‘ప్రణయ్ దళితుడు కావడంతో నేను అతడిని మర్చిపోవాలని చెప్పారు. వారిని కాదని పెళ్లి చేసుకున్నందుకు నా తండ్రే నా భర్తను చంపించారు’ అని సెప్టెంబర్ 2018లో అమృత చెప్పిన మాటలివి. .
‘ఎవరి మధ్య పెరిగానో వారే ఇంత అన్యాయానికి పాల్పడ్డారు. మాకంటే తక్కువ ఆస్తి ఉన్న వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం మా కుటుంబానికి నచ్చలేదు’ 23 ఏళ్ల అవంతి ఇటీవల చెప్పింది.
……………………………………………………………..
అది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. దళిత సామాజిక వర్గానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్‌ది మధ్య తరగతి కుటుంబం.. వైశ్య సామాజిక వర్గం కోటీశ్వరుడి కూతురైన అమృతను ప్రేమించాడు. ఇరువురూ ఇష్టపడ్డారు. పెద్దలు ఎలాగూ ఒప్పుకోరని 2018 జనవరి 31న వివాహం చేసుకున్నారు. దీంతో అమృత తండ్రి మారుతీరావుకు అది నచ్చలేదు. రియల్టర్ కూడా కావడంతో సమాజంలో తన పరువు పోతుందని కోపం పెంచుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా చేయడంతో తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా ఆయనలోని రాక్షసత్వాన్ని బయటికి తీశాడు. అప్పటికే అమృత గర్భిణి కూడా. అది సెప్టెంబర్ 14, 2018.. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తుండగా గుర్తుతెలియని దుండగుడు ఒక్కసారిగా ప్రణయ్ మీద దాడి చేశాడు. దారుణంగా నరికి చంపాడు. సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడే మారుతీరావు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పట్టపగలే జరిగిన ఈ హత్యతో మిర్యాలగూడ పట్టణం ఉలిక్కిపడింది
Also Read: కరోనా నుంచి కోలుకొనే పరిస్థితి లేదా?
……………………………………………………………
చందానగర్‌లోని తారానగర్‌కు అవంతి రెడ్డి బీటెక్ చేస్తుండగా, యోగ హేమంత్ కుమార్ డిగ్రీ పూర్తి చేసి, ఇంటీరియర్ డిజైనర్‌గా బిజినెస్ నడిపిస్తున్నాడు. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు ఇష్టలేకపోవడంతో ఈ ఏడాది జూన్ 11న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే చందానగర్ పోలీసులను ఆశ్రయించగా.. ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే.. కూతురి చర్యను జీర్ణించుకోలేకపోయిన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి హేమంత్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి తర్వాత హేమంత్, అవంతి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. సడెన్‌గా సెప్టెంబర్ 24న అవంతి ఉంటున్న ఇంటికి కుటుంబీకులు వచ్చి.. ‘మీ నాన్న మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వెంటతీసుకొని రమ్మన్నారు..’ అని నమ్మబలికారు. కారులో బయల్దేరారు. అయితే.. చందానగర్ వెళ్లాల్సిన కారు రూటు మారడంతో హేమంత్, అవంతిలకు అనుమానం వచ్చింది. వెంటనే కారులో నుంచి దూకే ప్రయత్నం చేశారు. అవంతి తప్పించుకోగలిగినా.. హేమంత్ మాత్రం దొరికిపోయాడు. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డితోపాటు మరికొందరు హేమంత్‌ను మరో కారులో తీసుకెళ్లారు. తప్పించుకున్న అవంతి వెంటనే 100కు డయల్ చేసి పోలీసుల సాయం కోరింది. అదే సమయంలో అత్తమామలకూ సమాచారం అందించింది. హేమంత్‌ను కారులో వెంటబెట్టుకుని జహీరాబాద్ వైపునకు తీసుకెళ్లిన కిరాయి హంతకులు.. మధ్యలో వైన్ షాపు దగ్గర ఆగి, మద్యం కొన్నారు. పక్కనే ఉన్న జనరల్ స్టోర్‌లో తాడు కూడా కొనుగోలు చేశారు. హేమంత్‌ను కారులోనే కట్టేసి చిత్రహింసలు పెట్టారు. చివరికి ఊపిరి ఆడకుండా చేసి హత్యకు పాల్పడ్డారు.
……………………………………………………………….
పైన జరిగిన ఈ రెండు హత్యలు కూడా పరువు హత్యలే. పరువు కోసం ఎంతటి కిరాతకానికైనా తెగించాల్సిందేనా..? కులం, మతం, వంశం, గౌరవం, ప్రతిష్ట.. వీటి కోసం మనుషుల ప్రాణాలు తీయాల్సిందేనా..? ప్రాణం తీసినంత మాత్రాన పోయిందనుకున్న పరువు తిరిగి వస్తుందా..? మొన్న నరేశ్.. నిన్న ప్రణయ్.. తాజాగా హేమంత్..ఈ ముగ్గురి ప్రాణాలు తీసినందుకు..పరువు తిరిగి వచ్చిందా..? ఈ ముగ్గురి ప్రాణాలు తీయించినోళ్లు హ్యాపీగా ఉన్నారా..? కులం ముందు ప్రేమ తల వంచాల్సిందేనా..? ప్రాణం కంటే పరువే ముఖ్యమా..? ప్రేమిస్తే..చంపేస్తారా..? ఎన్నాళ్లీ పరువు హత్యలు..? ఎందుకీ హత్యలు..? ఈ హత్యలకు అంతమెప్పుడు..?
పరువు.. ఇప్పుడు సమాజానికి పట్టిన ఓ చీడ పురుగు. కులమతాలకు అతీతంగా రాకెట్ యుగంలోకి దూసుకెళ్తున్న యువతను కులం అనే అడ్డుగోడలు పరువు హత్యలు చేయిస్తున్నాయి. ఇందులో ఆర్థికపరమైన పరువు ఒకటైతే.. మరోటి కులం కార్డు. వేర్వేరు కులాల అబ్బాయీ, అమ్మాయీ ప్రేమించుకోవడం, అటువైపో, ఇటువైపే ఎవరో ఒకరి కుటుంబానికి నచ్చకపోవడం, ఆపై అయినవాళ్లనే చంపేయడం.. ‘కని పెంచి మిమ్మల్ని ప్రయోజకులుగా చేసిన మమ్మల్నే తిరస్కరిస్తారా’ అనే తట్టుకోలేని భావనతో తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు. కానీ వయసొచ్చిన పిల్లల ఆలోచనల్లో మార్పులు వస్తాయని ఆలోచించట్లేదు. ‘మా మాటే వినాలి, మేం చెప్పినట్లే నడుచుకోవాలనే’ ధోరణి పంతాలకు పోయి ప్రాణాలను హరిస్తోంది. తమకు ఇష్టం లేని వివాహాలు చేసుకున్నారంటూ..ఓ చోట కూతుర్ని ప్రేమించినోడిని..మరోచోట కన్న కూతుర్ని సైతం.. హతమార్చడానికి తల్లిదండ్రులు వెనుకాడకపోవడం అత్యంత దారుణం. ఏం సాధించడానికి ఈ పరువు హత్యలు..? పరువు కోసం పాకులాడి, ప్రాణాలు తీసి, జీవితం జైలుపాలు చేసుకుని.. అయినవాళ్లు సాధించేదేంటి..?
‘‘పరువుకు పోయి హేమంత్‌ను హత్య చేయించిన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి అంతా ముగిశాక పశ్చాత్తాపానికి గురయ్యాడు. ‘అవంతి ప్రేమ విషయం తెలిసి ఇంట్లో కట్టడి చేశాం. కానీ అవంతి తెలియకుండా వెళ్లిపోయి హేమంత్‌ను పెళ్లి చేసుకుంది. పోలీసుల ద్వారా అవంతి పెళ్లి విషయం మాకు తెలిసింది. 15 ఏళ్లుగా బామ్మర్ది యుగేందర్‌తో మాటలు లేవు. హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చింది. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే కుటుంబం మాది. మేము ఉంటున్న కాలనీలో మా కుటుంబానిదే ఆధిపత్యం. అవంతి ప్రేమ విషయంతో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చింది. పరువు తీశాడన్న కారణంతోనే హేమంత్‌ను హత్య చేయాల్సి వచ్చింది’ అంటూ రోదించ సాగాడు. ’’
Also Read: రైతులకు దన్నుగా జగన్ సర్కార్.. 16 నుంచి పంటల కొనుగోళ్లు..?
అవంతి చేసిన పనితో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చిందని లక్ష్మారెడ్డి చెబుతున్నా.. మరి హేమంత్‌ను చంపివేయిస్తే తన పరువు తిరిగి వచ్చిందా..? ఈ హత్యతో ఇప్పుడు ఆ కాలనీలో తల ఎత్తుకుని తిరుగుతున్నాడా..? తమ కాలనీలో తమ కుటుంబానిదే ఆధిపత్యమని చెప్పుకునే లక్ష్మారెడ్డి ఇకపై ఆ ఆధిపత్యాన్ని ఎలా కొనసాగిస్తాడు..?
హేమంత్ మర్డర్‌లో లక్ష్మారెడ్డి పగతో రగిలిపోతే.. అతడి ప్రాణాలు కాపాడడంలో పోలీసులూ విఫలమయ్యారు. తమను కిడ్నాప్ చేస్తున్నారంటూ పసిగట్టిన హేమంత్, అవంతి.. మార్గమధ్యలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎలాగోలా అవంతి భయటపడి పోలీసులకు కాల్ చేసింది. వాళ్లు అక్కడికి రాగానే, మొదట గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయమన్నారు. తర్వాత దర్యాప్తు వేగవంతం చేశారు. వాళ్లు అక్కడకి వచ్చినప్పుడే ఔటర్ రింగ్ రోడ్ మీదున్న చెక్ పోస్టులకు సమాచారం అందించుంటే హేమంత్‌ను తీసుకెళ్తున్న కారును ముందే పట్టుకోడానికి అవకాశం ఉండేదేమో. పోలీసులు చేయగలిగింది చేశారు’ కానీ.. ఫలితం కనిపించలేదు. అయితే జూన్‌లోనే తన సొంత కుటుంబం నుంచి తమకు ప్రమాదం ఉందని అవంతి ఫిర్యాదు చేసింది. తండ్రి లక్ష్మా రెడ్డి, మిగతా బంధువుల నుంచి ప్రమాదం ఉందని. తమకు రక్షణ కల్పించాలని కోరింది. అయినా, తన ఫిర్యాదును పట్టించుకోలేదని అవంతి పేర్కొంది. హత్యకు గురైన హేమంత్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన యువకుడు. అవంతిది రెడ్డి సామాజికవర్గం.
ఈ రెండు హత్యలు చేసేందుకు అమృత, అవంతిల తండ్రులు వాడుకున్నది సుపారీ గ్యాంగ్లనే. ప్రణయ్‌ను చంపించేందుకు మారుతీరావు సూపరీ గ్యాంగ్‌తో ఏకంగా కోటి రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ కింద వారు రూ.50 లక్షలు అడిగితే మారుతీరావు 15 లక్షల ఇస్తామన్నాడు. ఆ కారులోనే మిర్యాలగూడ వెళ్లి బారీకి, అస్గర్లకి పిల్లవాడి (ప్రణయ్) ఇల్లు చూపించారు. జూలై 9, 10 తేదీల్లో కరీం రూ. 15 లక్షలు డబ్బు తీసుకుని హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర బారీ, అస్గర్లను కలిశాడు. కారులోనే వారికి ఆ డబ్బులు అందించాడు. అస్గర్, బారీలు మారుతీరావుతో మాట్లాడారు. డబ్బులు అందాయని చెప్పారు. ఆ డబ్బుల్లో బారీ రూ. 8 లక్షలు తీసుకున్నాడు. అస్గర్ ఆరు లక్షలు తీసుకోగా.. కరీం లక్ష రూపాయలు తీసుకున్నాడు. అడ్వాన్స్ డబ్బు తీసుకున్న తర్వాత హత్యకు ప్రణాళిక రచించటం మొదలుపెట్టారు. ఒక పాత స్కూటీ కొన్నారు. దానికి నకిలీ నంబర్ పెట్టారు. బారీ బోగస్ పేర్ల మీద మూడు సిమ్ కార్డులు కొన్నాడు. అస్గర్ మూడు ఫోన్లు కొన్నాడు. వాటితో హత్య ప్రణాళిక గురించి మాట్లాడుకునేవారు. ఈ లోపల అమృత గర్భిణి అని తెలిసి, ఆమెకు గర్భస్రావం చేయించటానికి మారుతీరావు ప్రయత్నాలు చేశాడు. తాను ప్రణయ్‌ను హత్య చేయించే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి.. తన కూతురుకు బిడ్డ పుడితే తర్వాత ఇబ్బంది అవుతుందని భావించాడు. అమృతకు గర్భస్రావం చేయాలని డాక్టర్ జ్యోతి మీద చాలా ఒత్తిడి తెచ్చారు. కానీ ఆ డాక్టర్ తిరస్కరించారు. చివరకు సూపరీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ని మట్టుబెట్టించాడు.
ఇక హేమంత్‌ను చంపించేందుకు లక్ష్మారెడ్డి ఆ పనిని యుగంధర్ రెడ్డికి అప్పజెప్పాడు. యుగంధర్ రెడ్డి ఓ ముఠా సభ్యుడిని సంప్రదించాడు. రూ.10 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లెక్కన చూస్తుంటే.. మహా నగరానికి ఏ పాటి ఘన చరిత్ర ఉందో.. అంతటి నేర చరిత్రను కూడా సంతరించుకుంటోందని చెప్పాలి. ఎన్ని గ్యాంగులు పట్టుబడుతున్నా.. ఎంతమంది గ్యాంగ్ లీడర్లను మట్టుబెడుతున్నా.. కొత్త వారు పుట్టుకొస్తూనే ఉన్నారు. సుపారీలు తీసుకుంటూ మర్డర్లు చేస్తూనే ఉన్నారు.
Also Read: మందుబాబులకు జగన్ సర్కార్ భారీ షాక్..?
ప్రస్తుత ప్రపంచంలో కులమతాలను పక్కనబెట్టి మనం అందరం మనుషులం అన్నట్లుగా బతికితేనే ఇలాంటి నేరాలు ఘోరాలు తగ్గుతాయి. ఆవేశానికి పోయి అయినవారికి దూరం కావడం తప్ప సాధించింది ఏమీ లేదు. పైన రెండు కేసులు చూస్తేనే ఎవరికైనా అర్థమవుతోంది. ప్రణయ్‌ని చంపించిన మారుతీరావు అకారణంగా చనిపోయారు. ఇప్పుడు లక్ష్మారెడ్డికి కూడా అదే గతి పట్టాలని అతని కూతురు అవంతి కోరుకుంటోంది. ఈ పరువు హత్యలతో బంధాలు, బంధుత్వాలకు దూరం కావడమే కాకుండా కాలనీల్లోనూ విలువలు కోల్పోయి ప్రమాదాలే ఉన్నాయి. ఇప్పటికైనా మారుదాం. పిల్లల మనసులకు గౌరవమిద్దాం.
-శ్రీనివాస్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: What did dignity achieve by going for murders
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com