Eve Jobs : ఆపిల్ కంపెనీని స్థాపించిన స్టీవ్ జాబ్స్ గురించి చాలా మందికి తెలుసు. కానీ ఆయన చిన్న కూతురు ఈవ్ జాబ్స్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఆమె ఎప్పుడూ కెమెరా ముందుకొచ్చి పబ్లిసిటీ కోరుకోదు. అయినా, స్టీవ్ జాబ్స్ కూతురిగా ఆమె పేరు తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఈవ్ తన తండ్రి లాగా టెక్నాలజీ వైపు వెళ్లకుండా, తనకు నచ్చిన దారిని ఎంచుకుంది. ఎవరినీ ఫాలో అవ్వకుండా తనదైన శైలిలో గుర్తింపును సాధిస్తోంది.
ఈవ్ జాబ్స్ 1998లో కాలిఫోర్నియాలో పుట్టింది. ఆమె తల్లి లారెన్ పావెల్ జాబ్స్, తమ పిల్లలు ఫ్యామిలీ పేరు వల్ల వచ్చే పేరు ప్రఖ్యాతులు కాకుండా, సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఈవ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంది. అయితే, టెక్నాలజీ కంటే ఆమెకు మూవింగ్, అందం, క్రియేటివిటీ వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి ఉండేది. మోడలింగ్ ప్రపంచంలోకి రాకముందే ఈవ్ గుర్రపు స్వారీలో చాలా పేరు సంపాదించుకుంది. గుర్రాలు అంటే ఆమెకు ప్రాణం. దీన్ని ఒక వృత్తిగా మార్చుకొని 2019 నాటికి 25 ఏళ్ల లోపు రైడర్లలో ప్రపంచంలోనే ఐదవ స్థానంలో నిలిచింది.
గుర్రపు స్వారీ తర్వాత, ఈవ్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. 2020లో గ్లోసియర్ అనే బ్రాండ్‌తో మోడలింగ్‌లో కనిపించింది. ఆమె మోడలింగ్ చాలా నేచురల్ గా అనిపించింది. తర్వాత డీఎన్ఏ మోడల్ మేనేజ్‌మెంట్ తో ఒప్పందం కుదుర్చుకుని, ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌తో సహా పెద్ద ఫ్యాషన్ షోలలో పాల్గొంది. ఈవ్ మోడలింగ్ ప్రపంచానికి కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ఆమె సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంది. ప్రైవసీకి ఎక్కువ విలువ ఇస్తుంది.
ఈవ్ జాబ్స్ నికర విలువ అధికారికంగా స్పష్టంగా తెలియదు. కాకపోతే ఆమె మోడలింగ్ గుర్రపు స్వారీ ద్వారా 500,000డాలర్ల నుండి 1 మిలియన్ (సుమారు రూ.4.16 కోట్ల నుండి రూ.8.33 కోట్లు)డాలర్ల మధ్య సంపాదించిందని అంచనా. అయితే, ఆమె తల్లి లారెన్ పావెల్ జాబ్స్, తమ పిల్లలకు భారీ వారసత్వాలను ఇవ్వబోమని స్పష్టం చేశారు. వారి ఫ్యామిలీ సంపాదించడం కంటే, దానం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.