కథలన్నీ కంచికి చేరకపోవచ్చు. కానీ కొన్ని కథలు మాత్రం గుండెను తాగుతాయి. హృదయంలో ఉన్న తడిని తట్టి లేపుతాయి. ఈ కథ కూడా అటువంటిదే. కాకపోతే ఇందులో సినిమాకు మించిన ట్విస్టులు ఉన్నాయి. సెంటిమెంట్ ను రగిలించే సన్నివేశాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక మగవాడి జీవితం చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఎలా ప్రభావితం అవుతుంది? అతడిని ఎలా మార్చుతుంది? చివరికి అతడు ఎలా మారిపోతాడు? అనే ప్రశ్నలకు ఈ కథనం నూటికి నూరు పాళ్లు కాదు కోటి పాలు తీరుగా సమాధానం చెబుతుంది.
అతని పేరు కన్నయ్య నారాయణ్. మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతం. కన్నయ్య అంతవరకు చదువుకున్నాడు. వ్యవసాయ కుటుంబం.. అతడు కూడా ఒక సంస్థలో పనిచేసేవాడు. పెళ్లిడు రాగానే కుటుంబ సభ్యులు అతడిని ఓ ఇంటివాడిని చేశారు. మొదట్లో అతడి సంసారం బాగానే ఉండేది. క్రమంగా భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. మొదట్లో పెద్ద మనుషులు వచ్చి పంచాయతీలు చేశారు. దీంతో కొద్దిరోజుల పాటు కన్నయ్య దంపతులు బాగానే ఉండేవారు. ఆ తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యేవి. ఇలా జరుగుతూ ఉండడంతో కన్నయ్యకు కోపం వచ్చింది. అతని భార్యకు కూడా ఈ బంధం వద్దనిపించింది. దీంతో కన్నయ్య భార్య కోర్టు మెట్లు ఎక్కింది. కన్నయ్య ఇలా కేసుల వల్ల తరచూ పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కుతుండడంతో.. ఉన్న ఆ ఉద్యోగం కూడా పోయింది. ఈ క్రమంలోనే కేసు విచారణకు వచ్చింది. కేసును విచారించిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు భరణంగా కన్నయ్య తన భార్యకు ప్రతినెల 6000 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.. తనకు చెల్లించే స్తోమత లేదని చెప్పినప్పటికీ న్యాయస్థానం ఊరుకోలేదు.
అటు ఉద్యోగం లేదు. చెప్పుకునే స్థాయిలో ఆస్తులు లేవు. భార్య విడాకులు తీసుకుంది. భరణంగా ప్రతినెల 6000 చెల్లించాలి. ఇన్ని ఇబ్బందుల మధ్య కన్నయ్య దొంగ లాగా మారిపోయాడు. దొంగతనాలు చేస్తూ ప్రతినెల తన భార్యకు 6000 చెల్లిస్తున్నాడు. అయితే ఇటీవల దొంగతనం చేస్తూ కన్నయ్య పోలీసులకు దొరికిపోయాడు. దీంతో అతడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల విచారణలో కన్నయ్య ఈ వివరాలు చెప్పడంతో వారు కూడా అతని పరిస్థితిపై జాలిపడ్డారు. నేటి కాలంలో జీవిత భాగస్వాములను అంతం చేయడం.. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం.. భరణాల కోసం తీవ్రంగా ఇబ్బంది పెట్టడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలోనే కన్నయ్య ఉదంతం సరికొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది.. ఇటీవల భార్యలు పెడుతున్న వేధింపులకు తట్టుకోలేక చాలామంది భర్తలు బలవంతంగా తనవులు చాలించారు. ఆమధ్య బెంగళూరులోని ఓ ఐటీ ఉద్యోగి కన్నుమూయడం సంచలనం కలిగించింది. ఇటువంటి ఘటనలు జరుగుతున్న వేళ భరణాలకు సంబంధించి సరికొత్త చర్చ సాగుతోంది.