H1B Visa: 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దీంతో అమెరికన్ల పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడినట్లయింది. పాలన పిచ్చోడి చేతిలోకి చేరింది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియడం లేదు. అమెరికా ఫస్ట్ అంటూ వారికి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తున్నాడు. అమెరికన్ల ఉద్యగాలు భారతీయులు కొట్టేస్తున్నారన్న అక్కసుతో మొదట భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని కంపెనీలకు హుకూం జారీ చేశారు. తాజాగా హెచ్–1బీ వీసాల చార్జీలు లక్ష డాలర్లకు పెంచాడు. మరుసటి రోజే ఈ రూల్ కొత్తవారికే అని సవరించాడు. తాజాగా హెచ్–1బీ లాటరీ విధానంలోనూ మార్పు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ కొత్త ప్రతిపాదనలు ఉన్నత నైపుణ్యం ఉన్న విదేశీ నిపుణుల ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, స్థానిక అమెరికన్ ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో రూపొందుతున్నాయి. ఈ సంస్కరణలు లాటరీ విధానాన్ని సమూలంగా మార్చడం, వేతన స్థాయి ఆధారంగా దరఖాస్తులను వర్గీకరించడం వంటి కీలక అంశాలను కలిగి ఉన్నాయి.
లాటరీ విధానంలో సంస్కరణలు..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ప్రస్తుత లాటరీ విధానాన్ని తొలగించి, ఉన్నత నైపుణ్యం గల విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ కొత్త విధానం కింద దరఖాస్తుదారుల వేతన స్థాయిని ఆధారంగా చేసుకుని నాలుగు వర్గాలుగా (లెవల్–1 నుంచి లెవల్4) విభజించి, ఉన్నత వేతనం పొందే అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ చర్య ద్వారా అమెరికన్ ఉద్యోగులకు పోటీని తగ్గించి, అధిక నైపుణ్యం గల విదేశీయులను మాత్రమే ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వేతన వ్యయాలలో గణనీయమైన పెరుగుదల
కొత్త నిబంధనలు 2026 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తే, హెచ్–1బీ ఉద్యోగులకు చెల్లించే వేతన వ్యయాలు గణనీయంగా పెరుగుతాయని డీహెచ్‌ఎస్ అంచనా వేసింది. 2026లో ఈ వ్యయం 502 మిలియన్ డాలర్లకు చేరుతుందని, ఆ తర్వాత 2027లో 1 బిలియన్ డాలర్లు, 2028లో 1.5 బిలియన్ డాలర్లు, 2029లో 2 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ పెరుగుదల అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది.
అమలు గడువు..
ఈ సంస్కరణలను 2026 నుంచి అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందుతున్నాయి. అయితే, ఈ మార్పులు అమల్లోకి రావడానికి ముందు ఫెడరల్ రిజిస్ట్రార్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం, రాజకీయ, ఆర్థిక సవాళ్లను అధిగమించడం అవసరం. ముఖ్యంగా, ఈ సంస్కరణలు అమెరికన్ కంపెనీలు, విదేశీ నిపుణుల ఆకర్షణపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది కీలక చర్చనీయాంశంగా ఉంది.
హెచ్–1బీ వీసా సంస్కరణలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం ఆధారిత ఉద్యోగాలను మెరుగుపరచడం, స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వడం లక్ష్యంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ మార్పులు అమలు చేయడంలో వేతన వ్యయాల పెరుగుదల, కంపెనీలపై ఆర్థిక భారం, విదేశీ నిపుణుల ఆకర్షణలో సమతుల్యతను కాపాడటం కీలకం. ఈ ప్రతిపాదనలు విజయవంతంగా అమలైతే, అమెరికా శ్రామిక శక్తిలో నైపుణ్యం ఆధారిత మార్పులకు బాటలు వేయవచ్చు.