American Flag On Greenland: భరత పొరుగున ఉన్న చైనా, నేపాల్ తరచూ భారత్‌లోని భూభాగాలను కలుపుకుని మ్యాప్‌లు విడుదల చేయడం చూస్తుంటాం. ఇటీవ బంగ్లాదేశ్‌కు చెందిన యువనేత కూడా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను కలుపుకుని గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో ఓ మ్యాప్ విడుదల చేశాడు. కానీ తర్వాత రెండు రోజులకే అతనిపై దాడి జరిగింది. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇప్పుడు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కూడా చైనా, నేపాల్, బంగ్లాదేశ్ బాటలో పయనిస్తున్నాడు. రెండోసారి అధ్యక్ష బాధ్యతులు చేపట్టి ఏడాది పూర్తికావస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ రాజ్య విస్తరణ పిచ్చి పీక్స్‌కు చేరింది. తాజాగా తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో రెండు ఫొటోలు షేర్‌చేసి కొత్త వివాదానికి తెరతీశాడు.
ఆ దేశాలను అమెరికాలో కలిపేసి..
మొదటి చిత్రంలో గ్రీన్‌లాండ్ సరిహద్దులో అమెరికా జెండాను ఆవిష్కరిస్తున్నట్లు చూపించారు. ట్రంప్‌తోపాటు ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో అందులో ఉన్నారు. స్థానిక మైలురాయి బోర్డులో ’గ్రీన్‌లాండ్ – అమెరికా భాగం, 2026 నుంచి’ అని రాశారు. ఇక రెండో ఫొటోలో ఓవల్ ఆఫీస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇటలీ ప్రధాని మెలోనీ, బ్రిటన్ ప్రధాని స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లైయెన్‌తో కూడా కనిపించారు. ఆ చిత్రంలోని మ్యాప్‌లో కెనడా, గ్రీన్‌లాండ్, వెనెజువెలాను అమెరికా భూభాగాలుగా చూపించారు.
గ్రీన్‌లాండ్‌లో సైనిక చర్యలు..
ట్రంప్ పోస్ట్ తర్వాత ఎన్‌వోఆర్‌ఏడీ(నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్) ఎక్స్‌లో ప్రకటన విడుదల చేసింది. గ్రీన్‌లాండ్‌లోని పిటుఫ్సిక్ వింగ్‌కు యుద్ధ విమానాన్ని పంపుతున్నామని తెలిపారు. దీర్ఘకాల భద్రతా ప్రణాళికల అమలుకు డెన్‌మార్క్, గ్రీన్‌లాండ్ అధికారులతో సమన్వయం చేస్తున్నామని వివరించారు. ఈ చర్యలు ట్రంప్ మ్యాప్‌తో ముడిపడి మరింత ఉద్రిక్తత పెంచాయి.
51వ రాష్ట్రంగా కెనడా..
2025 మేలో ట్రంప్ కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చుకుంటుందని ప్రకటించారు. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో గవర్నర్ అవుతారని వ్యంగ్యపూరితంగా చెప్పారు. కానీ కొత్త ప్రధాని మార్క్ కార్నీ దీన్ని తిరస్కరించి, స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటామని ప్రత్యామ్నాయం ఇచ్చారు. ట్రంప్ మాత్రం తన వైఖరి మార్చుకోలేదు, ఇప్పుడు మ్యాప్ ద్వారా దాన్ని ప్రతిబింబించారు. కొత్త మ్యాప్‌లో కెనడాను చేర్చి ఆక్రమణ తప్పదు అనే సంకేతం ఇచ్చారు.
మొత్తంగా ట్రంప్ రాజ్య విస్తరణ పిచ్చి పీక్స్‌కు చేరినట్లు కనిపిస్తోంది. ఏడాది పాలనలో అనేక అనాలోచిత, అసంబద్ధ, అనైతిక నిర్ణయాలతో ఇటు అమెరికన్లను, అటు ప్రపంచ దేశాను ఇబ్బంది పెడుతున్నాడు. తాజాగా అధికార దాహంతో ఏకంగా మ్యాప్‌నే మార్చేశాడు. దీంతో ట్రంప్ మానసిక స్థితిపై చాలా మందిలో సందేహాలు తలెత్తుతున్నాయి. కొత్త మ్యాప్‌ల పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.
