Bangladesh Violence: ఏడాదిన్నర క్రితం బంగ్లాదేశ్‌లో విద్యార్థులు, నిరుద్యోగులు షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా ప్రభుత్వాన్ని గద్దె దించారు. షేక్ హసీనా పారిపోయి వచ్చి భారత్‌తో తలదాచుకుంటోంది. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులకు మహ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాడింది. ఏడాదిపాటు పాలన బాగానే సాగింది. కానీ, ఇటీవల యూనస్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రజలోల ఆగ్రహావేశాలు పెంచుతున్నాయి. గతంలో షేక్ హసీనా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లేచిన విద్యార్థులు, ఈసారి ప్రస్తుత నాయకుడు మహ్మద్ యూనుస్ నిర్ణయాలపై నిరసనలకు దిగుతున్నారు. మైుక్రోఫైనాన్స్ సిద్ధాంతంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనుస్, ఇప్పుడు రాజకీయ రంగంలోకి ప్రవేశించి విధిస్తున్న పరిమితులు యువతలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించాయి. అమెరికా, పాశ్చాత్య వర్గాల ప్రభావంలో నడుస్తున్నాడనే ఆరోపణలు కూడా వేగంగా వ్యాపించాయి.
సంస్కృతిపై దాడి..
యూనుస్ ప్రభుత్వంపై విద్యార్థుల ముఖ్య అభ్యంతరం సాంస్కృతిక ఆంక్షలపైనే కేంద్రీకృతమైంది. సంగీతం, నృత్యం వంటి సాంప్రదాయ కళారూపాలపై నిషేధం విధించడం ప్రతిఘటనకు దారితీసింది. బంగ్లాదేశ్‌లో ప్రజా ఉత్సవాలు, పాటలు సామాజిక జీవితానికి అంతర్భాగం కావంతో ఈ నిర్ణయం యువతలో తీవ్ర ఆగ్రహం రేపింది. విద్యార్థులు రాజధాని వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. 1971 యుద్ధ విజయం ప్రతీక ‘అపరాజయ బంగ్లా’ సమీపంలో ధర్నా చేపట్టారు. ఈ స్థలం వారి స్వాతంత్య్ర సమర చిహ్నంగా నిలుస్తుంది. ఇప్పుడు అది స్వేచ్ఛా హక్కుల కోసం మరో సార్వజనిక ప్రతీకగా మారింది.
అంతర్గతంగా విభజిత సమాజం..
నిరసనల వెనుక విద్యార్థుల్లో ఉన్న సామాజిక అసంతృప్తితోపాటు రాజకీయ విభజన స్పష్టంగా కనిపిస్తోంది. యూనుస్ పాలనలో మతపరమైన సంస్థలకు ప్రాధాన్యం పెరుగుతుందని ప్రతిపక్ష వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితి బంగ్లాదేశ్‌లోని మితవాద, మౌలికవాద వర్గాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచుతోంది. మరోవైపు ప్రభుత్వం నిరసనలను ‘‘దేశ వ్యతిరేక చలనం’’గా చిత్రీకరిస్తూ విద్యార్థులపై కఠిన చర్యలు చేపడుతోంది. అంతర్జాతీయ సమాజం మాత్రం మౌనం పాటిస్తూ పరిస్థితిని పరిశీలిస్తోంది.
అసహనం ఎటు దారి తీస్తుంది?
బంగ్లాదేశ్ యువత చరిత్రాత్మకంగా మార్పుకు కారక శక్తిగా నిలిచింది. హసీనా కాలంలోనే కాదు, 1971 స్వాతంత్య్ర ఉద్యమంలో కూడ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ అదే తరం రాజకీయ మయమైన ఆందోళనను చేపడుతోంది. యూనుస్ ప్రభుత్వ ఆంక్షలు కొనసాగితే, ఈ నిరసనలు భవిష్యత్ రాజకీయ పటంలో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌కి ముందు ఉన్న సవాల్ యువత ఆకాంక్షలు, సాంస్కృతిక స్వేచ్ఛ, రాజకీయ ఆధిపత్యం మధ్య సమతౌల్యం కొనసాగించాల్సిన అవసరం ఉంది.