Kamala Harris: అమెరికా అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బైడెన్‌ను తప్పుకోవాలని చాలారోజులుగా సొంత పార్టీ నేతలే ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కరోనాబారిన పడిన బైడెన్.. తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం తాను దేశం కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. తన వారసురాలిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత మూలాలు ఉన్న కమలా హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చారు. అయితే పార్టీ ప్రతినిధులు ఇంకా అధికారికంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే బైడెన్ మద్దతు ఇవ్వడంతో డెమొక్రాట్ల మద్దతు కూడగట్టుకునే పనిలో కమలా ఉన్నారు. ప్రతినిధుల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించుకుని అమెరికా అధ్యక్షురాలు కావాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే.. కమలా డెమొక్రటిక్ అభ్యర్థిగా ఎంపికై అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై విజయం సాధిస్తే.. అమెరికా చరిత్రలోనే ఓ మహిళ అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారు. మరోవైపు ట్రంప్.. బైడెన్‌కన్నా.. కమలాను ఓడించడం మరింత సులువని అంటున్నారు. అయితే అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అన్నారు.
తమిళనాడుతో బంధం..
ఇదిలా ఉంటే.. కమలా హారిస్‌కు తమిళనాడుతో సంబంధం ఉంది. పైంగనాడు–తులసేంద్రపురం కమలా తాతల ఊరు. ఈ గ్రామ ప్రజలు ఆమె అగ్రరాజ్యం అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉండాలని కోరుకుంటున్నారు. సోమవారం ఆమె గెలుపు కోసం గ్రామంలోని ధర్మశాస్తా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమలా దేవి గెలిచే వరకూ తమ పూజలు కొనసాగుతాయని గ్రామస్తులు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పీవీ.గోపాలన్ మనవరాలు బరిలో ఉండడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆమె డొనాల్డ్ ట్రంప్‌పై విజయం సాధించాలని పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక ధర్మ శాస్త్రా ఆలయ పునరుద్ధరణ కోసం రూ.5 వేల చొప్పున విరాళాలు వేసుకున్నామని, విరాళం ఇచ్చిన వారిలో కమలా హారిస్ మామ బాలచంద్రన్ గోపాలన్ ఉన్నారని తెలిపారు. ఆలయం మేనేజ్‌మెంట్ వారికి తరచూ విబూతి కుంకుమ పంపిస్తుందని చెప్పారు. ఆలయంలో జరిగే కార్యక్రమాలకు వారిని ఆహ్వానిస్తుందని వెల్లడించారు. వారు వలస వెళ్లినా గ్రామంతో అనుబంధం కొనసాగిస్తున్నారని తెలిపారు.
చెన్నైకి 50 కి.మీ దూరంలో..
ఇక కమలా హారిస్ తాతల ఊరు.. పైంగనాడు–తులసేంద్రపురం తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామ ప్రజలు 2020లో కమలా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా సంబురాలు చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా ఆమె అధ్యక్ష రేసులోకి రావడంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు. కమలా ఎన్నికయ్యే వరకూ ఆలయంలో పూజలు చేస్తామని చెబుతున్నారు.
రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షడిగా ఆంధ్రా అల్లుడు..
ఇదిలా ఉంటే… అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఆయనపై ఇటీవల పెన్సిల్వేనియాలో కాల్పులు జరిగాయి. తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఇక ఆయన రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ అల్లుడు. జేడీ.వాన్స్‌ను ప్రకటించారు. వాన్స్ భార్య ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న మహిళ. ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితమే అమెరికాకు వలస వెళ్లారు. వీరి స్వగ్రామం కృష్ణా జిల్లాలోని పామర్రు. 2021లో ఉషా చిలుకూరి జేడీ.వాన్స్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తన భార్య తనకు బలమని వాన్స్ కూడా చాలాసార్లు తెలిపారు. ఆమెపై పుస్తకం కూడా రాశారు.
మొత్తంగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్తిగా కమలా హారిస్ ఎన్నికై అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినా.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినా.. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు కీలకం కానున్నారు. కమలా గెలిస్తే అధ్యక్షురాలవుతారు. ట్రంప్ గెలిస్తే భారత మూలాలున్న ఉషా చిలుకూరి భర్త జేడీ.వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు అవుతారు.