JanaSena Party: ‘ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని ఇప్పటికే స్పష్టం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్… తాజాగా పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మాకు మూడు ఆప్షన్లు ఉన్నాయని తేల్చారు. 1. జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం. 2. జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వం స్థాపించడం. 3. జనసేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం.ఈ మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిద్దామని కలిసి పనిచేద్దామనుకుంటున్న టీడీపీ, బీజేపీలకు సూచించారు. మంచి కోసం తగ్గాలనేది బైబిల్ సూక్తిని పవన్ గుర్తుచేశారు. పొత్తు నేపథ్యంలో… తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందనేది ఎవరి ఆశ అయినా కావొచ్చునని కూడా పరోక్షంగా వైసీపీపై పవన్ వ్యంగ్యోక్తులు సంధించారు. తనకు మాత్రం అలాంటి ఆశ లేదన్నారు. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే విషయం నాకు తెలియదు. దీని గురించి నాతో మాట్లాడలేదు అని కూడా వ్యాఖ్యానించారు. ఒంటరిగానే పోటీచేసి మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని చెబుతూ…ఒంటరిగా పోటీ చేసే మీకు… ప్రత్యర్థి పార్టీలు ఎవరెవరు కలిస్తే మీకెందుకు? అని పవన్ ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ తొలి సారి బయట పడ్డారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు పదే పదే కలిసి రావాలని పవన్ కల్యాణ్‌కు పిలుపునిచ్చారు. కానీ తాను గెలవకపోయినా పర్వాలేదు… టీడీపీని ఓడిస్తానని చాలెంజ్ చేసి .. కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. కానీ చివరికి ఆయన కూడా గెలవలేదు. ఇప్పుడు టీడీపీతో పొత్తు విషయంలో ఆయనే కాస్త తగ్గి మాట్లాడుతున్నారు.మహానాడుకు ముందు టీడీపీ.. చంద్రబాబు జనసేన విషయంలో వన్ సైడ్ లవ్ అన్నట్లుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం వార్ వన్ సైడ్ అంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ భిన్నంగా స్పందించారు. చంద్రబాబు మొన్నటిదాకా వన్ సైడ్ లవ్ అన్నారు .. ఈ మధ్య వార్ వన్ సైడ్ అన్నారని.. ముందు చంద్రబాబుకు ఓ క్లారిటీ వచ్చాక పొత్తులపై మాట్లాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో పొత్తులపై చర్చలు జరుగుతున్న సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. చంద్రబాబు సిద్ధం అంటే.. పవన్ కల్యాణ్ కూడా రెడీ అన్నట్లుగా మాట్లాడటంతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: CM Jagan Decisions: జగన్ నిర్ణయాలు కొంపముంచుతాయి? ఆ తప్పుతోనే అథ:పాతాళానికి?
పవన్ చెప్పిన మొదటి ఆప్షన్ జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం. గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది. రెండు పార్టీలు కలిసే అడుగులేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని సంకేతాలు ఇచ్చాయి. కానీ గ్రౌండ్ లెవల్లో మాత్రం రెండు పార్టీలకు బలం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఒక వైపు, ప్రధాన విపక్షం తెలుగుదేశం మరోవైపు పోటీచేసి అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం ఖాయం. అది పరోక్షంగా అధికార వైసీపీకి లాభిస్తుంది. అందుకే జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయాలని వైసీపీ కోరుకుంటుంది. అప్పుడే ఈజీగా అధికారంలోకి రావాలని భావిస్తోంది. బీజేపీ, జనసేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తెరపైకి తేవడం వెనుక వైసీపీ ఉందన్నది పవన్ అనుమానం. అందుకే ఆయన జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. తనకు అంత ఆశలేదని చెప్పడం ద్వారా వైసీపీ ఆశలను పవన్ నీరుగార్చారు.
రెండో ఆప్షన్ జనసేన, బీజేపీ, టీడీపీ సంయక్తంగా కలిసిపోటీ చేయడం. ప్రస్తుతానికి జనసేన, బీజేపీ కలిసి నడుస్తున్నా.. టీడీపీ మాత్రం ఒంటరిగా వెళుతోంది. ఈ రెండు పార్టీలతో కలవాలని టీడీపీ భావిస్తోంది. గడిచిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరం కావడం వల్లే ప్రతిపక్షంలోకి వచ్చామని నమ్ముతోంది. అందుకే బీజేపీ కేంద్ర నాయకత్వంతో సఖ్యతకు ప్రయత్నిస్తోంది. కానీ టీడీపీతో కలవడానికి బీజేపీ ముందుకు రావడం లేదు. గత అనుభవాల ద్రుష్ట్యా చంద్రబాబుతో కలిసి నడిచేందుకు రాష్ట్ర నాయకత్వంలో ఒక వర్గం మొగ్గు చూపడం లేదు. కేంద్ర నాయకత్వం మనసులో ఏముందో తెలియడం లేదు. కానీ వచ్చే ఎన్నికల నాటికి అద్భుతం జరుగుతుందన్న పవన్ మాటలు ఇప్పుడు గుర్తు చేయాల్సి వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని కలుపుకొని పోవడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా భారీ విజయం నమోదు చేయవచ్చునన్నది పవన్ భావన. ఎన్నికలకు వెళ్లాలంటే కేంద్ర పెద్దల సాయం కావాలి. కానీ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రం. విభజన హామీలు అమలు చేయకపోవడంతో ఆ పార్టీపై రాష్ట్ర ప్రజలు అంతగా నమ్మకం లేరు. అందుకే పవన్ టీడీపీతో పొత్తు ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు కేంద్ర పెద్దలను ఒప్పించే పనిలో ఉన్నారు.
మూడో ఆప్షన్.. జనసేన ఒంటరిగా పోటీచేయడం. గత ఎన్నికలతో పోల్చుకుంటే జనసేన బలం పెరిగింది. కానీ ఇది అధికార పార్టీకి ఎదుర్కొనే స్థాయిలో ఉందంటే మాత్రం కాదు. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి జనసేన పోటీచేసింది. టీడీపీ, బీజేపీ ఒంటరిగా బరిలో దిగాయి. దీంతో ఓట్లు చీలిపోయి వైసీపీకి భారీ లబ్ధి చేకూరింది. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండడం, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వ్యతిరేక ఓటు ఎవరికి మల్లుతుందో తెలియని పరిస్థితి. ఇటువంటి తరుణంలో జనసేన ఒంటరిగా బరిలో దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు గుంపగుత్తిగా జనసేనకు పడుతుందన్న నమ్మకం లేదు. పైగా ఆ పార్టీకి సంస్థాగత బలం లేదు. కేవలం పవన్ మేనియాతో నెట్టుకొస్తోంది. మూడో ఆప్షన్ పై జనసైనికుల్లో కూడా ఏమంత నమ్మకం లేదు. అందుకే ఒకటి, మూడు ఆప్షన్ల కంటే.. రెండో ఆప్షన్ నే ఎక్కువమంది సూచిస్తున్నారు. పవన్ అటు టీడీపీ, ఇటు బీజేపీతో కలిసి నడిస్తేనే శ్రేయస్కరమని భావిస్తున్నారు. ఎన్నికల నాటికి అటు కేంద్ర పెద్దలను, ఇటు చంద్రబాబును ఒకే వేదికపైకి తీసుకురాగలరని నమ్ముతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: What are the three options for janasena party to come to power
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com