Jubilee Hills By Election Result 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముగిశాయి. నవంబర్ 14న కౌటింగ్ పూర్తయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో బీజేపీ నిలిచింది. ఇక నాలుగో స్థానం ఎవరిది అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఈసారి ‘‘నోటా’’ ఓటు చర్చనీయాంశమైంది. ముఖ్య పార్టీల మధ్య పోటీ గట్టి స్థాయిలో సాగినప్పటికీ, ప్రజల్లో కొంత అసంతృప్తి ప్రతిబింబంగా నోటాకు ఊహించని స్థాయిలో ఓట్లు వచ్చాయి.
మొదటి స్థానంలో కాంగ్రెస్..
కాంగ్రెస్ అభ్యర్థి 98,988 ఓట్లు సాధించి 24,729 మెజారిటీతో గెలుపొందారు. బీఆర్‌ఎస్ 74,259 ఓట్లతో రెండో స్థానంలో, బీజేపీ 17,061 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం 58 మంది ఉన్నారు. అయితే నాలుగో స్థానం మాత్రం ఎవరూ ఊహించని విధంగా ‘‘నోటా’’ నిలిచింది. 922 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఇది రాజకీయంగా చిన్న విషయం కాదు. ప్రతిపక్షాలకే కాదు, అన్ని పార్టీలకూ ఇది హెచ్చరిక సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్వతంత్ర అభ్యర్థుల నిరుత్సాహం
ఎన్నికల్లో స్వతంత్రులు, చిన్న పార్టీల అభ్యర్థులు ఉన్నప్పటికీ వారెవరూ నోటా కంటే ఎక్కువ ఓట్లను రాబట్టలేకపోయారు. ఇది ఓటర్లలో ప్రధాన పార్టీలే ఆధిపత్యం చూపుతున్న సంకేతమని చెబుతున్నారు. ఎవరూ సంతృప్తికరంగా పనిచేయలేదని భావించిన ఓటర్లు నోటాను ఎంచుకోవడం ఆలోచనాత్మక ప్రతిస్పందనగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇది నిరసనాత్మక స్వరమై, భవిష్యత్తు రాజకీయాల్లో ప్రజాభిప్రాయ దిశను సూచించే సూచికగా పరిగణించవచ్చు.