Yangtze Sturgeon Fish: డ్యామ్‌లు.. ఆధునిక దేవాలయాలు అన్నారు పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా, ఇంకా దేశవ్యాప్తగా పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకునే డ్యామ్‌లు లేవు. ఇప్పటికీ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. చేపట్టాల్సినవి ఉన్నాయి. ఇందుకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే చైనా మాత్రం కట్టిన డ్యామ్‌లు కూల్చివేసింది. 300 డ్యామ్‌లు కూల్చి, 373 హైడ్రో పవర్ స్టేషన్లలో 342 చిన్న స్థాయి స్టేషన్ల కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే ఇదంతా ఒక్క ఏడాదిలోనే జరగలేదు. ఈ చర్యలు 2020 నుంచి అమలవుతున్నాయి, నదీ ప్రవాహాన్ని, అరుదైన చేప జాతులను పరిరక్షించే లక్ష్యంతో చైనా ఇలా చేస్తోంది.
యాంగ్జీ నది పరిరక్షణ కోసం..
చైనా ఆసియాలో అతి పొడవైన యాంగ్జీ నది జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు 300 డ్యామ్‌లను కూల్చివేసింది. ఈ నది చైనా ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థకు కీలకమైనది, కానీ గత దశాబ్దాల్లో నిర్మించిన డ్యామ్‌లు, హైడ్రోపవర్ స్టేషన్లు నదీ ప్రవాహాన్ని అడ్డుకుని, జలచరాలపై తీవ్ర ప్రభావం చూపాయి. 373 హైడ్రోపవర్ స్టేషన్లలో 342 చిన్న స్థాయి స్టేషన్లను నిలిపివేయడం ద్వారా నదీ సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతోంది.
చిషుయ్ హే (రెడ్ రివర్) పునరుద్ధరణ..
యాంగ్జీ ఉపనదుల్లో ఒకటైన చిషుయ్ హే (రెడ్ రివర్) అరుదైన చేప జాతులకు ఆవాసంగా ఉంది. గతంలో డ్యామ్‌ల నిర్మాణం వల్ల ఈ నదీ ప్రవాహం అడ్డంకులకు గురై, కొన్ని ప్రాంతాలు ఎండిపోయాయి. ఈ చర్యలు జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి, ముఖ్యంగా యాంగ్జీ స్టర్జన్ వంటి జాతులు అంతరించే దశకు చేరుకున్నాయి. చైనా 2020 నుంచి ఈ డ్యామ్‌లను తొలగించి, నదీ సహజ స్థితిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటోంది.
Also Read: బెలూచ్ బాంబ్ ఆపరేషన్.. పాకిస్థాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి..
యాంగ్జీ స్టర్జన్ సంరక్షణ..
యాంగ్జీ స్టర్జన్, ఒకప్పుడు యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతంలో విస్తృతంగా కనిపించిన చేప జాతి, 1970 నుంచి డ్యామ్‌ల నిర్మాణం, అతిగా చేపలు పట్టడం వల్ల అంతరించే దశకు చేరుకుంది. 2022లో ఈ జాతిని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించారు. చైనా 2023, 2024లో రెడ్ రివర్ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో భాగంగా రెండు బ్యాచ్‌ల యాంగ్జీ స్టర్జన్‌లను నదిలోకి విడుదల చేసింది, ఇవి నదిలో విజయవంతంగా మనుగడ సాగిస్తున్నాయి.
పర్యావరణవేత్తల ఆందోళన..
పర్యావరణవేత్తలు యాంగ్జీ నది పరివాహక ప్రాంతంలో జీవవైవిధ్యం దెబ్బతినడం, కొన్ని చేప జాతులు అంతరించే దశకు చేరుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డ్యామ్‌లు నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం, నీటి నాణ్యతను దెబ్బతీయడం, జలచరాల ఆవాసాలను నాశనం చేయడం వంటి సమస్యలను ఎత్తి చూపారు. చైనా ఈ ఆందోళనలకు స్పందిస్తూ, డ్యామ్‌ల కూల్చివేత, హైడ్రోపవర్ స్టేషన్ల నిలిపివేత వంటి చర్యలతో ముందుకు సాగుతోంది.