Arjun Tendulkar: వజ్రం.. దాన్ని మరో వజ్రంతో సానబెట్టినప్పుడే ధగధగ మెరుస్తుంది.. బంగారాన్ని.. వేడి చేసి సుత్తితో దెబ్బలు కొడితేనే అసలైన స్వర్ణం బయటకు వస్తుంది.. అలాగే ఒక క్రీడాకారుడు పూర్తిస్థాయిలో నైపుణ్యవంతుడు కావాలి అంటే కఠినమైన శిక్షణ అవసరం.. ఇప్పుడు అలాంటి కఠోర సాధన చేసి ఓ యువకుడు… రంజి క్రికెట్ తొలి మ్యాచ్లో సెంచరీ సాధించాడు. తొలి సెంచరీ సాధిస్తే గొప్ప ఏంటి అని మీరు అనుకోవచ్చు.. కానీ అక్కడే ఉంది అసలు ప్రత్యేకత.

సచిన్.. క్రికెట్ దిగ్గజం..బ్రాడ్ మన్ రికార్డులను అలవోకగా చేదించిన క్రికెట్ మేరునగ ధీరం. అటువంటి వ్యక్తి కొడుకు సెంచరీ చేస్తే… దాని వెనుక ఎవరు ఉన్నారు అనే ప్రశ్న కనుక వస్తే.. వచ్చే సమాధానం కచ్చితంగా సచిన్ అయి ఉంటుంది. కానీ ఇక్కడే మీరు పప్పులో కాలేశారు… ఎందుకంటే సచిన్ కొడుకు రంజీలో సాధించిన సెంచరీ వెనుక ఓ క్రికెటర్ తండ్రి ఉన్నాడు. అయితే ఇక్కడ రంజీ ట్రోఫీ లో ఆరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లో సచిన్ కుమారుడు అర్జున్ సెంచరీ చేయడం ఒక కారణమైతే… సచిన్ 44 ఏళ్ల క్రితం చేసిన ఫీట్ ను అర్జున్ పునరావృతం చేయడం గమనార్హం. అప్పట్లో సచిన్ ముంబై తరఫున సెంచరీ చేస్తే… అర్జున్ గోవా తరఫున ఆడుతూ ఈ సెంచరీ సాధించాడు. అయితే ఇక్కడ ముంబై నగరానికి చెందిన అర్జున్ టెండూల్కర్ గోవా టీంకు ఎందుకు మారాడు అనే విషయంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతున్నది.. చాలాకాలంగా ముంబై రంజి టీం లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అర్జున్… ఎంతకీ ఆ ఛాన్స్ రాకపోవడంతో ఈ రంజి సీజన్ కి ముందు తండ్రి సలహాతో గోవాకు మారాడు.
ముస్తాక్ అలీ ట్రోఫీలో..
అయితే అర్జున్ ఇంతకుముందు జరిగిన ముస్తాక్ ఆలీ ట్రోఫీలో గోవా తరఫున మంచి ప్రదర్శన కనబరిచాడు.. దీంతో అతడికి రంజీల్లో ఆడే అవకాశం దక్కింది. రాజస్థాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే 207 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 120 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే ఈ రంజీ సీజన్ కంటే ముందు తన కుమారుడి కెరియర్ ను సీరియస్ గా తీసుకున్న సచిన్ టెండుల్కర్ వెంటనే ముంబై నుంచి గోవాకు మార్చాడు. అంతేకాదు అర్జున్ టెండూల్కర్ పై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించేందుకు టీం ఇండియా ఒకప్పటి మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ చేతుల్లో పెట్టాడు. మార్చి క్రికెటర్ అయిన యోగరాజ్ సింగ్… తన కుమారుడైన యువరాజ్ సింగ్ ను గొప్ప క్రికెటర్ గా తీర్చి దిద్దడంలో విజయవంతమయ్యారు.. దాన్ని గురించి తెలుసు కాబట్టి తన కొడుకును యోగ్ రాజ్ కు అప్పగించాడు.
కఠినమైన సాధన
ఈ రంజి సీజన్ కు ముందు చండీగఢ్ లో యోగ్ రాజ్ సమక్షంలో అర్జున్ టెండూల్కర్ శిక్షణ పొందాడు.. యోగ్ రాజ్ కఠినమైన శిక్షణ ఇవ్వడంతో పూర్తిగా రాటు తేలాడు.. ఈ బంతులు ఎలా ఎదుర్కోవాలి? కష్టకాలంలో బ్యాటింగ్ ఎలా చేయాలి? ఎటాకింగ్ బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుంది? సమయోచితంగా ఆడుతూ పరుగులు ఎలా సాధించాలి? ఇలాంటి విషయాలపై యోగ్ రాజ్ శిక్షణ ఇచ్చాడు. అర్జున్ కూడా అంతకంటే ఎక్కువే కష్టపడ్డాడు. కానీ ఈ శిక్షణలో యో గ్ రాజ్ చెప్పిన మాట ఒక్కటే…” నువ్వు సచిన్ కొడుకు వి” అనే మాట మర్చిపో.. అదే నిన్ను వేరే స్థాయికి తీసుకెళ్తుందని అతనిపైన ఒత్తిడిని పూర్తిగా పోగొట్టారు.. దీంతో సచిన్ కుమారుడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగాడు. 44 ఏళ్ల క్రితం సచిన్ ముంబై జట్టుకు ఎలా బ్యాటింగ్ చేశాడు… ఇప్పుడు గోవా జట్టులోనూ అదే తీరుగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు.. ఎంతైనా పులి కడుపులో పులే పుడుతుంది.

యువి ని సైతం
యువరాజ్ కూడా ఒకానొక దశలో పరుగులు చేయడంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు యోగ్ రాజ్ అతడి ప్రతిభకు సానపెట్టారు. క్యాన్సర్ బారిన పడ్డప్పుడు కూడా సానుకూల అంశాలు అతడి మెదడులో నిక్షిప్తమయ్యేలా చెప్పేవారు.. ఇలా చెప్పడం వల్లే, అతడిని సానబెట్టడం వల్లే యువరాజ్ సింగ్ ప్రపంచంలో మేటి ఆల్ రౌండర్ అయ్యారు.. ఇదే విషయాన్ని యువరాజ్ సింగ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. మా నాన్న లేకుంటే నేను ఇక్కడిదాకా వచ్చేవాన్ని కాదని… ఇదంతా కూడా ఆయన చలవేనని ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా తన కొడుకు అర్జున్ టెండూల్కర్ బాధ్యతలను యోగ్ రాజ్ చేతిలో పెట్టారు. ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తొలి రంజీ మ్యాచ్లో సెంచరీ చేసేలా తర్ఫీదు ఇచ్చారు.. అంటే ఈ లెక్కన జూనియర్ మాస్టర్ బ్లాస్టర్ ట్రెయిన్ అవుతున్నట్టే లెక్క. తొలి మ్యాచ్లో సెంచరీ సాధించిన అర్జున్.. మున్ముందు ఎన్ని అద్భుతాలు సాధిస్తాడో వేచి చూడాలి.