Afghanistan warns Pakistan: పాకిస్తాన్–ఆఫ్గానిస్తాన్ సంబంధాలు మరోసారి సంక్షోభ అంచుకు చేరుకున్నాయి. తెహ్రీక్–ఎ–తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాదుల కార్యకలాపాల నేపథ్యంలో పాకిస్తాన్ తన సరిహద్దు దాటి ఆఫ్గాన్ భూభాగంపై వైమానిక దాడులకు పాల్పడడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీనికి ప్రతిగా ఆఫ్గాన్ సైన్యం ప్రతిదాడులు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. టీటీపీ పాకిస్తాన్ లోపల ఉగ్రదాడులు జరుపుతూ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులు ఆఫ్గాన్ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారని ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఆఫ్గాన్ కండిస్తోంది. బదులుగా, పాకిస్తాన్ రాజకీయ సమస్యలను ఉగ్రవాదం పేరుతో పరిసర దేశాలపై మోపుతోందని ఆఫ్గాన్ అధికారులు స్పందించారు.
ప్రహసనంగా మారిన శాంతి చర్చలు..
ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా రంగంలోకి దిగి రెండు దేశాల మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిర్చాయి. కానీ ఆ ఒప్పందం కాలపరిమితి ముగిసిపోయింది. ఇస్తాంబుల్‌లో ఇటీవల జరిగిన తదుపరి చర్చల్లో ప్రగతి లేకపోవడం మరోసారి ప్రతిస్పందనాత్మక పరిస్థితిని తీసుకొచ్చింది. చర్చలు విఫలమవడానికి పాకిస్తాన్ వైఖరే కారణమని ఆఫ్గానిస్తాన్ ఆరోపిస్తోంది.
యుద్ధ హెచ్చరికలు..
ఆఫ్గాన్ తాలిబాన్ ప్రభుత్వం తాజాగా పాకిస్తాన్‌కు శాంతి ఒప్పందం కుదరని పక్షంలో యుద్ధానికి సిద్ధమని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు పాకిస్తాన్ తదుపరి చర్చలకు అవకాశం లేదు అని స్పష్టం చేసింఇ. దీంతో ప్రాంతీయ శాంతికి విఘాతం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు వాతావరణం అశాంతితో నిండి పోయింది. రెండు ఇస్లామిక్ దేశాల మధ్య శాంతి భద్రతలు దెబ్బతింటే.. దాని ప్రభావం సంపూర్ణ దక్షిణాసియా స్థిరత్వంపై పడే అవకాశం ఉంది. వాణిజ్య మార్గాలు, శరణార్థుల సమస్య, ఉగ్రవాద శక్తుల పెరుగుదల మొదలైన అంశాలు పొరుగు దేశాలకూ తలనొప్పిగా మారవచ్చు.
తన భద్రత పేరుతో దాడి చేస్తున్న పాకిస్తాన్, ప్రతిస్పందన పేరుతో హెచ్చరిస్తున్న ఆఫ్గానిస్తాన్ ఇరువైపులా నమ్మకం తగ్గిపోతోంది. మతం, సరిహద్దు, ఉగ్రవాదం అనే మూడు అంశాలు ఈ ప్రాంతాన్ని మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొల్పాయి. పాకిస్తాన్‌కి ఇది రక్షణగా అనిపించినా, ఆఫ్గాన్‌కి ఇది స్వాభిమానంతో యుద్ధ సంకేతాలు వస్తున్నాయి.