Rubber: నిత్య జీవితంలో రబ్బర్ లేకుండా మన పనులు కావు. ఆడవాళ్లు జడకు పెట్టుకునే రబ్బర్ల నుంచి.. తొడుక్కునే చెప్పుల వరకు.. ప్రతి దాంట్లో రబ్బర్ వాడతారు. ప్లాస్టిక్ అనేది పెట్రోలియం వినియోగించి చేస్తారు. కానీ రబ్బర్ అలా కాదు.. రబ్బర్ అనేది ప్రకృతి ప్రసాదించిన ఒక వరం. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం..
రబ్బరు అనేది చెట్ల నుంచి వస్తుంది.. కాకపోతే అది పాల రూపంలో ఉంటుంది. మనదేశంలో కేరళ రాష్ట్రంలో రబ్బరు చెట్లు ఉంటాయి. ముఖ్యంగా ఇవి తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని నీలగిరి కొండల్లో పెరుగుతాయి. ఈ చెట్లు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పెరగలేవు. పైగా కేరళ రాష్ట్రంలో ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ ఇవి విస్తారంగా పెరుగుతూ ఉంటాయి.. రబ్బర్ చెట్లనుంచి పాల లాంటి ద్రవం కారుతుంది. ఆ ద్రవాన్ని ఇక్కడి రైతులు ప్రత్యేక పాత్రలు పెట్టి సేకరిస్తుంటారు. అలా సేకరించిన ద్రవాన్ని వివిధ కార్పొరేట్ కంపెనీలకు విక్రయిస్తుంటారు.. ఆ పాల లాంటి ద్రవాన్ని లాటిక్స్ అని పిలుస్తుంటారు. కేరళలోని రైతుల నుంచి లాటిక్స్ ద్రవాన్ని పెద్ద పెద్ద కంపెనీలు కొనుగోలు చేస్తుంటాయి. వివిధ దశల్లో లాటిక్స్ ను శుద్ధి చేసిన తర్వాత రబ్బరు గా మార్చుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం రబ్బర్ ను వినియోగిస్తారు. ప్రస్తుతం మనం దైనందిన జీవితంలో వాడుతున్న రబ్బర్ అలా చెట్ల నుంచి వచ్చిందే.
లాటిక్స్ ను రబ్బర్ తయారీకి వినియోగించగా మిగిలిన దానిని టర్పెంట్ ఆయిల్ గా ఉపయోగిస్తారు. ఇది దెబ్బలకు లేపనంగా ఉపయోగపడుతుంది. కాళ్లు, కీళ్లు, చేతులకు అకస్మాత్తుగా గాయాలైనప్పుడు, లేదా అవి పట్టేసినప్పుడు.. టర్పెంట్ ఆయిల్ తో మర్దన చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఇక ఈ రబ్బర్ చెట్ల ద్వారా కేరళలోని మెజారిటీ రైతులు ఉపాధి పొందుతున్నారు. రబ్బరు చెట్ల ద్వారా లాటిక్స్ తయారు చేసే విధానానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటికే 13 మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. “ఈ వీడియో ద్వారా మాకు చాలా సమాచారం తెలిసింది. ఇప్పటివరకు రబ్బరు అంటే కృత్రిమ పదార్థం అనుకున్నాం. కానీ అది లాటిక్స్ ద్వారా తయారవుతుందని ఇప్పుడే తెలుసుకున్నామని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దేవ భూమిగా పేరుపొందిన కేరళ రాష్ట్రంలో కేవలం రబ్బర్ చెట్లు మాత్రమే కాకుండా కొబ్బరి, కాఫీ, తేయాకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీర, మిరియాల అటువంటి సుగంధ ద్రవ్య పంటలు కూడా పండుతాయి. అక్కడి సహజ వాతావరణం వల్లే ఈ పంటలు పండుతున్నాయని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.