Homeఅంతర్జాతీయంPlane Crash: ఆగని ప్రమాదాలు.. మరణాలు.. ప్రపంచానికి ఏమైంది? అమెరికాలో మరో దారుణం

Plane Crash: ఆగని ప్రమాదాలు.. మరణాలు.. ప్రపంచానికి ఏమైంది? అమెరికాలో మరో దారుణం

Plane Crash: ప్రపంచంలో ఏదో ఒకచోట ప్రమాదం జరిగితే… దురదృష్టవశాత్తు చోటుచేసుకుంది అంటాం. ఆ ఘటనలో ప్రాణాలు పోతే పాపం అని బాధపడతాం. కానీ ఒకే తరహా సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటే.. ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటే దాన్ని ఏమనాలి.. దురదృష్టమా, మానవ నిర్లక్ష్యమా? అనే విషయాలను పక్కన పెడితే పోతున్న ప్రాణాలను చూస్తే మాత్రం ప్రాణం చివుక్కుమంటున్నది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు దారుణాలు జరుగుతున్న తీరు చూస్తే మానవజాతికి అంతం మొదలైందా అనే అనుమానం కలుగుతోంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా టేకురు ప్రాంతంలో వేమూరి కావేరి అనే ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు కాలిపోయింది. ఇందులో పదిమంది సజీవ దహనమయ్యారు. చాలామంది ప్రయాణికులు గాయాల బారినపడ్డారు. ఈ ప్రమాదాన్ని మర్చిపోకముందే మనదేశంలో రాజస్థాన్ ప్రాంతంలో మరో ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇక్కడ కూడా భారీగానే ప్రాణ నష్టం సంభవించింది. దీన్ని మర్చిపోకముందే తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సు ను టిప్పర్ ఢీకొనడంతో 20 మంది దాకా చనిపోయారు. చత్తీస్ గడ్ ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు దాకా చనిపోయారు.

మనదేశంలోనే పరిస్థితి ఇలా ఉందనుకుంటే.. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాకపోతే అక్కడ రోడ్డు ప్రమాదాల కంటే.. రైలు ప్రమాదాల కంటే.. విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని లూయిస్ విల్లే ప్రాంతంలోని మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో దారుణమైన ప్రమాదం జరిగింది. యుపిఎస్ కార్గో విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి మంటల్లో చిక్కుకుంది. దీంతో ఫ్లైట్ పేలిపోయి భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. పలు భవనాలు కాలిపోయాయి. విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆ ఫ్లైట్ హవాయి ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? అనేది తెలియాల్సి ఉంది.

ఇదే సంవత్సరంలో సరిగ్గా కొద్ది నెలల క్రితం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ప్రాంతంలో ఎయిర్ ఇండియా సంస్థకు సంబంధించిన విమానం గాల్లో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తింది. ఈ ప్రమాదంలో విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం తీవ్రంగా సంభవించింది. ఈ ప్రమాదానికి ఇంజన్లో సాంకేతిక లోపమే కారణమని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఇలా వరుసగా జరుగుతున్న ప్రమాదాలు తీవ్రమైన భయాన్ని కలగజేస్తున్నాయి. ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రమాదాల వల్ల ప్రాణ నష్టం కూడా తీవ్రంగా జరుగుతుండడం కలకలం రేపుతోంది.

ఇటీవల ఓ స్వామీజీ ప్రపంచ వ్యాప్తంగా జరగబోయే ప్రమాదాల గురించి ముందుగానే హెచ్చరించారు. ఆగస్టు నుంచి డిసెంబర్ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతాయని.. వాయు, భూమి, జల రవాణా వ్యవస్థలలో అనుకొని సంఘటనలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. ఆయన హెచ్చరించినట్టుగానే ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version