American dream stolen: ముసలితాతా.. ముడత ముకము.. మురిసిపోయెనే.. అన్నట్లు.. ముసలి తనంలో రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. భారత్‌పై తన అక్కసును ఆపులోకేకపోతున్నారు. మన దేశంలో విపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న స్థాయిలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మరో ప్రతిపక్షంగా మారిపోయాడు. నిత్యం భారత్‌పై పడి ఏడవడమే పనిగా పెట్టుకున్నాడు. ట్రంప్ మాటను భారత్ లెక్క చేయకపోవడం, ఆంక్షలను పట్టించకోకపోవడం.. ఇదే సమయంలో భారత్ అభివృద్ధిలో దూసుకుపోవడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. నెల రోజులుగా అమెరికాలో షెట్‌డౌన్ అమలవుతుండగా, భారత్ మాత్రం వెలిగిపోతోంది. ఇదే ట్రంప్‌కు కంటగింపుగా మారింది. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి వలసదారులపై ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. మాస్ డిపోర్టేషన్లు, అరెస్టులు, లీగల్ ఎంట్రీలపై పరిమితాలు అన్నీ ఆయన వలస విధానంలో ప్రాధాన్యత పొందుతున్న అంశాలుగా మారాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆధారం అయిన విదేశీ కార్మికులపైనా ఈ నిబంధనలు నేరుగా ప్రభావం చూపుతున్నాయి.
వలస వ్యతిరేక ప్రచారం..
తాజాగా అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన యాడ్‌లో హెచ్–1బీ వీసా దుర్వినియోగంపై తీవ్ర వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ ప్రకటన ప్రకారం, అమెరికన్ యువత ఉద్యోగాలను తక్కువ జీతాలతో విదేశీ కార్మికులు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ‘‘వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ డ్రీమ్ మాయమవుతోంది’’ అంటూ యాడ్‌లో పేర్కొన్నారు. గ్రాఫ్ రూపంలో చూపిన గణాంకాల ప్రకారం హెచ్–1బీ వీసాల్లో 72 శాతం భారతీయులకే జారీ అవుతున్నట్లు వెల్లడించారు. దీంతో అమెరికన్ యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని ప్రచారం మొదలు పెట్టింది.
‘ప్రాజెక్ట్ ఫైర్వాల్’..
లేబర్ శాఖ తాజాగా ‘ప్రాజెక్ట్ ఫైర్వాల్’ పేరుతో విచారణ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా టెక్ కంపెనీలు హెచ్–1బీ వీసాలను ఎంతవరకు సముచితంగా వాడుతున్నాయన్నది అంచనా వేయనుంది. అమెరికన్ ఉద్యోగులను విదేశీ వర్కర్లతో భర్తీ చేసే ధోరణిని అరికట్టడమే దీని లక్ష్యం. ట్రంప్ ప్రభుత్వం హెచ్–1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం పెద్ద చర్చకు దారితీసింది. ‘‘ఇది ఉద్యోగదారుల మోసాలను కట్టడి చేసేందుకు, వేతన వ్యవస్థను రక్షించేందుకు తీసుకున్న చర్య’’ అని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసింది. వారు తమ వాదనలో ‘‘ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రతిభావంతుల నియామక ప్రక్రియకు అడ్డంకిగా మారుతుంది’’ అని పేర్కొన్నారు. టెక్ రంగ సంస్థలు, ఉద్యోగ సంఘాలు కూడా ట్రంప్ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశాయి.
వ్యాపారాలకు సవాల్..
వీసా వ్యవస్థ కఠినతరం కావడంతో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించడంలో అమెరికా కంపెనీలు సంకుచిత స్థితిలోకి వెళ్లాయి. కొంతమంది కాంగ్రెస్ సభ్యులు కూడా ట్రంప్‌ను నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతూ లేఖ రాశారు. వారు హెచ్చరించినట్లుగా, ఈ విధానాలు అమెరికాకు ప్రతిభను దూరం చేయడం ద్వారా దీర్ఘకాల ఆర్థిక ప్రభావం చూపవచ్చు.
మొత్తంగా ట్రంప్ వలస విధానం వెనుక రాజకీయ ప్రేరణలు ఉన్నా, దీని ఆర్థిక ప్రతిస్పందన గ్లోబల్ లెవెల్‌లో అనివార్యం అవుతోంది. అమెరికా డ్రీమ్‌ను రక్షించాలనే నినాదం వెనుక అంతర్జాతీయ మానవ వనరుల ప్రవాహం అడ్డంకులు ఎదుర్కొంటోంది. టెక్ రంగం, స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇదే కారణంగా తదుపరి దశలో ప్రతిభా ఎగుమతుల కొత్త దిశలో పయనించే అవకాశం ఉంది. మొత్తంగా ముసలి ట్రంప్.. భారత్‌ను టార్గెట్ చేస్తూ దసరా పండుగ చేసుకుంటున్నాడు.