https://oktelugu.com/

Canada vs India: కెనెడాలో హిందువుల ఆలయంపై దాడి.. భారత్ ను కవ్వించేందుకేనా?

భారత్ పై పగతో ఖలీస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కెనెడాలో ఉన్న హిందువులపై దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల తమ నేతల హత్యల వెనుక భారత్ ప్రమేయం ఉందని ఖలీస్థానీ ఉగ్రవాదులతో పాటు కెనెడా ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. తాజాగా హిందూ ఆలయంపై దాడితో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Written By:
  • Mahi
  • , Updated On : November 4, 2024 / 12:06 PM IST

    Canada vs India(4)

    Follow us on

    Canada vs India: భారత్, కెనెడా మధ్య సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. కొంత కాలంగా భారత్ పై ప్రపంచ దేశాల ముందు తీవ్ర ఆరోపణలు చేస్తున్న కెనెడా ప్రధాని, ఇటీవల మరింత డోస్ పెంచారు. ఖలీస్థానీ ఉగ్రవాదుల ఎరివేత విషయంలో భారత్ హద్దులు దాటుతున్నదంటూ ఆయన కొంతకాలంగా మండిపడుతున్నారు. అయితే కెనెడా ఆరోపణలను భారత్ తిప్పికొడుతూనే ఉంది. ఈ క్రమంలో దౌత్యపరంగా తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొంది. ఇప్పటికే ఇరు దేశాలు విదేశాంగ ప్రతినిధులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కెనెడా లో హిందూ దేవాలయంపై ఖలీస్థానీ ఉగ్రవాదులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఇలా హిందూ ఆలయాలపై గతంలోనూ కెనెడాలో దాడులు జరిగాయి. భారత్ ను టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరుగుతున్నాయి. ఆలయాల గోడలపై భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు రాయడం దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. అయితే ఇలాంటి చర్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నది. ఎప్పటికప్పుడు దీనిపై కెనెడా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నది. ఖలీస్థానీ మద్దతుదారుల తీరుతో కెనెడాలో హిందువుల భద్రతపై ఆందోళన నెలకొంది. తాజాగా బ్రాంఫ్టన్లో జరిగిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. కొంతకాలంగా భారత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఖలీస్థానీ వేర్పాటువాదులు ఎదురుచూస్తున్నారు. వీరికి కెనెడాలో అధికార ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తున్నదనే ప్రచారం జోరుగా జరుగుతున్నది.

    మాటతో సరిపెట్టిన ట్రూడో
    బ్రాంఫ్టన్లో హిందూ ఆలయం, భక్తులపై దాడిపై కెనెడా ప్రధాని స్పందించారు. కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. ఖలీస్థానీ ఉగ్రవాదులు భక్తులను కొట్టడంపై ఆయన మండిపడ్డారు. హింసాత్మక ఘటనలను ఆమోదించబోమని స్పష్టం చేశారు. కెనెడాలో నివసిస్తున్న ప్రజలందరూ తమ మత విశ్వాసాలను పూర్తిగా పాటించే హక్కు ఉందని చెప్పారు. హిందువుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. హిందూ ఆలయంపై దాడి ఘటనపై వెంటనే రంగంలోకి దిగి, భద్రతా చర్యలు, విచారణ చేపట్టిన అధికారులకు ఆయన ప్రశంసలు కురిపించారు.

    అయితే హిందూ ఆలయంపై ఆకస్మాత్తుగా ఖలీస్థానీ ఉగ్రవాదులు దాడి చేయడంతో భక్తులంతా ఆందోళనకు గురయ్యారు. దాడి సమయానికి ఆలయంలో ఉన్న ఓ భక్తుడు దీనిపై సోషల్ మీడియా లో కెనెడా ప్రధాని, పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నించారు. భక్తులపై దాడి జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఆయన తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు.

    ముక్తకంఠంతో ఖండన
    ఈ ఘటనపై కెనెడాలో రాజకీయ నేతలు, ప్రజలు తీవ్రంగా స్పందించారు. ఇది ఏ మాత్రం సమ్మతం కాదంటూ మండిపడ్డారు. అమాయక ప్రజలపై దాడిని ప్రపంచం ఊపేక్షించబోదంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ తీరుతోనే ఖలీస్థానీ ఉగ్రవాదులకు కెనెడాలో స్వేచ్ఛ లభిస్తున్నదంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కెనెడాలో తీవ్రవాదం తీవ్రస్థాయిలో పెరుగుతున్నదనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

    మన న్యాయసంస్థల్లోకి ఖలీస్థానీ ఉగ్రవాదులు ప్రవేశించరనడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని ఓ ఎంపీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2023లో నిజ్జర్ హత్య తర్వాత హిందువులపై ఈ దాడులు మరింత పెరిగాయి. హిందూ ఆలయాల గోడలపై నిజ్జర్ ఫోటోలు అంటించి, భారత్ వ్యతిరేక నినాదాలను గతంలో ఈ ఖలీస్థానీ మద్దతుదారులు రాయడం కలకలం రేపింది.