Chevireddy Team Survey: అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం పనితీరు కూడా ముఖ్యం. ప్రతిపక్షం ఎంత బాగా పనిచేస్తేనే అధికారపక్షం అంత బాధ్యతగా వ్యవహరిస్తుంది. అధికారపక్షం పనితీరును కొలవాలంటే విపక్షం పనితీరును కొలవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే పని మీద పడ్డారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). సాధారణంగా ఆయనకు సర్వేలపై విపరీతమైన నమ్మకం ఉంది. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి చాలా సంస్థలతో సర్వేలు చేసుకున్నారు. ఆయన కోసం నేషనల్ మీడియా సైతం రంగంలోకి దిగింది. అదే పనిగా సర్వేలు చేసేవి కూడా. దీనికి తోడు నిఘా సంస్థలు ఎలానూ ఉండేవి. ఐపాక్ అదనపు బలం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. అయితే ఇవన్నీ సర్వేలైతే చేసేవి. కానీ గ్రౌండ్ రియాలిటీని మాత్రం గుర్తించలేకపోయాయి. కొన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డికి చెప్పేందుకు భయపడేవి. దాని పర్యవసానాలే 2024 ఎన్నికల ఫలితాలు.
అప్పట్లో ఐపాక్ అంతా..
2017లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా నియమితులయ్యారు ప్రశాంత్ కిషోర్( Prashant Kishor). వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఐపాక్ రంగంలోకి దిగింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రూపొందించగా.. దానిని అమలు చేసే బాధ్యతను ఋషిరాజ్ సింగ్ చూసేవారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రచార బాధ్యత ఋషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐపాక్ చూసుకునేది. విపక్షాలపై దుష్ప్రచారం బాధ్యతలను ప్రశాంత్ కిషోర్ చూసేవారు. ఆ వ్యూహం పనిచేసే 2019లో జగన్మోహన్ రెడ్డి ఘనవిజయం సాధించారు. అయితే స్వరాష్ట్రంలో రాజకీయం చేయాలని వెళ్లిపోయారు ప్రశాంత్ కిషోర్. జన సూరజ్ పార్టీని స్థాపించి బీహార్లో దారుణంగా ఓడిపోయారు. అయితే ఇప్పుడు రిషిరాజ్ సింగ్ పై ఆ ప్రభావం పడింది. ఆయన నేతృత్వంలోని ఐపాక్ టీం పై జగన్మోహన్ రెడ్డికి నమ్మకం పోయింది. అందుకే ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో కూటమి 18 నెలల పాలనతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సర్వే చేయించారు జగన్మోహన్ రెడ్డి.
చెవిరెడ్డి టీం తో సర్వే..
ఢిల్లీ సంస్థతో సర్వే అని చెబుతున్నా.. అది పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ( Bhaskar Reddy) టీం అని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు చెవిరెడ్డి. పార్టీ కోసం ఎంత దాకా అయినా ముందుకు వెళ్తారు ఆయన. అందుకే జగన్మోహన్ రెడ్డి కోసం సర్వేలు చేసేందుకు ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీం కు చెవిరెడ్డి కుమారుడు ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే వరుస ఈ సర్వే సంస్థలు ఫెయిల్ కావడంతో జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పురమాయించినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనితీరుపై చేసిన ఈ సర్వేలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
తగ్గిన వైసిపి గ్రాఫ్..
రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లు ఈ సర్వే వెల్లడించిందని తెలుస్తోంది. ముఖ్యంగా పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాయలసీమలో ఆ పార్టీ గ్రాఫ్ అట్టడుగుకు చేరినట్లు తేలింది. ఇంకోవైపు పార్టీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తుంటే అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండిపోవడాన్ని సొంత పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయని ఈ సర్వేలో తేలినట్లు సమాచారం. ఇలానే ముందుకు వెళితే 2024 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని ఈ సర్వే తేల్చడం మాత్రం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లు అయింది. ఎంతో ఆనందంతో సర్వే చేయించుకుంటే ఇలాంటి ఫలితాలు రావడం ఏంటని జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నట్లు తెలుస్తోంది.