన్ని కష్టాల్లో పడేయాలని చైనా భావిస్తోంది. మరి దీన్ని దౌత్యపరంగా భారత ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాల్సి ఉంది.