10 lakh job vacancies in Canada విస్తీర్ణంలో మనది చిన్న దేశం.. కానీ జనాభాలో మాత్రం ప్రపంచంలోనే నంబర్ 2 దేశం. చైనా తర్వాత మనదే. ఇక కొన్ని దేశాలున్నాయి. భారతదేశ విస్తీర్ణంతో పోల్చితే 10 రెట్లు ఉండే రష్యాలో జనాభా మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంత కూడా కాదు. ఇక విస్తీర్ణంలో కెనడా దేశం కూడా మన భారత్ తో పోలిస్తే రెండు మూడింతలు పెద్దది. అలాంటి దేశంలోనూ మన యూపీ అంత జనాభా లేదు. అంత పెద్ద దేశంలో ఇప్పుడు జనాభా లేక మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. అక్కడి ప్రకృతి సంపద, అవకాశాలతో పరిశ్రమలు బాగా పెరగడం.. పనిచేయడానికి మనుషులు లేకపోవడంతో కెనడాలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

అందుకే కెనడా ప్రభుత్వం వీసాలు ఇస్తాం.. రండి మా దేశానికి అంటూ ఆహ్వానిస్తోంది. అయినా అమెరికా, బ్రిటన్ మోజులో పడి చాలా మంది కెనడా అంటే ఆసక్తి చూపించడం లేదు.
కెనడాలో ప్రస్తుతం 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కెనడాలో శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలనుకున్న వారికి మంచి ఉద్యోగం ఇస్తామని కెనడా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఈక్రమంలోనే మంచి ఉద్యోగం కావాలనుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
2021 మే నుంచి 3 లక్షలకు పైగా ఉద్యోగాల ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడైతే 10 లక్షలకు పైగానే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అక్కడి లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం.. 2022 మే నుంచి అక్కడ ఉద్యోగుల కొరత పెరుగుతూ వస్తోంది. అక్కడ చాలా వరకూ వయసు మీద పడినవారు పెరిగిపోవడం లేక రిటైర్ అయిపోవడం వల్ల ఈ కొరత కానవస్తోంది.
ఇప్పుడు కెనడా 2024 వరకూ 4.3 లక్షల మంది విదేశీ ఉద్యోగులను రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సీఐసీ న్యూస్ రిపోర్ట్ పేర్కొంది. ఒకవేళ ఎవరైనా కెనడాలో శాశ్వత నివాసం కోసం ఎక్స్ ప్రెస్ ఎంట్రీ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే మాత్రం ఇది చక్కని తరుణం.
మరో సర్వే ప్రకారం.. ఇదివరకటి కన్నా ఇప్పుడు కెనడాలో చాలా ఉద్యోగాలు లభించగలవు. వృత్తి, విజ్ఞానం, సాంకేతిక సేవా రంగాల్లో.. గిడ్డంగి, ఫైనాన్స్, బీమా, రిక్రియేషన్. రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి.
కెనడాలో ఈ ఏడాది లేబర్ మార్కెట్ చాలా వరకూ పడిపోయింది. కెనడాలో ఈ ఏడాది ప్రతి 10 మందికి ముగ్గురు రిటైర్ కాబోతున్నారు. దీనికి తోడు కెనడాలో 2020 నాటికి సంతానోత్పత్తి ఒక్కో మహిళకు 1.4 పిల్లల స్థాయికి పడిపోయింది. దీంతో దేశంలో జనాభా తగ్గి మానవ వనరుల కొరత ఏర్పడుతోంది.