America Pakistan Deal: గొర్రె ఎప్పుడు కసాయివాడినే నమ్ముతుంది. కానీ తల నరికే వరకూ తెలియదు యజమాని తనను కోసి తినడానికే పెంచుతున్నాడని.. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆర్థిక సంక్షోభం.. అంతర్గత కలహాల నుంచి తన దేశాన్ని గట్టెక్కించేందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైనికాధికారి ఆసిమ్ మునీర్.. అమెరికా అధ్యక్షుడు.. టెంపరోడు అయిన ట్రంపును బాగా నమ్ముతున్నారు. తమ దేశంలోని రేర్ మినరల్స్‌ను తవ్వుకుపోతే.. వచ్చే లాభాల్లో తమ బొచ్చలో నాలుగు డాలర్లు వేయకపోతారా అని ఆశపడుతున్నారు. ఈక్రమంలోనే రహస్యంగా వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. అమెరికా–పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలు గతంలో పరిమితంగా ఉన్నప్పటికీ, భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఇటీవల జరిగిన సైనిక ఆపరేషన్ల తర్వాత పరిస్థితి మారింది. అమెరికా సైనిక వేడుకల్లో పాకిస్థాన్ ఆర్మీ అధిపతి అసిమ్ మునీర్ హాజరుకావడం, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి సంకేతమైంది.
అరుదైన వనరుల వ్యాపార ఒప్పందం
సెప్టెంబర్‌లో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్థాన్‌లోని రేర్ ఎర్త్, క్రిటికల్ మినరల్స్‌ను వెలికితీసి అమెరికాకు సరఫరా చేయడం నిర్ణయమైంది. ఇప్పటికే తొలి నమూనా సరుకు అమెరికాకు చేరింది. దీన్ని నిపుణులు చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంగా భావిస్తున్నారు. అమెరికా పెట్టుబడి 500 మిలియన్ డాలర్లకు చేరవచ్చని సమాచారం.
పాకిస్తాన్‌లో ప్రకంపనలు..
అమెరికా, పాకిస్తాన్ మధ్య జరిగిన వ్యాపార ఒప్పందంపై దాయాది దేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీన్ని రహస్య డీల్‌గా పేర్కొంటూ, పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి. దేశ ఖనిజ సంపద విదేశాలకు వెళ్లిపోతుందనే ఆందోళనతో ప్రజా నిరసనలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ ప్రజలు కూడా పరిణామాలను గమనిస్తున్నారు. తమకు ముప్పుగా మారితే తిరుగుబాటు చేసేందుకు బీఎల్‌ఏ సిద్ధమవుతోంది.
అమెరికా వ్యూహాత్మక ప్రయోజనం
ఇదిలా ఉంట ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అరుదైన ఖనిజాల సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవి జాతీయ భద్రత, క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కీలకమైనవి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయుధ ఉత్పత్తికి కూడా ఈ వనరులు అవసరమని ఆయన ముందే స్పష్టంచేశారు. ఇదే సమయంలో రేర్ ఎర్త్ మినరల్స్‌లో చైనా ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే పాకిస్తాన్‌తో చేతులు కలిపాడు.
పాకిస్థాన్–అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక, వాణిజ్య సంబంధాలు భారత్‌కు వ్యూహాత్మకంగా సవాల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత భద్రతా సంస్థలు, విదేశాంగ విభాగం ఇరు దేశాల కదలికలను దగ్గరగా గమనిస్తున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం.. అమెరికా–పాకిస్తాన్ మైత్రిని కసాయి–గొర్రె సంబంధంతో పోలుస్తున్నారు. తొందర పడకు సుందరవదనా అని పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీచీఫ్‌ను హెచ్చరిస్తున్నారు.