America Visa: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న చర్యలు, వీసా విధానంలో అనుసరిస్తున్న తీరుతో అమెరికాలో చదువుకోవాలి.. ఉద్యోగాలు చేయాలి అనుకునేవారి డాలర్ డ్రీమ్ చెదిరిపోతోంది. ఇప్పటికే చాలా మంది అమెరికాకు వెళ్లాలన్న కోరికను చంపుకున్నారు. ప్రత్యామ్నాయ దేశాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అమెరికా విద్యార్థుల వీసాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: జగన్ పై వాహన ప్రమాద కేసులో చర్యలన్నీ నిలిపేసిన కోర్టు
అమెరికా, విదేశీ విద్యార్థులకు ప్రధాన విద్యా కేంద్రంగా ఉన్నప్పటికీ, విద్యార్థి వీసాలపై కొత్త ఆంక్షలు విధించే ప్రతిపాదనలు విద్యార్థులలో ఆందోళన కలిగిస్తున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ఎఫ్–1, జే–1 వీసాలకు పరిమిత కాల గడువు విధించాలని ప్రతిపాదించింది. ఇది ఇప్పటివరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వెసులుబాటును మార్చనుంది. ఈ మార్పులు అమలైతే, భారతీయ విద్యార్థులతో సహా లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం పడనుంది.
ప్రస్తుత వీసా విధానం..
ప్రస్తుతం, ఎఫ్–1 వీసాపై అమెరికాలో చదువుకునే విద్యార్థులు, జే–1 వీసాపై ఎక్సే్ఛంజ్ విజిటర్లుగా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు తమ అధ్యయనం లేదా కార్యక్రమం పూర్తయ్యే వరకు దేశంలో ఉండేందుకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ సౌలభ్యం ఉంది. ఈ విధానం విద్యార్థులకు సౌకర్యవంతమైన నివాస అనుమతిని అందిస్తుంది. అయితే, డీహెచ్‌ఎస్ ఈ వెసులుబాటును రద్దు చేసి, నిర్ణీత కాలపరిమితితో కూడిన వీసాలను జారీ చేయాలని ప్రతిపాదిస్తోంది.
కొత్త ప్రతిపాదనలు ఇవీ..
కొత్త ప్రతిపాదనల ప్రకారం, విద్యార్థి వీసాలకు నిర్దిష్ట గడువు విధించబడుతుంది, దీని తర్వాత విద్యార్థులు వీసా పొడిగింపు కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ వద్ద సమీక్షలో ఉన్నాయి. సమీక్ష తర్వాత, ఈ ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురితమై, 30 లేదా 60 రోజుల పాటు ప్రజాభిప్రాయాలను సేకరిస్తారు. అయితే, ప్రజాభిప్రాయాలు సేకరించకుండానే మధ్యంతర ఉత్తర్వులతో ఈ మార్పులను తక్షణమే అమలు చేసే అవకాశం కూడా ఉందని సమాచారం.
విద్యార్థులపై ప్రభావం..
ఈ కొత్త ఆంక్షలు అమలైతే, విద్యార్థులు వీసా పొడిగింపు కోసం అదనపు దరఖాస్తు ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఆర్థిక, పరిపాలనా భారాన్ని పెంచుతుంది. ముఖ్యంగా, అమెరికాలో చదువుతున్న 3.3 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులపై ఈ మార్పులు గణనీయమైన ప్రభావం చూపుతుంది. వీసా పొడిగింపు ప్రక్రియలో ఆలస్యం లేదా తిరస్కరణలు విద్యార్థుల విద్యా లక్ష్యాలను దెబ్బతీసే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది.