ఇప్పటి వరకు కరోనాను అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్. కానీ.. ఈ వ్యాక్సిన్లపై ఎన్నో అనుమానాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మొదట్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి 90 శాతం మందికిపైగా జనం ఆలోచించారు. పలువురు ప్రాణాలు కోల్పోయినట్టుగా వార్తలు రావడంతో.. మరింతగా వెనకడుగేశారు. కానీ.. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అపోహలు తొలగిపోతుండడంతో.. వ్యాక్సినేషన్ కేంద్రాల వైపు వెళ్తున్నారు. అయితే.. ఇంకా ఎన్నో అనుమానాలు జనాల్లో ఉన్నాయి.
అలాంటి వాటిల్లో బలమైన సందేహం శృంగార సామర్థ్యం. వ్యాక్సిన్ తీసుకుంటే ఆ టాలెంట్ తగ్గిపోతుందని, స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుందని, పనితీరులోనూ తేడా ఉంటోందనే భయం ఒకటి బయలు దేరింది. ఇందుకు చైనా పరిశోధన కూడా కారణమైంది. కరోనా వచ్చిన వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిందని, కొందరిలో వీర్యకణాల్లో వైట్ సెల్స్ తగ్గిపోయాయని, కొందరిలో వృషణాలు కూడా ఉబ్బిపోయాయనే రిపోర్టు వెల్లడించడంతో ఆందోళన మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో తాము జరిపిన అధ్యయనం వివరాలను వెల్లడించారు అమెరికా శాస్త్రజ్ఞులు. ప్రఖ్యాత మియామీ వర్సిటీ దీనిపై కీలక పరిశోధనలు జరిపింది. మొత్తం 45 మంది పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పరిశీలించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత వారి లైంగిక సామర్థ్యాన్ని పరిశీలించినట్టు తెలిపింది.
ఈ పరిశోధనలో వ్యాక్సిన్ కారణంగా ఎలాంటి దుష్ప్రభావాలూ ఉన్నట్టు కనిపించలేదని వెల్లడించింది. వీరిలో 21 మంది ఫైజర్, 24 మంది మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు 36 మిలియన్లుగా ఉన్న వీర్యకణాల సంఖ్య.. ఆ తర్వాత స్వల్పంగా పెరిగినట్టు కూడా గుర్తించామని తెలిపింది. 36 మిలియన్ల నుంచి 44 మిలియన్లకు పెరిగాయని తెలిపింది. అందువల్ల వ్యాక్సిన్ తో లైంగిక సామర్థ్యంపై ప్రభావం పడుతుందనే భయం ఒట్టి అపోహ మాత్రమేనని తేల్చారు సైంటిస్టులు. ఈ రిపోర్టును అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించారు.