Viral Video : మహిళల మీద వేధింపులు నేటి సమాజంలో ఒక తీవ్రమైన సమస్యగా మారిపోయింది. ఇది కేవలం శారీరక హింసకు మాత్రమే పరిమితం కాకుండా, మానసిక, లైంగిక, ఆర్థిక వేధింపుల రూపాల్లోనూ మహిళలను బాధిస్తోంది. ఇంటి నుంచి ఆఫీసు వరకు, వీధుల్లోనూ, ఆన్‌లైన్‌లోనూ మహిళలు ఏదో ఒక రూపంలో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ వేధింపులు వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాన్సీ సురవాసే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక షాకింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో మాన్సీ తన అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లోని మెట్లపై నిలబడి రీల్ షూట్ చేస్తుండగా ఒక గుర్తు తెలియని యువకుడు వచ్చి ఆమెను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడు. అయితే, మాన్సీ వెంటనే అతడిని పట్టుకుని గట్టిగా బుద్ధి చెప్పింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఇన్ఫ్లుయెన్సర్ మాన్సీ ఎరుపు రంగు బ్లౌజ్, తెలుపు రంగు ఎంబ్రాయిడరీ చేసిన స్కర్ట్‌లో మెట్లపై నిలబడి కెమెరాకు ఫోజులిస్తూ కనిపించింది. కొద్దిసేపటి తర్వాత గులాబీ, తెలుపు రంగు చారల టీ-షర్ట్‌లో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. ఆ యువకుడు రాగానే మాన్సీ పక్కకు జరిగి అతనికి దారి ఇచ్చింది. కానీ ఆ యువకుడు మాన్సీ ఒంటరిగా ఉందని భావించి ఆమెను అసభ్యంగా తాకి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే తను చేసిన పని మొత్తం కెమెరాలో రికార్డ్ అయిందని అతను గ్రహించలేదు.
మాన్సీ వెంటనే ఆ యువకుడిని నిలదీసింది. కాసేపు వాగ్వాదం తర్వాత ఆ యువకుడి చెంప చెల్లుమనిపించి, “నువ్వు ఏమి చేశావో అది కెమెరాలో రికార్డ్ అయింది” అని గట్టిగా చెప్పింది. వీడియోలో కెమెరాను చూడగానే ఆ యువకుడు క్షమాపణలు చెబుతూ అక్కడి నుండి జారుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేసిన మాన్సీ, తాను ఆ అబ్బాయి ఇంటికి సాక్ష్యాలతో వెళ్ళినప్పుడు, అతని కుటుంబ సభ్యులు అతనికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారని తెలిపింది.
ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ “మీరు అతని ముఖాన్ని బ్లర్ చేయకూడదు” అని రాశాడు. మరొక యూజర్ “ఎంత గట్టిగా చెంపదెబ్బ కొట్టిందో. చూస్తే మనసుకు ప్రశాంతంగా ఉంది” అని అన్నాడు. ఇంకో యూజర్ “మరో రెండు కొట్టాల్సింది” అని కామెంట్ చేశాడు.