America: హమాజ్‌సై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి ఇన్నాళ్లూ మద్దతు తెలుపుతూ వచ్చిన అగ్రరాజ్యం అమెరికా..తాజాగా షాక్ ఇచ్చింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండంతో అమెరికా కన్నెర్రజేసింది. ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాల్సిన కీలక ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇందులో 2 వేల పౌండ్ల బరువైన 1800, 500 పౌండ్ల బరువైన 1700 బాంబులు ఉన్నాయి. భారీస్థాయిలో విధ్వంసం సృష్టించే ఈ బాంబులను సరఫరా చేస్తే రఫాసై ఇజ్రాయెల్ విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వాటి సరఫరాను ఆపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ధ్రువీకరించారు.
స్వీయ రక్షణ ఆయుధాలే..
ఇజ్రాయెల్‌కు స్వీయ రక్షణ ఆయుధాలే సరఫరా చేస్తామని, రఫాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గత వారం కీలక నిర్ణయం తీసుకున్నామని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ తెలిపారు. దాదాపు 14 నుంచి 14 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకున్నారు. ఈ నగరంపై దాడిచేస్తే భారీగా మానవ సంక్షోభం తప్పదని అమెరికా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అయినా ఇజ్రాయెల్ అమెరికాను ఖాతరు చేయడం లేదు. అమెరికా సహా ఎవరూ తమను ఆపలేరని నెతన్యాహు బహిరంగంగానే ప్రకటించారు. అమెరికా ఎంత చెబుతున్నా రఫాపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా రఫాలోని హమాస్‌ను నాశనం చేస్తామంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా బాంబుల సరఫరా నిలిపివేసింది.
కీలక పాస్‌లు తెరిచిన ఇజ్రాయెల్..
ఇదిలా ఉండగా రఫా తూరు ప్రాంతంలో ఈజిప్టు, గాజా మధ్య కీలక కరెమ్ షాలూమ్ పాస్‌ను తెలిచినట్లు ఇజ్రాయెల్ బుధవారం ప్రకటించింది. ఈ మార్గంపై ఆదివారం రాత్రి హమాస్ రాకెట్లతో దాడిచేసింది. దీంతో పాస్‌ను తాత్కాలికంగా ఐడీఎఫ్ నిలిపివేసింది. ఈ మార్గాన్ని తెలిచినా గాజాకు మానవతాసాయం అందడం లేదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. పాలస్తీనాకు సాయం చేయడానికి ఎవరూ రావడం లేదని తెలిపింది. మరోవైపు అమెరికా యూనివర్సిటీల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బుధవారం జార్జి వాషింగ్‌టన్ యూనివర్సిటీలో ప్రవేశించి గాజా యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 33 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.