Trump immigration policies: అమెరికా ఫస్ట్.. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదాలతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. దానిని అమలు చేయడంలో భాగంగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేశారు. అక్రమంగా ఉంటున్నవారిని తరిమేస్తున్నారు. అయితే ట్రంప్ వలసల నియంత్రణ చర్యలకు ప్రజల మద్దత ఉండడం లేదు. రాయిటర్స్–ఇప్సాస్ పరిశోధనలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలి సర్వేల్లో 39 శాతం మంది మాత్రమే ఆయన విధానాలను సమర్థించగా, మునుపటి 41 శాతం నుంచి ఇది క్షీణించింది. 53 శాతం మంది ఈ చర్యలను అధికంగా కఠినమైనవిగా భావిస్తున్నారు. ట్రంప్ రెండో మారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రంగంలో కట్టుబాట్లు పెంచారు. గత ఫిబ్రవరిలో 50 శాతం మద్దతు ఉండగా, ప్రస్తుతం ఇది చాలా తగ్గింది.
మినియాపొలీస్ ఘటన..
వలసల నియంత్రణ కోసం అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను మొహరించడం కొనసాగుతోంది. ఈ చర్యలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో శనివారం మినియాపొలిస్‌లో ఏజెంట్ల చేత ఒక స్థానికుడు మరణించాడు. ఈ ఘటన శుక్రవారం నుంచి ఆదివారం మధ్య నిర్వహించిన పోల్‌కు సంబంధించిన సమయంతో సమానంగా ఉంది. దీని ప్రభావంతో ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగింది. ట్రంప్ యంత్రాంగం వలసలను అరికట్టేందుకు తీసుకున్న దగ్గరి చర్యలు ఇప్పుడు విమర్శలకు గురవుతున్నాయి.
ప్రజా అభిప్రాయంలో మార్పు..
ట్రంప్ మొదట్లో వలసల విధానాలకు విస్తృత ఆమోదం పొందారు. కానీ ఇటీవలి సంఘటనలు, ఘర్షణలు ప్రజల మనసుల్లో అసౌకర్యాన్ని రేకెత్తించాయి. పోల్ ప్రకారం, ఆయన చర్యలు అధికంగా కఠినమైనవిగా మారాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇది ట్రంప్ పాలనలో ముఖ్యమైన మలుపుగా మారవచ్చు. భవిష్యత్ రాజకీయాల్లో ఈ అంశం కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.