Bangladesh: బంగ్లాదేశ్(Bangladesh)లో రాజకీయ అస్థిరత కొత్త మలుపు తిరుగుతోంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్(Mahmad Unas) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ప్రజల్లో, సైన్యంలో అసంతృప్తి పెరుగుతోంది. షేక్ హసీనా(Shake Hasena) ప్రభుత్వం కూల్చివేత తర్వాత అధికారంలోకి వచ్చిన యూనస్, దేశాన్ని చైనా ఆధీనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, మరో ప్రజా తిరుగుబాటు ఖాయమనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: భారత తయారీ రంగానికి ‘ట్రంప్’ బూస్ట్…
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్, గ్రామీణ్ బ్యాంక్ స్థాపకుడిగా, మైక్రోఫైనాన్స్ రంగంలో చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే, రాజకీయ నాయకత్వం వహించడంలో ఆయన అనుభవం పరిమితం. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన విద్యార్థి ఉద్యమం తర్వాత, ఆయన తాత్కాలిక ప్రభుత్వ నేతగా నియమితులయ్యారు. కానీ, దేశ ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయన విధానాలు సరిపోవని విమర్శలు వస్తున్నాయి.
చైనాతో సన్నిహిత సంబంధాలు..
బంగ్లాదేశ్‌లోని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చైనాతో సన్నిహితంగా సహకరిస్తోంది. ఇది దేశాన్ని చైనా రుణ ఉచ్చులోకి నెట్టే ప్రమాదం ఉందని స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల యూనస్ చైనా పర్యటన, ఆ దేశంతో ఆర్థిక ఒప్పందాలపై చర్చలు ఈ అనుమానాలను బలపరిచాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో భారత్(Bharath)తో సంబంధాలు గతంలో కంటే బలహీనపడ్డాయి. యూనస్ ప్రభుత్వం భారత్‌పై విమర్శలు చేస్తూ, పాకిస్తాన్(Pakisthan), చైనా వంటి దేశాలతో సన్నిహితంగా మెలుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. యూనస్‌ను ప్రజలు నేరుగా ఎన్నుకోలేదు. ఈ విషయం ఆయన పాలనపై ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుతోంది. ఆర్థిక సంక్షోభం, ఉపాధి కొరత వంటి సమస్యలు పరిష్కారం కాకపోవడం కూడా అసంతృప్తికి కారణం.
షేక్ హసీనా రాజకీయ ప్రభావం..
మాజీ ప్రధాని షేక్ హసీనా అజ్ఞాతంలో, భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయితే అవామీ లీగ్(Awami leage) నాయకురాలిగా ఆమెకు బంగ్లాదేశ్‌లో గణనీయమైన మద్దతు ఉంది. 2024 ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఫలితంగా ఆమె పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె తన అనుయాయులతో సంప్రదింపులు జరుపుతూ, యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ చర్యలు దేశంలో కొత్త హింసాత్మక ఘటనలకు దారితీశాయి, ముఖ్యంగా అవామీ లీగ్ నాయకుల ఆస్తులపై దాడులు జరిగాయి. హసీనా తిరిగి బంగ్లాదేశ్‌లో అడుగుపెడతానని ప్రకటించడం, ఆమె ఆజ్ఞాతంలో ఉన్నప్పటికీ రాజకీయంగా యాక్టివ్‌గా ఉండటం, యూనస్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం భారత్‌పై ఒత్తిడి తెస్తోంది, కానీ భారత్ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
విద్యార్థి ఉద్యమం.. చల్లారిన ఉత్సాహం
షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమం, యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చల్లబడిపోయింది. విద్యార్థి నాయకులు యూనస్ ప్రభుత్వంలో భాగం కావడానికి ఇష్టపడక, కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విభజన యూనస్ ప్రభుత్వానికి మద్దతును మరింత బలహీనపరిచింది. విద్యార్థులు, యువతలో యూనస్ విధానాలపై అసంతృప్తి పెరుగుతోంది, ఇది మరో తిరుగుబాటుకు బీజం వేసే అవకాశం ఉంది.
గత వైభవం కోల్పోతున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ గార్మెంట్స్ పరిశ్రమ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎగుమతి రంగంగా గుర్తింపు పొందింది. హసీనా పాలనలో ఈ రంగం వేగంగా వృద్ధి చెందింది, ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌లకు ఉత్పత్తి కేంద్రంగా మారింది. అయితే, రాజకీయ అస్థిరత, హింసాత్మక నిరసనలు, ఆర్థిక సంక్షోభం ఈ పరిశ్రమను దెబ్బతీశాయి. యూనస్ ప్రభుత్వం ఈ రంగాన్ని పునరుద్ధరించడంలో విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల కార్మికుల్లో, వ్యాపారవేత్తల్లో అసంతృప్తి పెరుగుతోంది.
సైన్యంలో అసంతృప్తి..
బంగ్లాదేశ్ సైన్యం దేశ రాజకీయాల్లో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. యూనస్ పాలనలో సైన్యంలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశంలో స్థిరత్వం తీసుకురావడంలో యూనస్ విఫలమవుతున్నారని, అత్యవసర పరిస్థితి విధించాలని సైనిక అధికారులు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సైన్యం పర్యవేక్షణలో జాతీయ ఐక్యత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా చర్చలో ఉన్నాయి.
మరో తిరుగుబాటు..
ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, మైనారిటీలపై దాడులు బంగ్లాదేశ్‌లో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హిందూ మైనారిటీలపై జరిగిన హింసాకాండ దేశ అంతర్జాతీయ ఇమేజ్‌ను దెబ్బతీసింది. గతంలో హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన విద్యార్థి శక్తి, ఇప్పుడు యూనస్‌కు వ్యతిరేకంగా తిరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన విద్యార్థి పార్టీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించవచ్చు. ఇదు సమయంలో హసీనా నాయకత్వంలో అవామీ లీగ్ తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉంది. ఆమె ఆన్‌లైన్ ప్రసంగాలు, పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచే చర్యలు మరో తిరుగుబాటుకు ఊతం ఇవ్వవచ్చు.