Trump Tariffs China: నోబెల్ ప్రైజ్ రాలేదన్న అక్కసు.. చైనా తనకు లొంగడం లేదన్న కోపం.. రేర్ ఎర్త్ మినరల్స్‌పై చైనా ఆధిపత్యం.. పాకిస్తాన్‌తో రేట్ మినరల్స్‌తో అమెరికా డీల్ కుదరడం.. ఈ కారణాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వాణిజ్య యుద్ధానికి తెరతీశాడు. ఈసారి చైనాపై టారిఫ్ బాంబుతో విరుచుకుపడ్డాడు. ఇప్పటికే చైనాపై 30 శాతం టారిఫ్‌లు అమలవుతున్నాయి. దీనికి అదనంగా మరో వంద శాతం సుంకాలు విధించారు. నవంబర్ 1 నుంచి చైనా ఉత్పత్తులపై ఇవి అమలులోకి వస్తాయని ప్రకటించారు. దీంతో మినహాయింపు లేకుండా అన్ని దిగుమతులపై ప్రభావం చూపే ఈ చర్య, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను తీవ్రమైన స్థాయికి తీసుకెళ్తోంది.
చైనా ‘దూకుడైన వాణిజ్యం’పై ఆరోపణ ..
ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో, చైనా వాణిజ్యం విషయంలో ఆక్రమణ ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. చైనా అమెరికా ఉత్పత్తులపై భారీ ఎగుమతి ఆంక్షలు విధించాలని యోచిస్తోంది అన్న నివేదికల నేపథ్యంలో, ఇది ముందస్తు ప్రతిస్పందనగా తీసుకున్న నిర్ణయమని తెలిపారు. క్రిటికల్ సాఫ్ట్‌వేర్, ఇతర దేశాలకు పంపడంపై కూడా కొత్త నియంత్రణలు విధిస్తున్నట్లు ఘటించారు.
అరుదైన ఖనిజాలపై ఆధిపత్యమే కారణం..
చైనా, అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులను పరిమితం చేయడం ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. దీనికి ప్రతిస్పందనగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో జరగాల్సిన భేటీని రద్దు చేస్తానని హెచ్చరించి, కొన్ని గంటలకే భారీ టారిఫ్‌లు విధించే ప్రకటన చేశారు. ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతను మరింత పెంచింది.
గత వాణిజ్య యుద్ధం పునరావృతం?
2018–2019లో జరిగిన అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు గణనీయమైన నష్టం కలిగించింది. అప్పట్లో చర్చల ద్వారా తాత్కాలిక ఒప్పందం కుదిరినా, దీర్ఘకాల పరిష్కారం లభించలేదు. కొత్తగా వస్తున్న ఈ సుంకాల నిర్ణయం, ఆ పాత యుద్ధానికి మళ్లీ నిప్పు పెట్టే అవకాశముంది.
ఈ తాజా చర్యతో అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు మరోసారి ఉధృతమయ్యే ప్రమాదం ఉంది. ట్రంప్ సుంకాల బాంబు ఆర్థిక పైచేయి కోసం కాకుండా, వ్యూహాత్మకంగా చైనాకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా కావచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా సుంకాల నేపథ్యంలో చైనా ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో సుంకాల సమయంలో చైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దీంతో ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ తీవ్రం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
