Beirut: ఒకప్పుడు పశ్చిమాసియా పారిస్.. ఇప్పుడు కల్లోలం.. నిత్యం రణరంగం

అందమైన భవనాలు.. ఆహ్లాదకరమైన ప్రకృతి.. విభిన్న మనస్తత్వాలు ఉన్న మనుషులు.. విస్తారంగా పీఠభూమి.. ఎటు చూస్తే అటు ప్రకృతి రమణీయత.. బీ రూట్ ప్రాంతం ఒకప్పుడు ఇలాగే ఉండేది. పశ్చిమాసియా పారిస్ లాగా వినతి కెక్కింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 26, 2024 8:11 am

Beirut

Follow us on

Beirut: అలాంటి ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి హాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చేవారు.. ప్రపంచ స్థాయి నేతలు ఆ ప్రాంతాన్ని దర్శించేవారు. వచ్చే కాలంలో ఇది పారిస్ నగరాన్ని మించిపోతుందని అప్పట్లో అంచనాలు ఉండేవి. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. పైగా పురోగమనం కాస్త తిరోగమనమైంది. స్థూలంగా చెప్పాలంటే అర్థ శతాబ్దంలో మొత్తం మారిపోయింది. ప్రకృతి రమణీయత మాయమైంది. ఆహ్లాదకరమైన వాతావరణం కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు ఎటు చూసినా ఆయుధాలు కనిపిస్తున్నాయి. రాకెట్ చప్పుళ్లు నిత్య కృత్యమవుతున్నాయి. క్షతగాత్రులు, మృతులతో లెబనాన్ రాజధాని బీరూట్ దద్దరిల్లిపోతుంది. బీ రూట్ ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాలలో ఒకటి. ఈ నగరానికి ఐదువేల ఏళ్ల చరిత్ర ఉంది. 16వ శతాబ్దం నుంచి బీ రూట్ ఒట్టో మాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అప్పట్లో లెబ నాన్ ప్రాంతం ఆ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 20వ శతాబ్దం మొదట్లో ఫ్రాన్స్ ఈ దేశాన్ని ఆక్రమించింది. దాదాపు చాలా సంవత్సరాల పాటు ఫ్రాన్స్ పాలకుల పరిపాలనలో లెబ నాన్ ఉంది. దీంతో ఆ దేశంలో ఆధునిక జీవన శైలి కనిపిస్తుంది. ఈ దేశంలో 1930లో సెయింట్ జార్జ్ పేరుతో హోటల్ ప్రారంభించారు. దానికి అనుసంధానంగా బీచ్ క్లబ్ ఏర్పాటు చేశారు. ఈ హోటల్లో అతిరథ మహారధులు ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆధునిక లెబనాన్ కు ఈ హోటల్ కవర్ పేజీ లాగా ఉండేది. 1950 వరకు ఇక్కడ వెస్ట్రన్ కల్చర్ ఉండేది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, నైట్ క్లబ్బులు విస్తారంగా ఉండేవి. ప్రముఖ హోటళ్లు కూడా ఇక్కడ కార్యకలాపాలు సాగించేవి. విభిన్నమైన సంస్కృతి.. ప్రపంచ స్థాయిలో ఫ్యాషన్.. సినీ గ్లామర్.. వంటివి పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులను ఆకర్షించేవి. అరబు దేశాల్లోనే అతిపెద్ద సంపన్న వ్యాపారులు ఈ ప్రాంతంలో నిత్యం కనిపించేవారు. ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో చోట ముసారా అనే పేరుతో మద్యం లభించేది. ఇక్కడి వాతావరణం ద్రాక్ష పంటకు అనుకూలంగా ఉండడంతో మద్యం విస్తారంగా తయారయ్యేది..బీ రూట్ ప్రాంతంలో 1960లో “హమారా స్ట్రీట్” షాపింగ్ కు స్వర్గధామంలా ఉండేది.. ఇందులో అరబ్ సంపన్నులు షాపింగ్ చేసేవారు.

ఆ తర్వాత మారిపోయింది

రంగుల లోకం గా ఉన్న లెబనాన్ 1975 నుంచి క్రమంగా తన ప్రభను కోల్పోవడం మొదలు పెట్టింది. గడిచిన 15 సంవత్సరాల లో ఇక్కడ విపరీతమైన హింస చోటు చేసుకుంది. 1.5 లక్షల మంది ప్రణాళిక కోల్పోయారు. 1975లో ఫలాంగిస్ట్ లైన మైనారిటీ క్రిస్టియన్ మిలిటెంట్లు పాలస్తీనా దేశానికి చెందిన వారిని ఒక బస్సులో తరలిస్తుండగా దాడి చేశారు. దీంతో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఫలితంగా క్రిస్టియన్లు, ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తాయి. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ప్రవేశించడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉద్రిక్తతలలో చిక్కుకు పోయింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ రాకతో దేశంలో పరిస్థితి మారిపోయింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ను ఇస్లాం మతస్తులు, వామపక్ష భావజాలం ఉన్నవారు సమర్ధించారు. స్థానికంగా ఉన్న క్రైస్తవులు వ్యతిరేకించారు. 1982లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ను నాశనం చేసేందుకు ఇజ్రాయిల్ ఆక్రమణ మొదలు పెట్టింది. అయితే అంతర్జాతీయ దేశాల ఒత్తిడితో ఆ గ్రూప్ ను బహిష్కరించారు. అనంతరం ఇరాన్ మద్దతు ఇవ్వడంతో షియా వర్గం ఆధ్వర్యంలో హెజ్ బొల్లా అనే సంస్థ ఏర్పాటయింది. 1976 నుంచి 1988 వరకు బీ రూట్ లో భీకరమైన యుద్ధాలు జరిగాయి. 1989 లో ది తయీఫ్ అగ్రిమెంట్ వల్ల మెల్లగా యుద్ధం తగ్గిపోయినప్పటికీ.. హెజ్ బొల్లా మాత్రం ఇప్పటికీ దాష్టికం కొనసాగిస్తూనే ఉంది.