https://oktelugu.com/

Social Media Reels : రీల్స్‌ చేసే వారికి ఖాకీల షాక్‌ .. వెతికి మరీ కేసులు పెడుతున్న పోలీసులు!

సోల్‌ మీడియా ప్రస్తుత సమాజంలో కీలకంగా మారింది. ఏ విషయమైన క్షణాల్లో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. దీంతో సోషల్‌ మీడియా వినియోగదారులు పెరుగుతున్నరు. ఇక చాలా మంది తమ టాలెంట్‌ను సోషల్‌ మీడియా వేదికగా బయటపెడుతున్నారు. కొందరు రాత్రికి రాత్రే స్టార్‌ అవుతున్నారు. కొందరు ఇబ్బంది కర రీల్స్‌లో చికాకుపెడుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : August 26, 2024 5:28 pm
Social media reels

Social media reels

Follow us on

Social Media Reels : ప్రస్తుతం సమాజంలో మీడియా కన్నా.. సోషల్‌ మీడియా రోల్‌ ఎక్కువ కనిపిస్తుంది. పవర్‌ఫుల్‌గా కూడా మారింది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీడియాలో వచ్చే వార్తలు ద్వారా తెలుసుకునేవారు ప్రజలు. అయితే ఇప్పుడు టీవీ ఛానల్స్, మీడియా సంస్థలు ఇచ్చే వార్తల కంటే సోషల్‌ మీడియాలో ముందుగానే ఏ సమాచారమైనా హల్చల్‌ చేస్తున్నాయి. దీంతో యువత సోషల్‌ మీడియాను తమ టాలెంట్‌ బయట పెట్టుకోవడానికి వినియోగిస్తోంది. కొందరు సోషల్‌ మీడియా వేదికగా పాలకుల వైఫల్యాలను ఎండగడుతున్నారు. కొందరు తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇలా కారణం ఏదైనా సోషల్‌ మీడియానే ఇప్పుడు అంతటా కీలకంగా మారింది. ఇక సోషల్‌ మీడియాను ఓ రేంజ్‌లో వాడేస్తున్న చాలా మంది రీల్స్‌తో చర్చ చేస్తున్నారు. డాన్సులు, డైలాగులు, పాటలు ఎవరికి తోచింది వారు చేసి ప్రజలను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు.ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.తాము చేసిన రీల్స్‌ కు లైక్స్, ఫాలోవర్స్‌ కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఎవరూ చేయంది చేయాలన్న తాపత్రయంతో వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు.

రోడ్లపై పిచ్చి వేషాలు..
చాలా మంది రీల్స్‌ కోసం రోడ్లు, రద్దీగా ఉండే రైళ్లు, బస్సులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మెట్రో రైళ్లలో డాన్సులు చేస్తున్నారు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి లైక్స్, షేర్, వ్యూస్‌ కోసం తాపత్రయపడుతున్నారు. అయితే రీల్స్‌ మోజులో పడి రోడ్డు, బస్సులు, రైళ్లలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందిని పట్టించుకోవడం లేదు. కొందరు కావాలనే జనంలో రీల్స్‌ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆ వీడియోలేను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి నెటిజన్లకూ చికాకు తెప్పిస్తున్నారు. పోలీసులు ఇలాంటివారిపై చర్య తీసుకోవాలన్న డిమాండ్‌ రోజు రోజుకూ పెరుగుతోంది.

షాక్‌ ఇస్తున్న ఖాకీలు..
రోడ్లపై, రైళ్లలో, బస్సుల్లో, రద్దీ ప్రాంతాల్లో రీల్స్‌ చేసేవారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. వెతికి మరీ పట్టుకుని కేసులు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో రోడ్డుపైన హర్ష అనే ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కరెన్సీ నోట్లను వెదజల్లుతూ రీల్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక రోడ్డుపై కరెన్సీ నోట్లను వెదజల్లిన సదరు యువకుడిపై మూడు పోలీస్‌ స్టేషన్‌ లలో పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. నడిరోడ్డుపై ఆ యువకుడు చేసిన పనితో అక్కడ ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. నడిరోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగేలా రీల్స్‌ చేసే వారి పైన పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు.

వెతికి మరీ కేసులు..
ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించేలా బైక్‌ల పైన స్టంట్‌లు చేసే వారి పైన, ప్రజలకు అభ్యంతరకరమైన వీడియోలు చేసే వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేయాలని రంగంలోకి దిగారు. అభ్యంతరకరంగా ఉండే వీడియోలు ఏం చేసినా బాధ్యులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఇకనుంచి రీల్స్‌ చేసేవారు ఏది పడితే అది చేయడానికి వీల్లేదు అన్నది తాజా పోలీస్‌ చర్యలతో అర్థమవుతుంది.