Modi- KCR: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సరికొత్త చిచ్చు వచ్చి పడింది. ఇన్నాళ్లు ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూల వాతావరణం ఉండేది. ఇరువురు సీఎంల మధ్య మంచి స్నేహ సంబంధాలు నడిచేవి. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ విషయానికి వచ్చేసరికి ఇరువురికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేసీఆర్ రాజకీయంగా కేంద్రంలో అమీతుమీకి సిద్ధమయ్యారు. బద్ధ విరోధిగా మారిపోయారు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం తన అవసరాల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతున్నారు. కేంద్ర పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నిస్తునే ఉన్నారు. రాజకీయపరమైన ఇబ్బందులు వస్తున్నా తట్టుకొని బీజేపీతో స్నేహం కొనసాగిస్తూ వస్తున్నారు. నిత్యం అటు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలుస్తూ విభజన హామీల కోసం కోరుతున్నట్టు చెబుతున్నారు. అయితే జగన్ ను ఇరుకున పెట్టాలనో.. లేకపోతే కేసీఆర్ ను జగన్ కు దూరం చేయాలనో తెలియదు కానీ.. ఎన్నడూ లేనంతగా కేంద్ర విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. విభజన హామీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కారుకు రూ.3,700 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు తక్షణం చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. రూ.3,441.78 కోట్లు అసలు,మరో రూ.335 కోట్లు ఫైన్ రూపంలో చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. నెలరోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.
ఇప్పటి వివాదం కాదిది..
అయితే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఈ నాటిది కాదు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీ కంటే తెలంగాణకు అదనంగా విద్యుత్ అవసరం ఏర్పడింది. విభజన హామీల్లో భాగంగా 57 శాతం తెలంగాణ, ఏపీకి 43 శాతం విద్యుత్ అవసరమైంది. అయితే అదనంగా విద్యుత్ వినియోగానికిగాను ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని విభజన చట్టంలో పొందుపరిచారు. అయితే మూడేళ్ల పాటు చంద్రబాబు సర్కారు తెలంగాణ ప్రభుత్వానికి అదనంగా విద్యుత్ అందించింది. కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదు. అడిగి అడిగి విసిగి వేశారిపోయిన చంద్రబాబు సర్కారు తెలంగాణకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. అటు తరువాత వచ్చిన జగన్ సర్కారు సైతం తెలంగాణ ప్రభుత్వంపై ఉదాసీనంగా వ్యవహరించిందన్న విమర్శలైతే ఉన్నాయి.
జగన్ నాడు ఉదారత..
నాడు చంద్రబాబు సర్కారు తెలంగాణ ప్రభుత్వంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వేసిన కేసును కూడా జగన్ సర్కారు ఉపసంహరించుకుంది. అయితే దీనిపై పదే పదే విపక్షాలు ప్రశ్నిస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గత ఏడాది సెప్టెంబరులో తెలంగాణ హైకోర్టులో ఏపీ సర్కారు పిల్ వేసింది. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. ఇంతలో జగన్ పలుమార్లు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర పెద్దలు ఆదేశాలిచ్చారు. తక్షణం ఏపీకి రూ.3,700 కోట్లు కట్టాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు. అయితే విభజన అంశాల్లో భాగంగా ఏపీ నుంచే తమకు రూ.5,000 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ సర్కారు పట్టుబడుతోంది. అవి రాకుండా విద్యుత్ బిల్లులు చెల్లించే చాన్సే లేదనిచెబుతోంది. ఇప్పటికే తెలంగాణకు ఆర్థిక సహాయ నిరాకరణతో కేంద్రం ఇబ్బందులు పెడుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కేంద్రం ఆదేశాలను సీఎం కేసీఆర్ పాటిస్తారా? అన్నది డౌటే.
ఇద్దర్నీ దూరం చేసేందుకే?
అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఎత్తుగడతో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకున్న ఏ మార్గాన్ని విడిచిపెట్టడం లేదు. అయితే ఇద్దరు సీఎంలు ఎంతో సఖ్యతగా ఉన్నారు. రాజకీయంగా సహకరించుకున్న సందర్భాలున్నాయి. కేసీఆర్ కోసం తెలంగాణలో వైసీపీ జెండాను జగన్ పీకేశారు. అందుకు అనుగుణంగా 2019 ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ నుంచి మంచి సహకారమే లభించింది. అయితే తెలంగాణలో ఉన్న ఏపీ సెటిలర్స్ లో కూడా వైసీపీ అభిమానులు ఉన్నారు. వీరు ఇప్పటివరకూ కేసీఆర్ కు సపోర్టు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నుంచి జగన్ ను వేరుచేస్తే వారంతా టీఆర్ఎస్ కు దూరమవుతారని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే జగన్ అడిగిన ఇతర వాటి కంటే తెలంగాణ ప్రభుత్వంతో ముడిపడిన అంశాలకే ప్రాధాన్యత ఇస్తోంది. అయితే రాజకీయ చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Will kcr listen to modis orders for ap doubt
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com